ప్రాజెక్టులకు పోటెత్తిన వరద!

ABN , First Publish Date - 2020-10-14T08:12:52+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది.

ప్రాజెక్టులకు పోటెత్తిన వరద!

శ్రీశైలానికి 2.62 లక్షల క్యూసెక్కులు

దిగువకు 3.78 లక్షల క్యూసెక్కులు..

జూరాల 25.. శ్రీరామసాగర్‌ 30 గేట్ల ఎత్తివేత


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. రాష్ట్రంలో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎగువన కూడా వానలు పడుతుండడంతో పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటెత్తడంతో మంగళవారం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 2,62,490 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పది గేట్లు 15 అడుగుల మేరకు ఎత్తి 3.78 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌లోకి వదులుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.87 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 25 గేట్లను ఎత్తి 1,74,775 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.  నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో 16 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2.76లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తారు. పులిచింతల ప్రాజెక్టుకు 2.76 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 10 గేట్లు ఎత్తి 3.03 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీకి 1.37లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో అధికారులు 30 గేట్ల ద్వారా 1.25 లక్షల క్యూసెక్కుల వరదను దిగువ గోదావరిలోకి వదిలారు. కరీంనగర్‌లోని దిగువ మానేరు రిజర్వాయర్‌కు 50 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 12 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు.


Updated Date - 2020-10-14T08:12:52+05:30 IST