‘ఫ్లోరిడాలో కేసులు పెరగడానికి వారే కారణం’

ABN , First Publish Date - 2020-07-16T03:54:19+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారిపోయింది.

‘ఫ్లోరిడాలో కేసులు పెరగడానికి వారే కారణం’

ఆర్లాండో: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారిపోయింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఒక్క ఫ్లోరిడా రాష్ట్రంలోనే ఇటీవల 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఒకే రాష్ట్రంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. జూన్ 14 నుంచి ఫ్లోరిడాలో కరోనా కేసులు 226 శాతం పెరిగినట్టు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువకులు ఫేస్‌మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారని.. వారి వల్లే కరోనా వ్యాప్తి చెందుతోందని జాక్సన్ హెల్త్ సిస్టమ్ సీఈఓ కార్లస్ మిగోయా ఆరోపిస్తున్నారు. అయితే ఫ్లోరిడాకు చెందిన యువత కంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న యువతే దీనికి ఎక్కువగా కారణమని ఆయన చెబుతున్నారు. 


యువకుల నుంచి కరోనా మహమ్మారి వయసు పైడిన వారికి సోకుతోందని.. ఈ కారణంగా వారంతా ఆసుపత్రుల పాలవుతున్నారని కార్లస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలో ప్రస్తుతం 54 ఆసుపత్రుల్లో ఐసీయూలు నిండిపోయాయని.. మరో 40 ఆసుపత్రుల్లో కేవలం పది శాతం బెడ్లు మాత్రమే ఖాళీగా ఉన్నట్టు కార్లస్ పేర్కొన్నారు. యువత ఒక్కసారైనా ఐసీయూకు వచ్చి ఇక్కడ పరిస్థితిని చూడాలని.. అప్పుడైనా వారు మారే అవకాశం ఉండొచ్చని కార్లస్ అన్నారు. కాగా.. ఫ్లోరిడాలో ఇప్పటివరకు 3,01,810 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 4,521 మంది మరణించారు. అమెరికా వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు 35 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా.. లక్షా 39 వేలకు పైగా మృత్యువాతపడ్డారు.  

Updated Date - 2020-07-16T03:54:19+05:30 IST