కారు ఆపిన పోలీస్.. కరోనా ఉందంటూ బెదిరించిన వ్యక్తి

ABN , First Publish Date - 2020-03-30T20:54:56+05:30 IST

కరోనా సోకిందంటూ పోలీసు అధికారిపై దగ్గిన యువకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన క్రిస్టియన్ పెరెజ్(23)

కారు ఆపిన పోలీస్.. కరోనా ఉందంటూ బెదిరించిన వ్యక్తి

ఫ్లోరిడా: కరోనా సోకిందంటూ పోలీసు అధికారిపై దగ్గిన యువకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన క్రిస్టియన్ పెరెజ్(23) అనే యువకుడు ఫ్లోరిడాలోని స్టువర్ట్ ప్రాంతంలో వేగంగా కారు నడుపుతుండగా పోలీసులు అతడిని ఆపారు. ఇదే సమయంలో తనకు కరోనా వైరస్ ఉందంటూ పోలీసు అధికారితో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పోలీసు అధికారిపై దగ్గి బెదిరించాడు. దీంతో పోలీసు అధికారి వెంటనే అతడికి మాస్క్ తొడిగి అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. క్రిస్టియన్‌కు నిజంగా కరోనా సోకిందా లేదా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. క్రిస్టియన్‌కు కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేనట్టు అధికారులు పేర్కొన్నారు. 


ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల కోసం వైద్యులు, పోలీసు అధికారులు రేయింబవళ్లు పనిచేస్తున్నారని పైఅధికారి ఒకరు గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో వారితో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. చైనాలో పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికి.. అగ్రరాజ్యం అమెరికా మాత్రం కరోనా దెబ్బకు బెంబేలెత్తుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటివరకు అమెరికాలో లక్షా 40 వేల 886 మందికి కరోనా సోకగా.. 2,467 మంది మృత్యువాతపడ్డారు. మరోపక్క అమెరికా ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్ విధించేందుకు నిరాకరిస్తుండటంతో ప్రజలు రోడ్లపైనే తిరుగుతున్నారు. ఇలా అయితే పరిస్థితి అదుపులోకి రావడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - 2020-03-30T20:54:56+05:30 IST