ఫ్లోరిడాలో తగ్గని కరోనా ఉధృతి.. గడిచిన 24 గంటల్లో..

ABN , First Publish Date - 2020-07-29T02:56:53+05:30 IST

కరోనా మహమ్మారి ఫ్లోరిడాను కుదిపేస్తోంది. గత 15 రోజుల నుంచి ఫ్లోరిడాలో 9 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.

ఫ్లోరిడాలో తగ్గని కరోనా ఉధృతి.. గడిచిన 24 గంటల్లో..

ఆర్లాండో: కరోనా మహమ్మారి ఫ్లోరిడాను కుదిపేస్తోంది. గత 15 రోజుల నుంచి ఫ్లోరిడాలో 9 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా ఫ్లోరిడాలో 9,230 కొత్త కేసులు నమోదైనట్టు ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో ఫ్లోరిడాలో మొత్తం కేసుల సంఖ్య 4,41,977కు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో కరోనా కారణంగా 186 మంది మృత్యువాతపడ్డారు. ఫ్లోరిడాలో ఇప్పటివరకు ఒకేరోజు ఇంతమంది మరణించడం ఇదే మొదటిసారి. ఫ్లోరిడాలో ఇప్పటివరకు అత్యధికంగా ఒకేరోజులో 173 మంది మరణించగా.. ఇప్పుడు 186 మరణాలతో ఫ్లోరిడా మరో రికార్డ్ సాధించింది. ఫ్లోరిడాలో మొత్తం మరణాల సంఖ్య 6,117గా ఉంది. యువత ఫేస్‌మాస్క్ ధరించక పోవడం వల్లే ఫ్లోరిడా కరోనాకు కేంద్రంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్, అలబామా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. ఈ రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు 4,434,185 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 150,500 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-07-29T02:56:53+05:30 IST