ఫ్లోరిడాలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-06T06:48:32+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు

ఫ్లోరిడాలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

ఆక్లాండ్: అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాకు కేంద్రంగా మారిపోయాయి. ఫ్లోరిడాలో తాజాగా 9,999 కేసులు నమోదైనట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో ఫ్లోరిడాలో మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. అంతకుముందు రోజు నమోదైన 11,445 కేసులతో పోల్చితే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. మరోపక్క ఫ్లోరిడాలో ఇప్పటివరకు 3,731 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో మార్చి, ఏప్రిల్ నెలలో న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇదే సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి అదుపు తప్పింది. అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడమే కేసుల పెరుగుదలకు కారణంగా కనపడుతోంది. కాగా.. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇక్కడ నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 29,59,188 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 132,418 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-07-06T06:48:32+05:30 IST