ప్రపంచం మొత్తం తిరిగేసిన ఫ్లోరిడా వాసులు

ABN , First Publish Date - 2020-04-08T22:24:00+05:30 IST

కరోనా పాజిటివ్ సోకక ముందు ఫ్లోరిడా వాసులు ప్రపంచం మొత్తం తిరిగేసినట్టు ఫ్లోరిడా అనాలిసిస్ ఆఫ్ స్టేట్ ఇన్‌ఫెక్షన్ డేటా కనుగొంది.

ప్రపంచం మొత్తం తిరిగేసిన ఫ్లోరిడా వాసులు

ఫ్లోరిడా: కరోనా సోకక ముందు ఫ్లోరిడా వాసులు ప్రపంచం మొత్తం తిరిగేసినట్టు ఫ్లోరిడా అనాలిసిస్ ఆఫ్ స్టేట్ ఇన్‌ఫెక్షన్ డేటా కనుగొంది. ఫ్లోరిడాలో మార్చి 2 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కరోనా పాజిటివ్ కేసుల డేటాను పరిశీలిస్తే తమకు ఈ విషయం తెలిసిందని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలకు వెళ్లిన వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికి.. వీరి ద్వారా అనేక మందికి కరోనా వ్యాప్తి చెందినట్టు గుర్తించామన్నారు. కాగా.. ఫ్లోరిడాలో మొదటి కరోనా కేసు మార్చి రెండో తేదీన నమోదైంది. అప్పటి నుంచి పది రోజుల్లో మొత్తంగా 28 కేసులు నమోదుకాగా.. 23 పాజిటివ్ కేసులు ట్రావెల్‌కు సంబంధించినవిగా తేలాయి. కరోనా సోకక ముందు.. ఫ్లోరిడాకు చెందిన వారు అమెరికాలోని 46 రాష్ట్రాలకు ప్రయాణం చేసినట్టు తెలిసింది. 


అంతేకాకుండా ఫ్లోరిడా వాసులు అంటార్కిటికా తప్పించి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి వెళ్లి వచ్చినట్టు అధికారులు గుర్తించారు.38 ఏళ్ల మహిళ కరోనా సోకక ముందు దక్షిన యూరోప్‌లోని బోస్నియా, హెర్జెగొవీనాకు వెళ్లింది. 59 ఏళ్ల మరో వ్యక్తి దక్షిణ ఆఫ్రికాలోని బుర్కినా ఫాస్ నుంచి తిరిగొచ్చిన వెంటనే కరోనా బారిన పడ్డాడు. ఇక శాంటా రోసా కౌంటీకి చెందిన ఓ మహిళ కరోనా బారిన పడక ముందు ఏకంగా యూకే, ఐర్లాండ్, అమెరికాలోని మేరీల్యాండ్, మిన్నెసొటా, వర్జీనియా, వాషింగ్టన్‌లకు ప్రయాణం చేసేసింది. కాగా.. ఫ్లోరిడాలో మొత్తం 14,747 మంది కరోనా బారిన పడగా.. ప్రస్తుతం 14,351 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా బారిన పడి ఫ్లోరిడాలో 296 మంది మృతిచెందారు.

Updated Date - 2020-04-08T22:24:00+05:30 IST