లిప్ట్ కావాలంటూ పోలీసులకు ఫోన్‌ మీద ఫోన్.. చివరకు..

ABN , First Publish Date - 2020-06-28T09:19:40+05:30 IST

అమెరికాలో ఓ మహిళ 911ను దుర్వినియోగం చేసినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

లిప్ట్ కావాలంటూ పోలీసులకు ఫోన్‌ మీద ఫోన్.. చివరకు..

ఆర్లాండో: అమెరికాలో ఓ మహిళ 911ను దుర్వినియోగం చేసినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అమెరికా ప్రజలు ఎమర్జెన్సీ సమయంలో 911కు ఫోన్ చేస్తుంటారు. అయితే ఫ్లోరిడాలోని ఆర్లాండోకు చెందిన సారా(31) అనే మహిళ మాత్రం తాను వేరే ప్రాంతానికి వెళ్లేందుకు లిఫ్ట్ కావాలంటూ పోలీసులకు ఫోన్ చేసి చిరాకు తెప్పించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారా మొదటిసారి రాత్రి 2.45 గంటలకు 911కు ఫోన్ చేసింది. ఆ సమయంలో కేవలం హలో అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసేసింది. దీంతో పోలీసులు ఎమర్జెన్సీ అనుకుని కాల్ వచ్చిన ప్రాంతానికి వెళ్లారు. కానీ.. అక్కడ ఎవరూ లేకపోవడతో తిరిగి వెనక్కు వెళ్లిపోయారు. కాసేపు తరువాత మళ్లీ అదే నెంబర్ నుంచి సారా 911కు ఫోన్ చేసి కట్ చేసేసింది. మరోమారు పోలీసులు కాల్ వచ్చిన ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ ఓ ఆసుపత్రి పార్కింగ్‌లో సారా కనిపించింది. తాను వేరే ప్రాంతానికి వెళ్లాలని.. తనకు లిఫ్ట్ కావాలంటూ పోలీసులతో చెప్పుకొచ్చింది. 911 నెంబర్ కేవలం ఎమర్జెన్సీకి మాత్రమే వాడాలని.. తాము ట్యాక్సీ సేవలు అందించమంటూ పోలీసులు సూచించి వెళ్లిపోయారు. అయితే కొంతసేపు తరువాత సారా మరోసారి 911కు ఫోన్ చేయడంతో.. పోలీసులు సారాను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆమెపై కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-06-28T09:19:40+05:30 IST