కరోనా సోకిందనే అనుమానంతో.. ఫ్లోరిడాలో..

ABN , First Publish Date - 2020-03-02T07:47:51+05:30 IST

కొవిడ్-19 చైనాతో పాటు ప్రపంచదేశాలను సైతం వణికిస్తోంది. జలుబు చేయడం, దగ్గు ఎక్కువగా ఉండటం ఈ వైరస్‌లో ప్రధాన లక్షణాలుగా

కరోనా సోకిందనే అనుమానంతో.. ఫ్లోరిడాలో..

ఫ్లోరిడా: కొవిడ్-19 చైనాతో పాటు ప్రపంచదేశాలను సైతం వణికిస్తోంది. జలుబు చేయడం, దగ్గు ఎక్కువగా ఉండటం ఈ వైరస్‌లో ప్రధాన లక్షణాలుగా ఉంటాయని చెప్పడంతో.. ఈ రెండు లక్షణాలు కలిగిన వారందరూ భయపడిపోతున్నారు. తమకు కూడా వైరస్ సోకిందనే భయంతో ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ యువతి కూడా సరిగ్గా ఇదే పని చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ట్రేసీ వీస్ అనే యువతి గత వారం స్నేహితులతో కలిసి అట్లాంటిక్ బీచ్‌కు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో తనకు విపరీతమైన జలుబు, దగ్గు ఉండటంతో ట్రేసీ భయపడింది. తనకు వైరస్ సోకిందేమోనని భయభ్రాంతులకు గురైంది. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లింది. ఆసుపత్రికి వెళ్లి ఇదే విషయాన్ని చెప్పగా.. అంతర్జాతీయంగా ప్రయాణించారా అని ప్రశ్నించారు. అలాంటిది ఏమీ లేదని.. కానీ చైనాకు చెందిన కొద్ది మందిని అమెరికాలోనే కలిసినట్టు వివరించింది. అయితే వారెవరికి వైరస్ సోకలేదని చెప్పింది. 


కాగా.. ట్రేసీకి ఒంట్లో బాగోకపోవడంతో వైద్యులు కొన్ని పరీక్షలను నిర్వహించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. వైరస్‌కు సంబంధించి మాత్రం ఎటువంటి పరీక్షలు చేయనట్టు పేర్కొన్నారు. ఫ్లోరిడాలో ఇప్పటివరకు ఎవరికీ వైరస్ సోకలేదని.. పైగా ట్రేసీ కలిసిన చైనీయులకు కూడా వైరస్ లేదని వైద్యులు చెప్పినట్టు ట్రేసీ చెప్పింది. అయితే ట్రేసీ ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉంది. ఆమెకు వైరస్‌ సోకినట్టు పరీక్షలు జరిపారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వైరస్ ఉన్నట్టు తేలితే.. ఫ్లోరిడాలో మొదటి కేసు ట్రేసీదే అవుతుంది. ఈ వార్తపై ఫ్లోరిడా హెల్త్ డిపార్ట్‌మెంట్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు.

Updated Date - 2020-03-02T07:47:51+05:30 IST