వైరస్‌తో వాడిన పూలు!

ABN , First Publish Date - 2020-09-27T15:10:27+05:30 IST

రంగురంగుల పూలు సువాసనలు వెదజల్లుతుంటే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. కాసేపు కష్టాలు మర్చిపోయి ఆ అనుభూతిని ఆస్వాదిస్తాం.

వైరస్‌తో వాడిన పూలు!

ఇంటర్నెట్ డెస్క్: రంగురంగుల పూలు సువాసనలు వెదజల్లుతుంటే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. కాసేపు కష్టాలు మర్చిపోయి ఆ అనుభూతిని ఆస్వాదిస్తాం. అందుకే వివాహ శుభకార్యాలు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు.. ఇలా వేడుక ఏదైనా అలంకరణకు అందమైన పూలు ఉండాల్సిందే. కానీ ఈసారి పరిస్థితి తిరగబడింది. పూల మార్కెట్ పడిపోయింది. ఇదంతా కరోనా మహమ్మారి వల్లనే అని పూల వ్యాపారులు వాపోతున్నారు.


ప్రతియేటా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతన్న నష్టపోతుంటాడు. ఈసారి మాత్రం ఆ పాత్ర కరోనా మహమ్మారి తీసుకుంది. ఈ వైరస్ అన్ని వర్గాలతో పాటు అన్నదాతలను పరిస్థితిని కూడా అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా పూల సాగుపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. కరోనా కాటుకు మార్కెట్లు మూతపడ్డాయి, పూలన్నీ తోటల్లోనే వాడిపోయాయి. దీంతో పూలవ్యాపారం మొత్తం కుదేలయింది.


సాధారణంగా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు పూల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ నాలుగు మాసాల్లో ఇటు రైతులకు, అటు కూలీలకు చేతి నిండా పని ఉండేది. అయితే ఈసారి సీజన్ మొత్తం లాక్‌డౌన్‌లోనే గడిచిపోయింది. రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టి పూలసాగు చేసిన రైతులు.. దిగుబడి వచ్చినా అమ్ముకునే పరిస్థితి లేక దయనీయ దుఃస్థితిని ఎదుర్కొన్నారు. సెప్టెంబరులో లాక్‌డౌన్ తొలగించినా కరోనా భయం మాత్రం ప్రజల్లో ఇంకా పోలేదు. దీంతో పూల రైతులు, వ్యాపారులు గతంలో ఎప్పుడు లేనంతగా నష్టాలు చవిచూస్తున్నారు.


పూల సాగుతో లాభాలు గడించవచ్చని అటుగా మొగ్గు చూపిన రైతుల జీవితాలు కరోనా కారణంగా వాడిపోయాయి. పూల రైతులను ఈ వైరస్ కోలుకోలేని దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ తొలగించడంతో పరిస్థితులన్నీ నెమ్మదిగా సాధారణ స్థాయికి చేరుతున్నాయి. కానీ పూల వ్యాపారంలో మాత్రం ఆ పరిస్థితి కనపడటంలేదు. కరోనా భయంతో చేతులు కలపడానికే ఆలోచిస్తున్న ప్రస్తుత తరుణంలో పూల బొకేలు ఎవరూ కొనడంలేదు.


దేశంలో పూలవ్యాపార పరిస్థితిపై యూపీలోని కాన్పూర్‌ ఫూల్ మండి వ్యాపారులు స్పందించారు. ప్రస్తుతం పూలవ్యాపారం అత్యంత దయనీయంగా ఉందని, గతంలో రోజుకు 50 బండిళ్ల పూలు అమ్మేవాళ్లమని, ఇప్పుడు కేవలం 5 బండిళ్లు అమ్మడం కూడా కష్టంగా మారిందని వాళ్లు చెప్తున్నారు. కిందటి ఏడాది కేజీ వంద రూపాయలకు అమ్మిన పూలను రూ.10కి అమ్ముతున్నా కొనేవారే కరువయ్యారని వాపోతున్నారు. పూల మార్కెట్ ఇంకా లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి బయటపడలేదని అంటున్నారు.


కరోనా కారణంగా పూలసాగు కూడా గణనీయంగా తగ్గిపోయిందని రైతులు చెప్తున్నారు. వేసవిలో బాగా దిగుబడి వచ్చినా కూడా రైతులకు ప్రయోజనం లేకపోయిందని, కనీసం పూలు తెంపడానికి కూలీలను పిలిచే పరిస్థితి కూడా అప్పట్లో లేకుండా పోయిందని గుర్తుచేశారు. లాభదాయకంగా ఉంటుందని పూలసాగులో దిగిన రైతులను కరోనా చాలా దెబ్బతీసిందని, దీంతో మళ్లీ పూలసాగుకు అవసరమైన పెట్టుబడి తీసుకురావడం కూడా కష్టమవుతోందని రైతులు తెలియజేశారు. 


లాక్‌డౌన్‌ తొలగించినా దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో గుళ్లూగోపురాలు తెరవలేదు. పూలవ్యాపారులకు ముఖ్యమైన మార్కెట్ ఇదే. దీంతో వ్యాపారం అరకొరగానే ఉంటోందని, అంతేగాక పెళ్లిల్ల వంటి శుభకార్యాలు కూడా తగ్గిపోయాయని వ్యాపారులు చెప్తున్నారు. అక్కడక్కడా శుభకార్యాలు జరుగుతున్నా, పూలు కొనేవారు మాత్రం అరుదుగా ఉంటున్నారని వివరించారు. ఏదిఏమైనా ఈసారి కరోనా వైరస్‌ ధాటికి పూల వ్యాపారం వాడిపోయిందన్న మాటమాత్రం నిజం. 

Updated Date - 2020-09-27T15:10:27+05:30 IST