Abn logo
Sep 26 2020 @ 03:41AM

బాలు తోటలోని పూలు

Kaakateeya

ఉష నుంచి మనీషా దాకా 

ఎందరో ఆయన సానబట్టిన గాయకులే


దశాబ్దాలుగా స్వరరాగ గంగా ప్రవాహంలో సంగీత ప్రియులను తన్మయత్వంలో ఓలలాడించిన బాలు, తన సుస్వరాల తోటలో ఎన్నో కమ్మని గొంతులను విరబూయించారు. చిట్టి పాదాలతో అడుగులు వేసేందుకు ప్రయత్నించే బుడుగును వేలు పట్టుకొని నడిపించినట్లు.. అప్పుడే మొలకెత్తిన విత్తుకు పాదుకట్టి నీరు పోసి.. మొక్కయి శాఖలుగా విస్తరించేలా చేసినట్లు ఎందరో యువగాయకులకు ఆయన ఊతమయ్యారు. బంగారానికి సాన పెడితేనే మెరుపు వచ్చినట్లు.. ఔత్సాహిక గాయనీ గాయకులకు చిత్ర సీమలో వెలుగొందేందుకు కావాల్సిన జిలుగులు అద్దారు. పాటల పోటీ అంటే ప్రథమ, ద్వితీయ బహుమతులు కాదు.. సినీ ప్రపంచంలోకి ఘనమైన స్వాగతం లభించేలా బంగారు బాటలు పరిచారు.


ప్రయోక్త, న్యాయ నిర్ణేతగా మాత్రమే కాకుండా ఓ మార్గదర్శిగా.. శ్రేయోభిలాషిగా 1996 నుంచి మొన్న మొన్నటిదాకా ‘స్వర’ంతరాయంగా కృషి చేశారు. ఆయన స్వర సేద్యంలో చిగురులు తొడిగిన గొంతులెన్నో ఇప్పుడు సినీ తోటలో మంచి మంచి పాటలతో గుబాళిస్తున్నాయి. బాలు స్కూల్‌ అయిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయకులు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సక్సెస్‌ అయ్యారు. ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతున్నారు. వీరిలో నంది అవార్డులు అందుకున్న ఉష, గోపికా పూర్ణిమ.. వందకు పైగా పాటలు పాడిన పార్థసారథి, మల్లికార్జున్‌, అంజనా సౌమ్య సహా ఎంతో మంది గాయకులు ఉన్నారు.


24 ఏళ్ల క్రితం పాడుతా తీయగా మొట్టమొదటి సిరీస్‌ ద్వారానే ఉషను, పార్థసారథిని సినీ ప్రపంచానికి అందించారు బాలు. తొలి సిరీ్‌సలో రన్నర్‌పగా నిలిచిన కె.రామాచారి, ప్రస్తుతం సంగీత పాఠశాల ద్వారా ఎంతో మంది పిల్లలకు శిక్షణనిస్తున్నారు. గాయకులుగా ప్రత్యేక గుర్తింపు పొందిన మాళవిక, కారుణ్య కూడా పాడుతా తీయగా విజేతలే!



అలాగే కౌసల్య, హేమచంద్ర, గీతా మాధురి, లిప్సిక, మనీషా ఈరబత్తిని వంటి గాయకులు సినిమాల్లో చక్కని అవకాశాలను పొందారు. బాలూ స్కూల్‌ నుంచి వచ్చిన మిగతా గాయకులు కూడా పలు కార్యక్రమాల ద్వారా పేరుపొందారు. పలు వేదికల్లో పాడుతూ బిజీగా ఉన్నారు. యువ గాయకులే కాకుండా ఎంతో మంది చిన్నారులు కూడా బాలుడి బడిలో ‘గాన’మాలు దిద్ది ప్రాచుర్యం పొందారు. 


Advertisement
Advertisement
Advertisement