‘ఈ’ కారే కావాలి!

ABN , First Publish Date - 2021-01-07T08:29:52+05:30 IST

పర్యావరణానికి హాని కలిగించే అంశాల్లో మొదటి స్థానంలో ఉండేది వాహన కాలుష్యమే..! దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఇంధనాలను పరిచయం చేసినా.. కర్బన ఉద్గారాల విడుదలకు శాశ్వతంగా చెక్‌ పెట్టడం కేవలం విద్యుత్తు

‘ఈ’ కారే కావాలి!

భవిష్యత్తు అంతా ఈ-వాహనాలదే

నానాటికీ చమురు ధరలు పైపైకి

భారం తగ్గే మార్గం ఎలక్ట్రిక్‌ వాహనాలే!

పర్యావరణ హితం.. చౌక ప్రయాణం

సర్వీసింగ్‌, నిర్వహణ ఖర్చులూ తక్కువే

ఈ-బైక్‌ల వైపు వాహనదారుల మొగ్గు

విద్యుత్తు కార్లు, ఆటోరిక్షాలకూ డిమాండ్‌

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ

దక్షిణ భారతంలోనే మార్కెట్‌ ఎక్కువ

అందులో 40-45ు హైదరాబాద్‌లోనే

చార్జింగ్‌ స్టేషన్ల కొరతే అవరోధం?


పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు మళ్లీ పెరిగాయి! ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడంతో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం.  క్రూడాయిల్‌ ధరలు ఇలాగే పెరుగుతూ పోయి.. త్వరలోనే పెట్రోల్‌, డీజీల్‌ ధరలు లీటరుకు రూ.100 దాటినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం చాలామందిలో కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. కొత్తగా వాహనాలు కొనాలను కుంటున్నవారు ఎలక్ట్రిక్‌ వాహనాల గురించీ ఆరా తీస్తు న్నారు. పెట్రోల్‌/ డీజీల్‌ కార్లలో కిలోమీటరు ప్రయాణానికి ఎంత ఖర్చవుతుంది? అదే ఎలక్ట్రిక్‌ వాహనమైతే ఎంత అవుతుంది? అనే లెక్కలు వేస్తున్నారు. 


(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి)

పర్యావరణానికి హాని కలిగించే అంశాల్లో మొదటి స్థానంలో ఉండేది వాహన కాలుష్యమే..! దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఇంధనాలను పరిచయం చేసినా.. కర్బన ఉద్గారాల విడుదలకు శాశ్వతంగా చెక్‌ పెట్టడం కేవలం విద్యుత్తు వాహనాలతోనే సాధ్యం..! పెట్రోల్‌, డీజిల్‌ వంటివాటితో పోలిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. దీనికితోడు.. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రయాణం కూడా చౌక. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లేమో నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే భారత్‌లో ఈ-వాహనాల వినియోగం పెరుగుతోంది. పెట్రోల్‌ లేదా డీజిల్‌తో నడిచేదైనా.. ఎలక్ట్రిక్‌ కారైనా.. వాటి గురించి లెక్కలు వేయాల్సి వచ్చినప్పుడు మూడు అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది.. అప్‌ఫ్రంట్‌ కాస్ట్‌. అంటే వాహనం కొనుగోలు ధర. రెండోది ఫ్యూయెల్‌ కాస్ట్‌.


వాహనం నడవడానికి అవసరమయ్యే చమురు ధర. మూడోది.. నిర్వహణ ఖర్చు. ఈ మూడింటినీ కలిపి ‘టోటల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఓనర్‌షిప్‌ (టీసీవో)’గా ఆటోమొబైల్‌ నిపుణులు వ్యవహరిస్తారు. ఎలక్ట్రిక్‌ వాహనా(ఈవీ)ల కొనుగోలు ధర మామూలు వాహనాల కన్నా ఎక్కు వే అయినప్పటికీ.. ఇంధన, నిర్వహణ ఖర్చులు చాలా  తక్కువ. ఉదాహరణకు.. ‘‘సాధారణ బైక్‌లు మోడల్‌ను బట్టి సగటున లీటర్‌ పెట్రోలుకు 30-60 కిలోమీటర్ల దాకా మైలేజీని ఇస్తాయి. అంటే.. ఎంతలేదన్నా.. కిలోమీటరుకు రూ. 1.50 నుంచి రూ. 2.25 దాకా ఖర్చవుతుంది. కానీ, ఈ-బైక్‌లతో 20 నుంచి 40 పైసల ఖర్చులో ఒక కిలోమీటరు ప్రయాణించవచ్చు. పైగా.. సంప్రదాయ బైక్‌లకు ప్రతి 2000-3000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్‌ చే యించాల్సి ఉంటుంది. ఈ-బైక్‌లలో బ్యాటరీ 10వేల కిలోమీటర్ల వరకు.. ఇతరత్రా కీలక పరికరాలు 18వేల కిలోమీటర్ల దాకా ఎలాంటి ఢోకా లేకుండా పనిచేస్తాయి. సంప్రదాయ బైక్‌ల నిర్వహణతో పోలిస్తే.. ఈ ఖర్చు చాలా తక్కువ. కార్లకూ ఇదే సమీకరణం వర్తిస్తుంది.


ఇదీ లెక్క..

ప్రస్తుతం భారత మార్కెట్లో లభ్యమవుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌కు జీబీటీ ప్రొటోకాల్‌ను ఉపయోగిస్తున్నారు. ఆ విధానంలో బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ చేయడానికి దాదాపు గంటన్నర పడుతుంది. ఒకసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే 140 నుంచి 160 కిలోమీటర్ల దాకా తిరగొచ్చు. అదే విదేశాల్లో అందుబాటులోకి వస్తున్న సీసీఎ్‌స/సీహెచ్‌ఏడెమో చార్జింగ్‌ ప్రొటోకాల్‌ ద్వారా అయితే.. 30-40 నిమిషాల్లోనే బ్యాటరీ చార్జ్‌ అవుతుంది. ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే 250 నుంచి 350 కిలోమీటర్ల దాకా ప్రయాణించవచ్చు. బ్యాటరీ పూర్తిగా చార్జ్‌ కావడానికి 20 యూనిట్ల విద్యుత్‌ ఖర్చవుతుందనుకుంటే.. ఒక్కో యూనిట్‌కూ గరిష్ఠంగా రూ.7 వేసుకున్నా రూ.140 అవుతుంది. 300 కిలోమీటర్లకు రూ.140 అంటే.. సగటున ఒక కిలోమీటరుకు అర్ధరూపాయిలోపే ఖర్చవుతుంది.


ఒక చార్జింగ్‌కు 140-160 కిలోమీటర్ల దూరమే నడుస్తాయనుకుంటే.. సగటున కిలోమీటరుకు రూపాయికి మించి ఖర్చు కాదని అంచనా. అదే మామూలు కార్లయితే సగటున కిలోమీటరుకు రూ.3.6 నుంచి 5.6 దాకా ఖర్చవుతుంది. ఇక ఎలక్ట్రిక్‌ వా హనాలకు ఆయిల్‌ మార్పిడి, ఆయిల్‌ పిల్ట ర్‌, స్పార్క్‌ ప్లగ్‌ల మార్పిడి వంటి బాదరబందీలేవీఉండవు. మా మూలు వాహనాలతో పోలిస్తే ఈవీల్లో కదిలే భాగాలు తక్కువ ఉంటాయి. దీనివల్ల మామూలు వాహనాలకు అయ్యే నిర్వహణ ఖర్చులో దాదాపు మూడోవంతు మాత్రమే ఈవీల నిర్వహణకు అవుతుంది.  


మనమే ఫస్టు

ఆటోమొబైల్‌ రంగ నిపుణుల అధ్యయనాల మేరకు దేశవ్యాప్తంగా ఈ-వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. అందునా దక్షిణాది వారే ఎక్కువగా ఆదరిస్తున్నారు. వారిలో హైదరాబాదీలే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. దక్షిణాదిలో ఈ-వాహనాల మార్కెట్లో హైదరాబాద్‌ వాటానే 40-45 శాతంగా నమోదు కావడం గమనార్హం. ప్రభుత్వాలు విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిస్తూ ఈ-వాహన పాలసీలను విడుదల చేసిన నేపథ్యంలో.. రానున్న నాలుగేళ్లలో వీటి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్టు వాహన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.  గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. తెలంగాణలో ఈ ఏడాది ఈ-వాహనాల కొనుగోళ్లు 23ు పెరిగాయి.


ప్రకటన ఇచ్చారు.. అమలేదీ?

విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కారు గత ఏడాది ఈవీ పాలసీని విడుదల చేసింది. దాని ప్రకారం.. మొదటి రెండు లక్షల ద్విచక్రవాహనాలకు రోడ్డు ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు. మొదటి 20 వేల ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజు ఉండదు. మొదటి ఐదు వేల రెట్రోఫిట్‌ ఈ-రిక్షాలకు 15ు లేదా రూ. 15వేల వరకు ప్రోత్సాహకాలు. మొదటి 5వేల కార్ల(ప్రైవేటు)కు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ పన్ను మినహాయింపు. ఇలా ఇన్ని ఇస్తామని ప్రకటించారు గానీ, దీనికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం జారీ చేయలేదు. ఆ రాయితీలు ప్రజలకు అందట్లేదు.


చార్జింగ్‌ కేంద్రాల లేమి

ఈ-వాహనాలపై ప్రజలకు ఆసక్తి ఉన్నా.. చార్జింగ్‌ కేంద్రాల లేమి పెద్ద అవరోధంగా మారుతోంది. ఈ-వాహనాలు దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండకపోవడంతో.. ప్రజలు కొంత వెనుకంజ వేస్తున్నారని పలు అధ్యయనాలు, సర్వేలు వెల్లడించాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్తు వాహనాల కంపెనీలే చర్యలు ప్రారంభిస్తున్నాయి. భారత్‌లో ఈవీచార్జర్ల తయారీదారులైన డెల్టా ఎలకా్ట్రనిక్స్‌ ఇండియా, మాస్‌ టెక్‌, ఎగ్జికామ్‌, ఏబీబీ ఇండియా, బ్రైట్‌ బ్లూ లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా హైవేలలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఈవీ చార్జింగ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కీలక ప్రాంతాల్లో 178కి పైగా ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.  


ఈవీ కార్ల ధరలు ఇలా.. 

(సుమారుగా రూ.లక్షల్లో)

టాటా నెక్సాన్‌ ఈవీ 13.99-15.99

మహీంద్రా ఈ2వో ప్లస్‌  8.63-9.53

ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ 23.49

హ్యుందాయ్‌ కోనా ఎలక్ట్రిక్‌ 25.77

టాటా టిగోర్‌ ఈవీ 11.62

మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యుసీ 1.09

జాగ్వార్‌, ఆడి సంస్థలు కూడా ఈవీలను విడుదల చేయనున్నాయి. వీటి ధరలు కోటి నుంచి 

2 కోట్లు ఉండొచ్చని అంచనా


ఈ-బైక్‌ల ధరలు  (సుమారుగా రూ.లక్షల్లో)

ఎథర్‌ 450ఎక్స్‌, ప్లస్‌  1.42-1.61

బజాజ్‌ చేతక్‌ ఈ-బైక్‌ 1-1.15

రివోల్ట్‌ 1-1.20

హీరో ఎలక్ట్రిక్‌ ఆప్టిమా 0.44 

టీవీఎస్‌ ఐ క్యూబ్‌ 1.15

బీగౌస్‌ 0.63 

అలా్ట్రవయెలెట్‌ ఎఫ్‌77

బెన్లింగ్‌ ఫాల్కన్‌ 0.48


నాలుగు రెట్ల వృద్ధి చూశాం

ఈ-వాహనాల విషయంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నాలుగు రెట్ల వృద్ధిని హైదరాబాద్‌ నమోదు చేసుకుంది. ఇక్కడ వర్కింగ్‌ క్లాస్‌ మా ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటోంది. ఈవీ రీచార్జ్‌ స్టేషన్లు హైదరాబాద్‌లో తక్కువగానే ఉన్నాయి. 3-4 వారాల్లో 30కి పైగా ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ప్రారంభిస్తాం. విప్లవాత్మక ఉత్పత్తులను మేము విడుదల చేస్తున్నాం. మిగిలి న కంపెనీలకూ మాకు ఉన్న తేడా స్పష్టం. యూనిక్‌, లగ్జరీ ఉత్పత్తులు కావాలనుకునే వారు మా వైపు చూస్తారు. మేము ఇటీవల 125 సీసీ తరహా బైక్‌ను విడుదల చేశాం. మా వాహనాలు యాప్‌ ఆధారితంగా కూడా పనిచేస్తాయి.  

- రన్వీత్‌ సింగ్‌, సీబీవో, ఎథర్‌


లాజిస్టిక్‌ కంపెనీలు ఈ-ఆటోలనే వాడుతున్నాయి

మేము పలు ఈ-కామర్స్‌, లాజిస్టిక్స్‌ సంస్థల లాస్ట్‌మైల్‌ డెలివరీ అవసరాలు తీర్చేందుకు ఒప్పందాలు చేసుకుని, ఈ-ఆటోరిక్షాలను అందిస్తున్నాం. హైదరాబాద్‌లో ఈవీల పరంగా బైక్‌లు, కార్లు, బస్సులు, రవాణా ఆటోలు ఉన్నాయి. కానీ ప్యాసింజర్‌ ఆటోలు లేవు. ఈ-రిక్షాలకు హైదరాబాద్‌ మార్కెట్‌ ఇంకా ఓపెన్‌ కాలేదు. తెలంగాణ ఈవీ పాలసీ వాటి పెరుగుదలకు దోహదపడుతుందని భావిస్తున్నాం.

- దీపక్‌ ఎంవీ, కో-ఫౌండర్‌ అండ్‌ సీఈవో, ఈ- ట్రియో

Updated Date - 2021-01-07T08:29:52+05:30 IST