ఎయిర్‌పోర్టుకు అభిముఖంగా ఫ్లై ఓవర్‌

ABN , First Publish Date - 2021-06-25T05:51:19+05:30 IST

ఎయిర్‌పోర్టుకు అభిముఖంగా ఫ్లై ఓవర్‌

ఎయిర్‌పోర్టుకు అభిముఖంగా ఫ్లై ఓవర్‌
ఎయిర్‌పోర్టు ఎదుట ఫ్లై ఓవర్‌ ప్రతిపాదిత ప్రాంతం

గన్నవరం- విజయవాడ మార్గంలో 1.4 కిలోమీటర్ల మేర ఒక వరుసగా నిర్మాణం

ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ నిర్ణయం

ఎయిర్‌పోర్టు అధికారులతో భేటీ 

విజయవాడ, జూన్‌ 24 (ఆంధ్ర జ్యోతి) : గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభిముఖంగా పదహారో నెంబర్‌ జాతీయ రహదారిపై  ఫ్లై ఓవర్‌ ఏర్పాటుకు నాంది పడింది. విమానాశ్రయం దగ్గర రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకు న్నారు. గన్నవరం-విజయవాడ మార్గంలో ఎన్‌హెచ్‌-16పై 1.4 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) నిర్ణయించింది. ఫ్లై ఓవర్‌ను ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు గురువారం ఆర్‌అండ్‌బీ-ఎన్‌హెచ్‌, నేషనల్‌ హైవే అధికారులు ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.  

ప్రమాదాలను అరికట్టేందుకే..

16వ నెంబర్‌ జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ బృందాల నేతృత్వంలో కొంతకాలం కిందట సర్వే జరిగింది. ఈ సర్వేలో ముఖ్యమైన ప్రమాదకర ప్రాంతాలుగా పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల, గన్నవరం ఎయిర్‌పోర్టు సెంటర్లను గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పిన్నమనేని సిద్ధార్థకు అభిముఖంగా విజయవాడ బైపాస్‌ నిర్మిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇక్కడ పెద్ద రింగ్‌ వస్తుంది. ఎయిర్‌పోర్టు దగ్గర మాత్రం ఫ్లై ఓవర్‌ను నిర్మించాలన్న ప్రతిపాదనను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు పర్యవేక్షణలో సాధ్యాసాధ్యాలను గమనించాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ డివిజన్‌, ఎన్‌హెచ్‌ విజయవాడ డివిజన్లు సంయుక్తంగా అధ్యయనం చేశాక.. ప్రస్తుత ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ వైపు నుంచి సమాంతరంగా ఎన్‌హెచ్‌కు కనెక్ట్‌ అయ్యేలా ఫ్లై ఓవర్‌ నిర్మించటానికి నిర్ణయించారు.

పలు పరిశీలనల అనంతరం..

ఎయిర్‌పోర్టు అధికారులు.. ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌కు సమాంతరంగా ఉన్న రహదారిని ప్రధాన ద్వారానికి కనెక్ట్‌ అయ్యేలా చేశారు. ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు, డొమిస్టిక్‌గా ఉపయోగిస్తున్న ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌కు అనుసంధానంగా ఈ ద్వారం ఉంది. వై ఆకారంలో ఉన్న ఒక మార్గం ఇంటర్నేషనల్‌ బిల్డింగ్‌కు, మరొక మార్గం డొమిస్టిక్‌ టెర్మినల్‌కు వెళ్తాయి. ఈ ప్రధాన మార్గం కారణంగా గతంలో ప్రతిపాదించిన ఫ్లై ఓవర్‌ డిజైన్‌కు ఇబ్బంది ఏర్పడింది. దీంతో నేషనల్‌ హైవేస్‌ (ఎన్‌హెచ్‌) విజయవాడ పీడీ డీవీ నారాయణ, ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ-ఎన్‌హెచ్‌ డివిజన్‌ ఎస్‌ఈ రాఘవేంద్రరావు గురువారం ఎయిర్‌పోర్టు అధికారులతో భేటీ అయ్యారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు, జీఎం మహమ్మద్‌ తాజుద్దీన్‌ కూడా పాల్గొన్నారు. ప్రస్తుత మార్గం వల్ల ఫ్లై ఓవర్‌ డిజైన్‌ను మార్చాల్సి వస్తుందని ఎన్‌హెచ్‌ పీడీ డీవీ నారాయణ తెలిపారు. దీనికి ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మధుసూదనరావు స్పందిస్తూ ప్రస్తుత ప్రధాన మార్గం మీదుగా ఫ్లై ఓవర్‌ను నిర్మించాల్సి వస్తే భారీ విమానాలు దిగటానికి ఇబ్బంది అవుతుందన్నారు. ప్రస్తుతం ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ పక్కనే శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను నిర్మిస్తున్న నేపథ్యంలో సమాంతరంగా ఎన్‌హెచ్‌ను కలిపే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతాయని చెప్పారు. రెండో గేటు ఎక్కడి నుంచి వస్తుందన్నది వివరించారు. దీనిపై ఎన్‌హెచ్‌ అధికారులు స్పందిస్తూ రెండో గేటుకు ముందు నుంచే ఫ్లై ఓవర్‌ పనులు చేపడతామని, గేటు దగ్గర పెద్ద వెంట్‌ ఇస్తామని చెప్పారు. ఈ ఫ్లై ఓవర్‌ గన్నవరం-విజయవాడ మార్గంలో ఒక వరుసగానే ఉంటుందని, రెండో వరుసలో యథాతథంగా రోడ్డు ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చేవారు నేరుగా మొదటి గేటు నుంచి లోపలికి వెళ్తారని, విజయవాడ వైపు నుంచి వచ్చేవారు రెండో వెంట్‌ నుంచి లోపలకు వెళ్తారని వివరించారు. గన్నవరం నుంచి వచ్చే ట్రాఫిక్‌ మొత్తం కూడా ఫ్లై ఓవర్‌ మీదుగానే వెళ్తుందని విమానాశ్రయ అధికారులకు వివరించారు. 




Updated Date - 2021-06-25T05:51:19+05:30 IST