ప్రారంభం కాలేదు కానీ.. పాడైపోతోంది..!

ABN , First Publish Date - 2020-09-21T15:12:00+05:30 IST

ఆ వంతెనకు అసలు ఖాళీ ఉండదు.. నిత్యం రాకపోకలతో బిజీ బిజీగా ఉంటుంది. ప్రతీ రోజూ వేలాది వాహనాలు ఆ బ్రిడ్జి మీదుగానే వెళతాయి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలను కలిపేది ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ అయితే.. ఆ తరువాత ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు నిత్యం వినియోగించేది నిడదవోలు ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జి..

ప్రారంభం కాలేదు కానీ.. పాడైపోతోంది..!

28 ఏళ్లయినా ప్రారంభం కాని నిడదవోలు ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జి

గోతులు,పిచ్చి మొక్కలతో అధ్వానంగా తయారైన వంతెన

కన్నెత్తి చూడని అధికార గణం


నిడదవోలు(పశ్చిమ గోదావరి జిల్లా): ఆ వంతెనకు అసలు ఖాళీ ఉండదు.. నిత్యం రాకపోకలతో బిజీ బిజీగా ఉంటుంది. ప్రతీ రోజూ వేలాది వాహనాలు ఆ బ్రిడ్జి మీదుగానే వెళతాయి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలను కలిపేది ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ అయితే.. ఆ తరువాత ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు నిత్యం వినియోగించేది నిడదవోలు ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జి... ఇంతటి ప్రాధాన్యం ఉన్న బ్రిడ్జి కాస్తా నేడు అధ్వానంగా తయారైంది. అడుగు తీసి అడుగేస్తే గొయ్యి.. సమిశ్రగూడెం సెంటర్‌ నుంచి నిడదవోలు గణేష్‌ చౌక్‌ సెంటర్‌ వరకూ అంతా అధ్వానమే. ప్రతినిత్యం రాజ మండ్రి నుంచి తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి  ఉద్యో గులు వ్యాపారులు అనేక మంది ఈ బ్రిడ్జి మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఎందుకంటే నిడదవోలు - సమిశ్రగూడెం మధ్య నిర్మించిన ఆర్వోబీ ఉభయ గోదావరి జిల్లాలకు వారధి లాంటిది. 1992 డిసెంబరు నెలలో ప్రారంభం కావాల్సిన ఈ ఆర్వోబీని అప్పటి రామజన్మ భూమి గొడవల కారణంగా ప్రారంభోత్సవం వాయిదా వేశారు. 


అయితే రాకపోకలు మాత్రం యధావిధిగా సాగుతున్నాయి. సుమారు 28 ఏళ్ళు పూర్తవుతున్నా ప్రారంభోత్సవం లేకుండానే నిడదవోలులోని ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జి వాహనదారులకు సేవలంది స్తోంది. రోడ్డు భవనాల శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఫ్లై ఓవర్‌ను ఆర్‌అండ్‌బీ శాఖాదికారులు ఇటు నిడదవోలు మునిసిపాలిటీ అటు సమిశ్ర గూడెం పంచాయతీ సిబ్బంది పూర్తిగా గాలికొదిలేయడంతో బ్రిడ్జి అవసానదశకు చేరుకుంది. బ్రిడ్జిపై పడిన గోతుల కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడి మరణించిన సంఘటనలు ఉన్నాయి. మరోపక్క బ్రిడ్జిపై నడకదారి సైతం గోతులు పడ్డాయి. అయినా ఏ ఒక్కరూ కనీసం కన్నెత్తి చూడడం లేదు. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోతులమయమై పిచ్చి మొక్కలతో నిండి పోయింది. ఇకనైనా అధికారులు స్పందించి బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 





Updated Date - 2020-09-21T15:12:00+05:30 IST