నిర్ణ‌యం మార్చుకున్న ఫ్లై దుబాయ్‌...

ABN , First Publish Date - 2020-04-09T19:27:44+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ నేప‌థ్యంలో ఈ వైర‌స్ క‌ట్ట‌డికి భార‌త‌దేశం వ్యాప్తంగా మార్చి 14 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించారు.

నిర్ణ‌యం మార్చుకున్న ఫ్లై దుబాయ్‌...

దుబాయ్:  మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ నేప‌థ్యంలో ఈ వైర‌స్ క‌ట్ట‌డికి భార‌త‌దేశం వ్యాప్తంగా మార్చి 14 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించారు. దీంతో ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి భార‌త్‌కు స్పెష‌ల్ స‌ర్వీసులు న‌డప‌నున్న‌ట్లు దుబాయ్‌కి చెందిన బ‌డ్జెట్‌ ఎయిర్‌లైన్స్ ఫ్లై దుబాయ్ ప్ర‌క‌టించింది. కానీ, తాజాగా ఫ్లై దుబాయ్ త‌న నిర్ణ‌యం మార్చుకుంది. ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి కాకుండా మే 1 నుంచి ఈ స‌ర్వీసులు ఉంటాయ‌ని తెలిపింది.  క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు భార‌త ప్ర‌భుత్వం ప్ర‌యాణాల‌పై విధించిన ఆంక్ష‌లు 14 నాటికి ముగిసిపోతాయ‌ని, దాంతో 15 నుంచి య‌ధావిధిగా స‌ర్వీసులు కొన‌సాగించ వ‌చ్చని భావించిన ఈ ఎయిర్‌లైన్స్‌కు భంగ‌పాటు ఎదురైంది. ఎందుకంటే ప్ర‌స్తుతం భార‌త్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ మ‌రింత‌కాలం పొడిగించే అవ‌కాశమే అధికంగా ఉండ‌డంతో ఫ్లై దుబాయ్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంది. 


ఇక‌ భార‌త్‌లో కోజికోడ్‌, నేదుంబస్సేరిల‌తో స‌హా 7 విమానాశ్రయాల‌కు స‌ర్వీసులు న‌డిపిస్తామ‌ని ఫ్లై దుబాయ్ అధికారులు పేర్కొన్నారు. ఎయిర్‌లైన్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్న స‌మాచారం ప్ర‌కారం కోజికోడ్‌కు ఎక‌నామీ క్లాస్ టికెట్ ధ‌ర‌ రూ. 31,600, బిజినెస్ క్లాస్ టికెట్ ధ‌ర రూ. 61,800గా ఉంది. మొద‌ట విజిటింగ్ వీసాపై వ‌చ్చి దుబాయ్‌లో చిక్కుకుపోయిన వారు, ఎమ‌ర్జెన్సీలో ఉన్న వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు ఫ్లై దుబాయ్ అధికారులు పేర్కొన్నారు. అలాగే భార‌త్‌తో పాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల‌కు కూడా విమాన స‌ర్వీసులు న‌డిపించేందుకు ఈ ఎయిర్‌లైన్స్‌ రెడీ అవుతోంది.  

Updated Date - 2020-04-09T19:27:44+05:30 IST