న్యూయార్క్‌లో ఆమెది మారథాన్‌ వైద్యం

ABN , First Publish Date - 2020-06-04T14:28:04+05:30 IST

Flying jatt Milkha Singhs daughter battles Covid19 in New York

న్యూయార్క్‌లో ఆమెది మారథాన్‌ వైద్యం

‘ద ఫ్లయింగ్‌ సిఖ్‌’గా పేరొందిన అథ్లెట్‌ మిల్ఖాసింగ్‌ కూతురు మోనా మిల్ఖాసింగ్‌ మారథాన్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ మారథాన్‌ ట్రాక్‌పై కాదు. న్యూయార్క్‌లోని ఆస్పత్రిలో! కరోనా బాధితులకు అలుపెరగకుండా చికిత్స అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. మరెంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


అక్కడ కరోనా లక్షణాలతో అత్యవసరంగా అడ్మిట్‌ అయ్యే రోగులకు ముందుగా చికిత్స అందించి ధైర్యం నూరిపోసేది ఆమే! అవసరమైన వారిని క్వారంటైన్‌ కోసం పంపించి వారి బాగోగులను చూసేదీ ఆమే! న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ హాస్పిటల్‌ సెంటర్‌లో ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వార్డ్‌లో ఫిజీషియన్‌గా సేవలందిస్తున్నారు మోనా మిల్ఖాసింగ్‌. ప్రముఖ అథ్లెట్‌ మిల్ఖాసింగ్‌ కూతురైన మోనా 20 ఏళ్లుగా అమెరికాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. చండీగఢ్‌లోని సెక్టార్‌ 8లో తండ్రి మిల్ఖాసింగ్‌, తల్లి నిర్మలాకౌర్‌, సోదరుడు జీవ్‌ మిల్ఖాసింగ్‌ లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైతే, ఆమె మాత్రం 45 రోజులుగా అలుపు లేకుండా వైద్యసేవలు అందిస్తున్నారు. 


ఎమర్జెన్సీ కేసులను...

మోనా మిల్ఖాసింగ్‌ (54 ఏళ్లు) పాటియాలా మెడికల్‌ కాలేజ్‌లో వైద్యవిద్యను పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. 20 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. మోనా పనిచేసే మెట్రోపాలిటన్‌ హాస్పిటల్‌లో 111 ఐసీయూ బెడ్స్‌ ఉన్నాయు. న్యూయార్క్‌లో కరోనా బాధితులకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో ఇదొకటి. అలాంటి హాస్పిటల్‌కు కరోనా లక్షణాలతో వచ్చే ఎమర్జెన్సీ కేసులను మోనానే హ్యాండిల్‌ చేస్తున్నారు. అమెరికాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. లక్షల్లో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. రోజూ వేలమంది చనిపోతున్నారు. వైద్యులపైనా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లో ఆమె వైద్యసేవలు అందిస్తున్నారు. ‘‘కరోనా లక్షణాలతో వచ్చే వారికి మోనా చికిత్స అందిస్తోంది. క్వారంటైన్‌కు పంపించే ముందు రోగులను పరీక్షిస్తోంది. రోజూ అదొక మారథాన్‌లా పరుగెడుతోంది. ఆమెను చూస్తుంటే మాకు గర్వంగా ఉంది’’ అని సోదరుడు జీవ్‌ మిల్ఖాసింగ్‌ వివరించారు. 


కుటుంబసభ్యుల ప్రోత్సాహం

మోనా కొన్ని రోజులు డే షిప్టులు, కొన్ని రోజులు నైట్‌ షిప్టులలో పనిచేస్తున్నారు. రోజులో 12 గంటల పాటు ఆస్పత్రిలోనే గడుపుతున్నారు. ‘‘న్యూయార్క్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన వారికి ముందుగా చికిత్స అందించడంలో ఎమర్జెన్సీ ఫిజీషియన్‌గా నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందుగా వారిలో భయాన్ని తగ్గించాలి. ఇక్కడ యువకులు సైతం వ్యాధి బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రిలో వైద్యులం ఒకరికొకరం ఆలోచనలు పంచుకుంటుంటాం. నేను మా కుటుంబసభ్యులతో మాట్లాడుతుంటాను. వాళ్లు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంటారు’’ అని తన మనసులో మాటను పంచుకుంటారు మోనా. 


అయితే మోనా ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ‘‘మోనాకు తగిన జాగ్రత్తలు తీసుకొమ్మని చెప్పాం. ఆమె నాలుగు లేయర్ల ప్రొటెక్టివ్‌ సూట్‌ ధరిస్తోంది. ఎక్కువ మంది చనిపోతుండడం ఆమెకు బాధ కలిగిస్తోంది. అయినా తన కర్తవ్యం మానడం లేదు. మాతో మాట్లాడినప్పుడు ఆమె మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది’’ అని మోనా తల్లి నిర్మలా మిల్ఖాసింగ్‌ చెప్పుకొచ్చారు.


కరోనా వల్ల వేలల్లో మరణాలు సంభవిస్తుండడంతో మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. డిప్రెషన్‌లో తుపాకులతో కాల్పులు జరుపుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ‘‘కొన్ని లక్షల మంది కరోనా బారినపడ్డారు. వేలమంది మరణించారు. డిప్రెషన్‌లో తుపాకీతో కుటుంబ సభ్యులను కాల్చిన సంఘటనలూ ఉన్నాయి. అలాంటి కొన్ని కేసులకు మోనా చికిత్స అందించారు’’ అని మోనా సోదరుడు జీవ్‌ చెప్పుకొచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు సేవలందిస్తున్న మోనా ఎందరికో స్ఫూర్తి ప్రదాత.

Updated Date - 2020-06-04T14:28:04+05:30 IST