ఉలిక్కిపడ్డ అనకాపల్లి

ABN , First Publish Date - 2021-07-07T06:35:07+05:30 IST

అనకాపల్లి సమీపంలో..

ఉలిక్కిపడ్డ అనకాపల్లి

నిర్మాణంలో ఉన్న వంతెన నుంచి కుప్పకూలిన రెండు బీమ్‌లు

మిగిలిన వాటి నాణ్యతపైనా సందేహాలు

పరీక్షించాలంటున్న నిపుణులు

పరారీలో సైట్‌ ఇంజనీర్లు, సిబ్బంది

సహాయ పనుల్లో జాప్యం

ప్రమాదంపై నోరువిప్పని ఎన్‌హెచ్‌ అధికారులు


అనకాపల్లి టౌన్‌/కొత్తూరు: అనకాపల్లి సమీపంలో జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ నుంచి మంగళవారం సాయంత్రం రెండు బీమ్‌లు కూలిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఇప్పుడు మిగిలిన బీమ్స్‌ నాణ్యతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అనకాపల్లి సమీపాన పొడవైన వంతెన నిర్మిస్తున్నారు. అనకాపల్లి నుంచి విశాఖ వైపు వచ్చే మార్గంలో ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా వారం, పది రోజుల క్రితంం వంతెన కోసం నిర్మించిన పిల్లర్లపై పదహారు బీమ్‌లు అమర్చారు. సుమారు 150 అడుగులు పొడవు కలిగిన వీటిని బయట నిర్మించి తీసుకువచ్చారు. అయితే పిల్లర్‌ చివర భాగంలో అమర్చిన రెండు బీమ్‌లు మంగళవారం సాయంత్రం కూలిపోయాయి. దీంతో మిగిలిన 14 బీమ్‌ల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన బీమ్‌ల సామర్థ్యం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాగా ఘటన జరిగిన రెండు గంటల వరకు ఎటువంటి సహాయ చర్యలు సాగలేదు. కాగా, కూలిపోయిన బీమ్స్‌ను తొలగించడానికి తొలుత చిన్నపాటి క్రేన్‌ తీసుకువచ్చారు. అది సరిపోనందున తరువాత భారీ క్రేన్‌ తీసుకువచ్చి బీమ్స్‌ తొలగించారు. ఇదిలావుండగా ఘటన జరిగిన తరువాత వంతెన నిర్మాణాలను పర్యవేక్షించే సైట్‌ ఇంజనీర్లు, సిబ్బంది అక్కడ నుంచి పరారయ్యారు. కొద్దిమంది వున్నప్పటికీ కీలకమైన వ్యక్తులు అక్కడ నుంచి తప్పుకున్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు జాతీయ రహదారుల విభాగం అధికారులు స్పందించలేదు. సాధారణంగా సంబంధిత అధికారులు ఘటనా వివరాలు చెప్పాలి. ఫోన్‌లో మాట్లాడేందుకు ఎన్ని పర్యాయాలు యత్నించినా సంబంధిత ప్రాజెక్టు డైరెక్టర్‌ శివశంకర్‌ స్పందించలేదు. అయితే బీమ్స్‌ కూలిన విషయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. ప్రమాద కారణాలు ఇంకా వెల్లడికావలసి ఉందన్నారు. 


రెండు ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం

కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదంలో విశాఖపట్నం శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన సీహెచ్‌ సతీష్‌కుమార్‌, సుశాంత్‌మహంతి మృతిచెందారు. వీరి కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు గాయాలతో బయటపడ్డారు. వీరు నూతనంగా కొనుగోలు చేసిన వాహనంలో అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకొని తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  


తప్పిన పెను ప్రమాదం

విశాఖ, గాజువాక తదితర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు సంఘటన జరిగిన ప్రదేశంలోనే వేచి ఉంటుంటారు. అయితే విద్యాసంస్థలు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. అలాగే అనకాపల్లి నుంచి విశాఖపట్నం ఆర్టీసీ బస్సులు ఇదే మార్గంలో  వెళుతుంటాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఏ బస్సో ఉన్నట్టయితే...ఏం జరిగి ఉండేదో ఊహిస్తేనే భయాందోళన కలుగుతోంది. అలాగే ఫ్లై ఓవర్‌ కింద ఎప్పుడూ పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ఉంటుంటారు. అయితే మంగళవారం సాయంత్రం ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే విశాఖ నుంచి రాత్రి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చాయి. అధునాతనమైన పరికరాలతో గడ్డర్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. 


ఘటనపై నివేదిక కోరాం: కలెక్టర్‌ వినయ్‌చంద్‌

అనకాపల్లి జాతీయరహదారిపై కనెక్టింగ్‌ ఫ్లైవోవర్‌ గడ్డర్లు కూలిన ఘటనపై జాతీయ రహదారుల విభాగం ప్రాజెక్టు డైరెక్టర్‌ నుంచి నివేదిక కోరామని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ జాతీయ రహదారుల విభాగం ఆధ్వర్యంలో ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలను తెలియజేయాలని కోరామన్నారు. నివేదిక అందిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 



Updated Date - 2021-07-07T06:35:07+05:30 IST