బ్యాడ్ బ్యాంకులకు ప్రభుత్వ హామీ : నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2021-09-17T00:51:21+05:30 IST

బ్యాడ్ బ్యాంకులు జారీ చేసే సెక్యూరిటీ రిసీప్ట్స్‌కు ఐదేళ్ళపాటు

బ్యాడ్ బ్యాంకులకు ప్రభుత్వ హామీ : నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : బ్యాడ్ బ్యాంకులు జారీ చేసే సెక్యూరిటీ రిసీప్ట్స్‌కు ఐదేళ్ళపాటు ప్రభుత్వ హామీ ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్‌సీఎల్) జారీ చేసే సెక్యూరిటీ రిసీప్ట్స్‌కు రూ.30,600 కోట్లు వరకు ఐదేళ్ళపాటు ప్రభుత్వ హామీ ఇవ్వడానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఎన్ఏఆర్‌సీఎల్‌నే బ్యాడ్ బ్యాంక్ అంటారు. ఏదైనా ఫైనాన్షియల్ అసెట్‌లో అవిభాజ్యమైన హక్కు లేదా ఆసక్తిని తెలియజేసేదే సెక్యూరిటీ రిసీప్ట్. 


ఇబ్బందుల్లో ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్‌ను బ్యాడ్ బ్యాంకు కొంటుంది. 15 శాతం నగదు రూపంలో చెల్లించి, మిగిలిన 85 శాతం సెక్యూరిటీ రిసీప్ట్స్ రూపంలో ఇస్తుంది. గడచిన ఆరు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5,01,479 కోట్లు రాబట్టినట్లు నిర్మల సీతారామన్ చెప్పారు. 2018 మార్చి నుంచి రాబట్టినది దీనిలో రూ.3.1 లక్షల కోట్లు అని చెప్పారు. భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్ వంటి రిటన్-ఆఫ్ అసెట్స్‌ నుంచి రూ.99,000 కోట్లు రాబట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ హామీ వల్ల బ్యాడ్ బ్యాంకుకు తమ అసెట్స్‌ను అమ్మడానికి రుణదాతల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. 


నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)ల నిర్వహణ కోసం ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కంపెనీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు వాటా ఉంటుందన్నారు. ప్రైవేటు రంగ బ్యాంకులకు కూడా కొంత వాటా ఉంటుందని తెలిపారు. 


బ్యాంకింగ్ రంగం మెరుగుపడటం కోసం 2014 నుంచి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంక్ బోర్డ్ బ్యూరో ఏర్పాటు, కీలక పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు, ప్రణాళికాబద్ధమైన విలీనాలు వంటివాటిని అమలు చేశామన్నారు. ఎన్‌ఏఆర్‌సీఎల్ ఏర్పాటు, వివిధ ఇతర చర్యల ద్వారా ఇండియన్ బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టామన్నారు. ఇండియన్ బ్యాంకింగ్ రంగం 2015లో తమవైపు ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్‌తో చూసేదని గుర్తు చేశారు. స్ట్రెస్డ్ అసెట్స్ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడు ఓ మార్గం ఏర్పడిందని చెప్పారు. 


Updated Date - 2021-09-17T00:51:21+05:30 IST