భారీ కొనుగోళ్లకు ఎఫ్‌ఎంసీజీల కళ్లెం

ABN , First Publish Date - 2020-04-02T05:49:52+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వస్తువులు దొరుకుతాయో లేదో అన్న భయాలతో ఎగబడి వస్తువులు కొనుగోలు చేసే వారికి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కళ్లెం వేస్తున్నాయి. డీమార్ట్‌ ఇప్పటికే ఈ చర్యకు ఉపక్రమించింది. ఫ్యూచర్‌

భారీ కొనుగోళ్లకు ఎఫ్‌ఎంసీజీల కళ్లెం

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో కీలక చర్య

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వస్తువులు దొరుకుతాయో లేదో అన్న భయాలతో ఎగబడి వస్తువులు కొనుగోలు చేసే వారికి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కళ్లెం వేస్తున్నాయి. డీమార్ట్‌ ఇప్పటికే ఈ చర్యకు ఉపక్రమించింది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన ఈజీడే క్లబ్‌ స్టోర్స్‌లోనూ ఒక్కో వ్యక్తి కొనుగోలు చేసే వస్తువులు, సరుకులపై పరిమితులు విధించారు. పలు వ్యవస్థీకృత రిటైలింగ్‌ స్టోర్లు కూడా అదే ఆలోచనలో ఉన్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. డీమార్ట్‌ ఒక్కో వ్యక్తికి బియ్యం 20 కిలోలు, గోధుమ పిండి 10 కిలోలు, పప్పులు నాలుగు కిలోలు, చక్కెర 5 కిలోలకు మించి అమ్మడం లేదు. బిస్కెట్లు, నూడుల్స్‌ కూడా ఒక్కో వ్యక్తికి 12 ప్యాకెట్లకు మించి అనుమతించడం లేదు. అయితే నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల కోసం వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిటైల్‌ కంపెనీలు హామీ ఇచ్చాయి. గోదాముల్లో రెండు మూడు వారాల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నట్టు తెలిపాయి.  


కార్మికులు, డ్రైవర్ల కొరత 

ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో ఎఫ్‌ఎంజీసీ కంపెనీలు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాయి. అయితే ఇప్పటికీ ఈ కంపెనీలను కార్మికుల కొరత, డ్రైవర్ల కొరత వారిని వేధిస్తోంది. సగం మంది కూడా విధులకు రాలేకపోతున్నారు. దీంతో కంపెనీలు ఉన్న కార్మికులతోనే రెండు మూడు షిఫ్టులతో నెట్టుకొస్తున్నాయి. 

లాక్‌డౌన్‌తో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో కంపెనీలకు ముడి పదార్థాల సరఫరా కొండెక్కింది. దేశంలోని 90 లక్షల సరుకుల రవాణా ట్రక్కుల్లో అయిదు శాతం మాత్రమే ప్రస్తుతం రోడ్ల మీద తిరుగుతున్నాయి. డ్రైవర్ల కొరత అధికంగా ఉంది. సరకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు కూలీలు కూడా దొరకడంలేదని అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌  కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ)  ఒక ప్రకటనలో తెలిపింది. 


ఆటో అమ్మకాల్లో భారీగా క్షీణత

  1. ఆర్థిక మందగమనంతో పాటు కరోనా వైరస్‌ దెబ్బతో ఆటోమొబైల్‌ రంగం విలవిల్లాడుతోంది. మార్చిలో అమ్మకాలు భారీగా క్షీణించడంతో కంపెనీల పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది. దిగ్గజ కంపెనీలకు ఇంతకు ముందెన్నడూ లేని విదంగా మార్చిలో గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి. 
  2. మారుతీ సుజుకీ అమ్మకాలు మార్చి నెలలో 47 శాతం తగ్గి 83,792 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు 55 శాతం క్షీణించి 4,712 యూనిట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. మార్చితో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో మారుతీ మొత్తం అమ్మకాలు అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 16.1 శాతం క్షీణించి యూనిట్లకు చేరుకున్నాయి. 
  3. హ్యుండయ్‌ కంపెనీ మార్చిలో 32,279 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల (61,150 యూనిట్లు)తో పోల్చితే అమ్మకాలు 47.21 శాతం తగ్గాయి. 
  4. టాటా మోటార్స్‌ అమ్మకాలు మార్చిలో  82.69 శాతం క్షీణించి 12,924 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 74,679 వాహనాలను విక్రయించింది. 
  5. మహీంద్రా అమ్మకాలు భారీ స్థాయిలో 88 శాతం క్షీణించి 7,401 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 90 శాతం తగ్గి 6,130 యూనిట్లకు చేరాయి. 
  6. అశోక్‌లేలాండ్‌ అమ్మకాలు 90 శాతం క్షీణించి 2,179 యూనిట్లకు చేరాయి. దేశీయంగా అమ్మకాలు 91 శాతం తగ్గి 20,521 నుంచి 1,787కు చేరాయి. 
  7. కియా మోటార్స్‌ దేశీయ మార్కెట్లో 8,583 కార్లను విక్రయించింది. ఇంత క్షీణతలోనూ వరుసగా మూడో నెలలోనూ దేశంలో అత్యధికంగా అమ్ముడయిన ఎస్‌యూవీగా సెల్టోస్‌ నిలిచింది. 

Updated Date - 2020-04-02T05:49:52+05:30 IST