ఎట్టకేలకు ఎఫ్‌ఓబీల్లో కదలిక!

ABN , First Publish Date - 2021-01-17T09:49:42+05:30 IST

దీర్ఘకాలికంగా ప్రతిపాదనలకే పరిమితమైన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ)ల నిర్మాణం ఎట్టకేలకు ఆరంభమైంది.

ఎట్టకేలకు ఎఫ్‌ఓబీల్లో కదలిక!

నిర్మాణాలు చేపట్టనున్న జీహెచ్‌ఎంసీ..

3 మాసాల్లో సిద్ధం కానున్న 28..

జీవీకే మాల్‌ వద్ద పనులు ప్రారంభం

ఆరు వారాల్లో అందుబాటులోకి: అర్వింద్‌  


హైదరాబాద్‌ సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలికంగా ప్రతిపాదనలకే పరిమితమైన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ)ల నిర్మాణం ఎట్టకేలకు ఆరంభమైంది. పాదచారులు సురక్షితంగా రహదారులు దాటేందుకు ఉద్దేశించిన వీటిని తానే స్వయంగా నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. మూడు మాసాల్లో మొత్తం 28 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీల నిర్మాణాలు పూర్తి చేసి పాదచారులకు అందుబాటులోకి తెచ్చేందుకు నడుం బిగించింది. హెచ్‌ఎండీఏ మరో ఐదు ఎఫ్‌ఓబీలను నిర్మిస్తుండగా.. మొత్తంగా వీటి సంఖ్య 33కి చేరుకోనుంది. పోలీసులు నిర్వహించిన సర్వే ప్రకారం నగరంలోని 52 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు నిర్మించాలని నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో పాదచారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని పోలీస్‌ విభాగం తేల్చింది. ఈ క్రమంలో పాదచారుల రక్షణ కోసం ఎఫ్‌ఓబీల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది.


గతంలో హెచ్‌ఎండీఏకు ఎఫ్‌ఓబీల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించగా.. కేవలం ఐదు ప్రాంతాల్లోనే ఆ సంస్థ పనులు చేపట్టింది. ఆపై చేతులెత్తేసింది. దీంతో తిరిగి జీహెచ్‌ఎంసీనే నిర్మించాలని నిర్ణయానికి వచ్చింది. 


జీహెచ్‌ఎంసీ నిధులతో...

పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో ఎఫ్‌ఓబీలు నిర్మించాలని భావించినా... ఏజెన్సీలు ముందుకు రాలేదు. పాదచారుల వంతెనలు నిర్మించి ప్రకటనల ద్వారా ఆదాయం పొందాలన్నది నిబంధన. ఆర్ధికంగా ప్రయోజనముండదని భావించి నిర్మాణాలకు ఎవరూ ముందుకు రాలేదని గతంలో అధికారులు పేర్కొన్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ తానే ఎఫ్‌ఓబీలు నిర్మించాలని నిర్ణయించింది. 52 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు, 11 చోట్ల స్కై వాక్‌లకు రూ.208 కోట్లు అవసరమని అంచనా వేయగా, ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వమూ ఆమోదం తెలిపింది. దీంతో దశల వారీగా పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ 28 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు నిర్మిస్తుండగా, హెచ్‌ఎండీఏ నిర్మిస్తోన్న వాటితో కలిపి ఈ సంఖ్య 33కు చేరనుంది. వీటిలో దివ్యాంగులు, వయోధికులకు లిఫ్ట్‌ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. కాగా, బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్‌ వద్ద ఎఫ్‌ఓబీ నిర్మాణ పనులు షురూ అయ్యాయని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆరు వారాల్లో  ఈ ఎఫ్‌ఓబీ అందుబాటులోకి వస్తుందని, 3 నెలల్లో మరో 27ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు సిద్ధమవుతాయని  శనివారం ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-17T09:49:42+05:30 IST