మట్కా, అక్రమ మద్యంపై గురి

ABN , First Publish Date - 2022-01-24T05:44:20+05:30 IST

డోన్‌ ప్రాంతంతో మట్కా, అక్రమ మద్యం, పేకాటలపై జిల్లా పోలీసు బాస్‌ గురి పెట్టారు. శనివారం అర్ధరాత్రి డోన్‌లో ఎస్పీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు.

మట్కా, అక్రమ మద్యంపై గురి

డోన్‌, జనవరి 23: డోన్‌ ప్రాంతంతో మట్కా, అక్రమ మద్యం, పేకాటలపై జిల్లా పోలీసు బాస్‌ గురి పెట్టారు. శనివారం అర్ధరాత్రి డోన్‌లో ఎస్పీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. ఈ దందాను నడుపుతున్న దాదాపు 50 మందిని అదుపులోనికి తీసుకొని కర్నూలుకు తరలించారు. పట్టణంలో మట్కా, అక్రమ మద్యం వ్యాపారం పెద్దఎత్తున నడుస్తున్నది. పేకాట జూదం కూడ జోరుగా నడుస్తున్నది. మండలంలోని ఆయా గ్రామాల్లో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పోలీసులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపు కుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల అండతోనే ఈ దందా విచ్చల విడిగా నడుస్తుందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. 


పోలీసు బాస్‌ సీరియస్‌


 డోన్‌లో నడుస్తున్న మట్కా, అక్రమ మద్యం, పేకాట దందాను ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ఈ దందాలో దాదాపు 50 మంది పేర్లను సేకరించినట్లు తెలుస్తుంది. వాటి ఆధారంగా శనివారం అర్ధరాత్రి డోన్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకొని కర్నూలుకు తరలించారు. ఇందులో అధికార పార్టీకి చెందిన పలువురి నాయకుల అనుచరులు ఉన్నట్లు సమాచారం. స్థానిక  పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండా డోన్‌లో ఈ దాడులు జరిగాయి. స్పెషల్‌ పోలీసుల దాడులతో ఒక్కసారిగా డోన్‌లో కలకలం రేపింది. ఈ పరిణామాలు అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించాయి.

Updated Date - 2022-01-24T05:44:20+05:30 IST