బహిరంగ మద్యపానంపై దృష్టి పెట్టండి

ABN , First Publish Date - 2021-09-18T07:59:42+05:30 IST

బహిరంగంగా మద్యం తాగడాన్ని, గంజాయిని అరికట్టాలని తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్పీ వెంకటఅప్పలనాయుడు అధికారులకు సూచించారు.

బహిరంగ మద్యపానంపై దృష్టి పెట్టండి
నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటఅప్పలనాయుడు

అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడమే మన బాధ్యత

నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ అప్పలనాయుడు


తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 17: బహిరంగంగా మద్యం తాగడాన్ని, గంజాయిని అరికట్టాలని తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్పీ వెంకటఅప్పలనాయుడు అధికారులకు సూచించారు. ఎస్వీయూ సెనెట్‌ హాలులో గురువారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అసాంఘిక కార్యక్రమాలను అరికట్టి, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడమే పోలీసులుగా మన బాధ్యతన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడం ఎంత ముఖ్యమో ప్రజల ఆస్తులను కాపాడటమూ అంతే ముఖ్యమన్నారు. జిల్లాలో దొంగతనాలు, దోపిడీలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. నేరస్తులను గుర్తించేందుకు, నేరాలను అరికట్టేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. ఫిన్స్‌, మొబైల్‌ సెక్యూరిటీ చెక్‌ డివైజ్‌ పాపిల్లాన్‌ పరికరాలతో రద్దీ ప్రాంతాల్లో క్రమం నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. మహిళలు, పిల్లలకు సంబంధించిన ఫిర్యాదులు, మిస్సింగ్‌ కేసులకు తొలి ప్రాధాన్యామివ్వాలని సూచించారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలు, నగర శివారు ప్రాంతాలు, ఆలయాలవద్ద నిఘా పెంచాలన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌ ముఖ్యమని చెప్పారు. అనవసరంగా ఎవరినీ స్టేషన్‌కు తీసుకురావొద్దని, అవసరం ఉండి తీసుకొస్తే  పని ముగించి త్వరగా పంపించేయాలని చెప్పారు. స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరీఫుల్లా, మునిరామయ్య, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 


ప్రతిభ చూపిన పోలీసులకు శోభిత, శోధన జ్ఞాపికలు 

విధినిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచి, వివిధ కేసులను చాకచక్యంగా పరిష్కరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు అభినందించారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనెట్‌హాల్లో గురువారం నేర సమీక్షా సమావేశం జరిగాక వారికి శోభిత, శోధన విభాగాలుగా జ్ఞాపికలు అందజేశారు. ప్రతిభకు ఎప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. 


23 మందికి జ్ఞాపికలు 

శోభిత విభాగంలో ముగ్గురు, శోధన విభాగంలో 20 మంది చొప్పున 23 మందికి ఎస్పీ జ్ఞాపికలను అందించారు. 

శోభిత: సీఐలు శివప్రసాద్‌ (తిరుపతి వెస్ట్‌), సి.హరిప్రసాద్‌ (ట్రాఫిక్‌), వి.శ్రీహరి (ఏర్పేడు)

శోధన: సీఐ ఆరోహణరావు (బీఎన్‌ కండ్రిగ), ఎస్‌ఐలు రాఘవేంద్ర (తొట్టంబేడు), టి.వెంకటసుబ్బయ్య (శ్రీకాళహస్తి 1టౌన్‌), ఽధర్మారెడ్డి (శ్రీకాళహస్తి రూరల్‌), ఏఎ్‌సఐ మురళి (ఎం.ఆర్‌.పల్లె), హెడ్‌కానిస్టేబుళ్లు శంకర్‌ (ఎం.ఆర్‌.పల్లె), కె.గోపీకృష్ణ (తిరుపతి సీసీఎస్‌), బీఎస్‌ రమేష్‌ సీసీఎస్‌), సి.రవి (తొట్టంబేడు), కానిస్టేబుళ్లు హేమంత్‌కుమార్‌, ఎస్‌.యుగంధర్‌, ఎ.వాసు, ఎన్‌.భక్తవత్సలం, బి.మునిరెడ్డినాయక్‌ (తొట్టంబేడు), పి.శరత్‌బాబు, జి.అరుణ్‌కుమార్‌ (బీఎన్‌ కండ్రిగ), వీఎన్‌ఎల్‌ ప్రసాద్‌, వైఎస్‌ మోహన్‌కుమార్‌, జి.భారుష (సీసీఎస్‌), ఐ.అప్పలరాజ్‌ (శ్రీకాళహస్తి రూరల్‌). 

Updated Date - 2021-09-18T07:59:42+05:30 IST