కాంగ్రెస్‌లో కాకలు తిరిగిన యోధుడిగా ఉన్న ఆయనపై తిరుగుబాటు చేస్తున్నదెవరు..!?

ABN , First Publish Date - 2021-01-15T17:04:13+05:30 IST

కాంగ్రెస్ పార్టీలో ఆయన కాకలు తిరిగిన యోధుడు. సుదీర్ఘ రాజకీయానుభవంతో ...

కాంగ్రెస్‌లో కాకలు తిరిగిన యోధుడిగా ఉన్న ఆయనపై తిరుగుబాటు చేస్తున్నదెవరు..!?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆయన కాకలు తిరిగిన యోధుడు. సుదీర్ఘ రాజకీయానుభవంతో పాటు ఢిల్లీ వరకు పలుకుబడి గల నాయకుడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ప్రజలతో సత్సంబంధాలున్న నేత.. సుమారు మూడు దశాబ్దాలుగా తన నియోజకవర్గాన్ని ఏలిన నేతకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్కడిగా ఉన్న ఆ నాయకుడికి పక్కలో బల్లెం వచ్చి చేరింది. ఆయనకు వ్యతిరేకంగా మరో వర్గం వేళ్ళూనుకుంటోంది. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆ నాయకుడెవరు? ఆయన పై ఎవరు తిరుగుబాటు చేశారు? ఎందుకు? వాచ్ దిస్ ఇంటరెస్టింగ్ స్టోరీ..


ఎందుకిలా..!?

షబ్బీర్‌ అలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. యువజన కాంగ్రెస్‌ నేతగా రాజకీయ అరంగేట్రం చేసిన షబ్బీర్‌ అలీ.. అంచలంచెలుగా ఎదిగారు. చిన్న వయసులోనే కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవీని చేపట్టారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలకమైన విద్యుత్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయారు. శాసన మండలి ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షబ్బీర్ అలీ పెద్ద దిక్కుగా ఉన్నారు. జిల్లా వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయంటారు.


ఎడమొహం పెడమొహం..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైనారిటీ నేతగా షబ్బీర్‌ అలీకి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ పరిచయాలు, పలుకుబడి వల్ల కామారెడ్డి జిల్లాలో ఏలుబడి సాగిస్తున్నారు. అయితే, గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీచేసిన మదన్ మోహన్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు ఎంపీ టికెట్ ఇప్పించడంలో షబ్బీర్ అలీ కీలకంగా పనిచేశారు. తొలిరోజుల్లో చేయీ చేయీ కలిపి తిరిగిన ఈ ఇద్దరు నేతలు ఎంపీ ఎన్నికల తర్వాత ఎడమొహం పెడమొహంగా మారారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో షబ్బీర్ అలీతో పాటు ఆయన అనుచరులు తనకు పూర్తి స్థాయిలో సహకరించలేదని మదన్ భావించారట. ప్రధానంగా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో అంతంతమాత్రంగా పనిచేశారని గుర్తించారట. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో పార్టీ ముఖ్యనేతల ముందు చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా చెబుతారు. దాంతో మదన్ మోహన్‌కు షబ్బీర్ అలీకి సంబంధాలు బెడిసికొట్టాయి. క్రమంగా ఇరువురి మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మదన్ మోహన్ సొంతగా బలపడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. 


అందుకే ఖటీప్‌ చెప్పారా..!?

కామారెడ్డి జిల్లాలోకాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తున్న షబ్బీర్ అలీకి ప్రస్తుతం మదన్ మోహన్ చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. తనకంటూ ప్రత్యేక వర్గాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. చాలామంది సీనియర్లు, షబ్బీర్ అలీ ప్రధాన అనుచరుల్లో కొందరు గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలోకి జంపయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసిందని ఈ వర్గమే అన్న ఆరోపణ ఉంది. షబ్బీర్ అలీతో ఇమడలేకే వారు కాంగ్రెస్‌కు ఖటీప్‌ చెప్పారనే ప్రచారంలో ఉంది. తాజాగా మదన్ మోహన్ లాంటి అసంతృప్తులు, పార్టీ మారిన సీనియర్లపై దృష్టి పెట్టారు. దీంతో పాటు పార్టీలో ఉన్న నియోజకవర్గ స్థాయి నేతలను చేరదీస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో యువ నేతలు ప్రస్తుతం మదన్ వెంట తిరుగుతున్నారు.


యువతరాన్ని ఆకట్టుకునేలా..!

ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్య నేతలు కొందరు మదన్ మోహన్‌ గ్రూపులో చేరిపోయారట. మహిళా కాంగ్రెస్ జిల్లాధ్యక్షురాలు జమున రాథోడ్, మరికొందరు ద్వితీయ శ్రేణి నేతలు, జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంగారాం మదన్ వర్గంలో ఉన్నట్లు సమాచారం. బాన్సువాడలో మొన్న ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేత ఒకరు మదన్‌కు ప్రధాన అనుచరుడిగా మారిపోయారని చెబుతారు. అప్పట్లో తన టికెట్‌కు షబ్బీర్ అడ్డుపడ్డారన్న కోపంతో ఆయన మదన్‌కు అండగా నిలిచారని అంటారు. ఇలాంటి సీనియర్లతో పాటు ప్రధానంగా యువతను ఆయన చేరదీస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న మదన్ మోహన్ యువతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఇలియాస్‌ను ఓడించి..!

అయితే ఇటీవల జరిగిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల్లో మదన్ మోహన్ వర్గీయుడు గజానన్ పటేల్ విజయం సాధించడం చర్చకు దారితీసింది. జుక్కల్ నియోజకవర్గానికి చెందిన గజానన్ పటేల్‌ ఏకంగా షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్‌ను ఓడించి ఈ పోస్టు దక్కించుకున్నారు. మొదట్లో షబ్బీర్ అలీ తన కుమారుడు ఇలియాస్‌ను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించారు. ఎప్పుడూ ఏకగ్రీవంగా జరిగే ఈ ఎంపికకు ఈ సారి ఇలియాస్ పేరు ప్రతిపాదిస్తూ పార్టీ హైకమాండ్‌కు వర్తమానం పంపారు. కానీ, మదన్ మోహన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరికొందరు పోటీదారులున్నారని, ఎన్నిక నిర్వహించాలని ఆయన పట్టుబట్టారు. దాంతో ఆన్‌లైన్‌లో పోలింగ్ నిర్వహించారు.


ఎలా కాపాడుకుంటారో..!?

ఈ ఎన్నికలో గజానన్ పటేల్‌కు 4702 ఓట్లు రాగా, ఇలియాస్‌కు 4120 ఓట్లు పడ్డాయి. 582 ఓట్ల మెజారిటీతో గజానన్ విజయం సాధించారు. దాంతో షబ్బీర్ అలీ ఆధిపత్యానికి  మొదటి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. స్వయానా తన కొడుకునే ఆయన గెలిపించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తుందట. మదన్ మోహన్ పట్టుబట్టి మరీ షబ్బీర్ అలీ కుమారుడిని ఓడించాలని గట్టిగా శ్రమించారని అంటారు. ఈ విజయంతో ఆయన షబ్బీర్‌కు కౌంటర్ ఇచ్చారని, రాబోయే రోజుల్లో ఆయన వర్గం మరింత కీలకంగా మారనుందని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.  అయితే, ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం వహించిన షబ్బీర్ అలీ ఈ వర్గ పోరును ఎలా ఎదుర్కొంటారో? మసకబారుతున్న తన ప్రాభవాన్ని ఎలా కాపాడుకుంటారో చూడాలి.



Updated Date - 2021-01-15T17:04:13+05:30 IST