అసభ్య మెసేజ్‌లు పెడుతున్నారు

ABN , First Publish Date - 2021-08-03T07:20:22+05:30 IST

ఎవరో కొంతకాలంగా తన సెల్‌ఫోన్‌కు అసభ్యంగా మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నారంటూ ఓ బాధితురాలు సోమవారం అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

అసభ్య మెసేజ్‌లు పెడుతున్నారు

బాధితురాలి ఫిర్యాదుపై ఎస్పీ చర్యలు


తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 2: ‘ఎవరో కొంతకాలంగా తన సెల్‌ఫోన్‌కు అసభ్యంగా మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో నేను సెల్‌ నెంబరు మార్చేశాను. కొత్త నెంబరుకు కూడా మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నారు. మానసికంగా క్షోభ పడుతున్నాను. దీనిపై చర్యలు తీసుకోండి’ అంటూ శ్రీకాళహస్తికి చెందిన ఓ బాధితురాలు సోమవారం అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడుకు మొరపెట్టుకున్నారు. తిరుపతిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఆమె వచ్చి.. తన సమస్యను చెప్పారు. దీనిపై సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఎస్పీ సమాచారం అందించి వెంటనే నిందితుడిని గుర్తించాలని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసు అధికారులు అప్పటికప్పుడు నిందితుడి లొకేషన్‌ను గుర్తించడంతో పాటు అతడి వివరాలను తెలుసుకుని ఎస్పీ కార్యాలయంలోనే ఉన్న బాధితురాలికి చూపించి నిర్ధారణ చేసుకున్నారు. అనంతరం బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.   

47 ఫిర్యాదులు: ఎస్పీ స్పందన కార్యక్రమానికి మొత్తం 47 ఫిర్యాదులు అందాయి. అర్బన్‌ జిల్లాలోని వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్న ఎస్పీ వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. 

Updated Date - 2021-08-03T07:20:22+05:30 IST