భామా నా రాజమణి...

ABN , First Publish Date - 2020-11-18T05:41:23+05:30 IST

పల్లెల్లోకి వెళితే ఒకప్పుడు అందరి నోటా జానపదాలు పల్లవులై సాగేవి. పాశ్చాత్య సంగీతం విస్తృతమయ్యాక ఆ బాణీలు ‘తెర’మరుగయ్యాయి. అప్పుడప్పుడూ సినీ గీతాలై మురిపించినా అది పరిమితమే. కానీ ఇప్పుడు యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలు వచ్చాక... జానపదాలకు మళ్లీ జీవం వచ్చినట్టయింది...

భామా నా రాజమణి...

పల్లెల్లోకి వెళితే ఒకప్పుడు అందరి నోటా జానపదాలు పల్లవులై సాగేవి. పాశ్చాత్య సంగీతం విస్తృతమయ్యాక ఆ బాణీలు ‘తెర’మరుగయ్యాయి. అప్పుడప్పుడూ సినీ గీతాలై మురిపించినా అది పరిమితమే. కానీ ఇప్పుడు యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలు వచ్చాక... జానపదాలకు మళ్లీ జీవం వచ్చినట్టయింది. ఔత్సాహికులైన యువ కళాకారులు కొందరు ఆ గీతాలను ఆలపిస్తూ అలరిస్తున్నారు.


విశేషమేమంటే... ఆ పాటలను వీక్షించేవారూ అంతే స్థాయిలో పెరుగుతున్నారు. స్టార్ల సినిమా పాటలకు తీసిపోనంతగా వ్యూస్‌ వస్తున్నాయంటే జానపదాలకు నేటి తరంలో ఉన్న క్రేజ్‌ ఏపాటిదో వేరే చెప్పక్కర్లేదు. అలా వచ్చి మురిపిస్తున్న మరో జానపద గీతమే ‘నా రాజమణి’. పాటకు తగ్గట్టుగా చక్కని అభినయం కూడా జోడించి రూపొందించిన ఈ వీడియో సాంగ్‌ రెండు రోజుల కిందట యూట్యూబ్‌లో విడుదలైంది. ఇప్పటికి దాదాపు ఐదు లక్షలమంది వీక్షించారు. వేలమంది లైక్‌లు కొట్టారు. పచ్చని పైరులు, పల్లె అందాల మధ్య చీత్రీకరించారు. 


  • కాలా కాలాల కాడ నా నాయి దొరో 
  • ఏటీ కాలాల కాడ నా నాయి దొరో 
  • నాకు దైవం దొరికెనే భామ నా రాజమణి 
  • ఆ దైవం తీసుకొని నా రాజమణి...

అంటూ సాగే ఈ బాణీ ఎంతలా చిందులేయిస్తుందో... డిజిటల్‌ తెరపై చూస్తున్నంతసేపూ అంతే ఆహ్లాదంగా ఉంటుంది. ఇద్దరు ప్రేమికులు ముద్దు ముచ్చట తీర్చుకొనే ఈ గీతాన్ని దర్శకుడు పార్వతీ మహేశ్‌ చక్కగా తెరకెక్కించాడు. ఇందులో నాయి దొరగా నటించింది, పాట రాసింది కూడా అతడే. ఇక రాజమణిగా మేఘన అభినయం ఈ ఆల్బమ్‌కే హైలైట్‌. రామునిపట్ల లావణ్య, దిలీప్‌కుమార్‌లు మధురమైన గళాన్ని అందించారు. మొత్తానికి ‘నా రాజమణి’ గీతం జానపదాలు ఇష్టపడేవారే కాదు, మంచి బీట్‌ కోరుకొనేవారందరినీ అలరిస్తుంది.  

Updated Date - 2020-11-18T05:41:23+05:30 IST