నియమాలు పాటిస్తేనే భద్రత

ABN , First Publish Date - 2021-01-21T05:45:38+05:30 IST

రహదారి నియమాలు పాటిస్తే జీవితాలకు సంపూర్ణ భద్రత లభిస్తుందని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు.

నియమాలు పాటిస్తేనే భద్రత

  1. కలెక్టర్‌ వీరపాండియన్‌
  2. రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ఉత్సవాలు


కర్నూలు(న్యూసిటీ), జనవరి 20: రహదారి నియమాలు పాటిస్తే జీవితాలకు సంపూర్ణ భద్రత లభిస్తుందని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 32వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను బుధవారం నిర్వహించారు. కలెక్టర్‌, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ రామసుందర్‌రెడ్డి, రవాణా శాఖ ఉప  కమిషనర్‌ చందర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రవాణా శాఖ ప్రచురించిన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరిం చారు. ఫిబ్రవరి 17 వరకు రవాణా, అనుబంధ శాఖల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. డ్రైవర్లు వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలని సూచించారు. జాతీయ రహదా రులపై బ్లాక్‌ స్పాట్‌లలో ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. 

రహదారులపై క్రమశిక్షణ పాటించి ప్రాణాలు కాపాడాలని ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్‌ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కె సుబ్రమణ్యం, ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా, డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య, ఎంవీఐలు రాజగోపాల్‌, కన్నసాగర్‌ రెడ్డి, రవీంద్రకుమార్‌, శివశంకర్‌, పద్మభూషణ్‌, సునీల్‌కుమార్‌, శివలింగయ్య,  అనిల్‌కుమార్‌, జయశ్రీ, దీపిక, భాగ్యశ్రీ, లక్ష్మీప్రస్న, ఆటో, లారీ యూనియన్ల ప్రతినిధులు, డ్రైవర్లు, వాహనదారులు పాల్గొన్నారు.

 ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, రెవెన్యూ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌, ఎన్టీవోస్‌ అసోసియేషన్‌, అగ్రికల్చర్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ క్యాలెండర్లను కలెక్టర్‌ వీరపాండియన్‌, అధికారులు ఆవిష్కరించారు. 


నాణ్యమైన బియ్యం అందించేందుకే మినీ ట్రక్కులు: కలెక్టర్‌ 

కర్నూలు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):  రేషన్‌ కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యం అందించేందుకే ప్రభుత్వం మినీ ట్రక్కులను ప్రవేశ పెట్టిందని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఆయన మినీ ట్రక్కుల పంపిణీపై విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 21న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో మినీ ట్రక్కులను ప్రారంభిస్తున్నారని, అదే రోజు స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మినీ ట్రక్కుల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,436 చౌక దుకాణాల పరిధిలో 12 లక్షల బియ్యం కార్డులున్నాయని, 2 వేల కార్డులకు ఒక ట్రక్కు చొప్పును మొత్తం 760 మినీ ట్రక్కులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ఇందులో పది శాతం లబ్ధిదారుల వాటా, 30 శాతం రుణం కాగా మిగతా సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుందన్నారు. స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీవోలతో నోడల్‌ టీములను ఏర్పాటు చేసి డోర్‌ డెలివరీపై వాహన దారులకు నెల పాటు శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం బియ్యం పంపిణీ బ్యాగులను కలెక్టర్‌, జేసీ రాంసుందర్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో పుల్లయ్య, సివిల్‌ సప్లై డివిజినల్‌ మేనేజర్‌ షర్మిల తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:45:38+05:30 IST