సంక్రాంతి.. రుచులే వేరయా!

ABN , First Publish Date - 2021-01-13T05:42:32+05:30 IST

హిందూ సంప్రదాయంలో ప్రధానమైనది సంక్రాంతి పండుగ. ఈ పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. దేశ, విదేశాల్లో స్థిర పడినవారైనా సంక్రాంతికి సొంతూరు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. స్నేహితులు, బంధువులు, కొత్త అళ్లుళ్లతో ప్రతి ఇళ్లూ కళకళలాడుతుంటుంది. ముఖ్యంగా పల్లెల్లో ఆ సందడే వేరు. రకరకాల పిండి వంటలు ఘుమ ఘుమలాడే వాసనలు వెదజల్లుతుంటాయి.

సంక్రాంతి.. రుచులే వేరయా!

పిండి వంటకాలదే సింహభాగం

మాంసాహారులకూ సందడే...

విజయనగరం (ఆంధ్రజ్యోతి)

హిందూ సంప్రదాయంలో ప్రధానమైనది సంక్రాంతి పండుగ. ఈ పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. దేశ, విదేశాల్లో స్థిర పడినవారైనా సంక్రాంతికి సొంతూరు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. స్నేహితులు, బంధువులు, కొత్త అళ్లుళ్లతో ప్రతి ఇళ్లూ కళకళలాడుతుంటుంది. ముఖ్యంగా పల్లెల్లో ఆ సందడే వేరు. రకరకాల పిండి వంటలు ఘుమ ఘుమలాడే వాసనలు వెదజల్లుతుంటాయి. 

పండి వంటలతో హడావుడి...

సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇళ్లూ రకరకాల పిండి వంటకాల ఘుమఘుమ వాసనలతో నిండిపోతుంది. నేతితో చేసిన అరెసలు, కజ్జికాయలు, సున్నుండలు, బొబ్బట్లు, నువ్వు ఉండలు... ఒకటేమిటి ఇలా రకరకాల వంటకాలు సంక్రాంతి నాడే మనం చూస్తుంటాం. వీటిని ఆరగించేందుకు చిన్నా... పెద్ద అన్నతేడా లేకుండా ఆసక్తి చూపుతుంటారు.

మాంసం ప్రియులకు పండగే...

భోగి, సంక్రాంతి రోజుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిమగ్నమవ్వగా... కనుమ రోజు మాత్రం మాంసప్రియుల హడావుడి అంతాఇంత కాదు. పొట్టేళ్లు, కోడి మాంసాలతోపాటు చేపలు, రొయ్యలు తదితర వాటితో రకరకాల వంటకాలు చేసుకుని ఆరగిస్తుంటారు.  

అంతా ఒకేచోట చేరి...

కొత్తవలస రూరల్‌ (ఎల్‌.కోట) : ఎల్‌.కోట మండలం చందులూరు పంచాయతీ కసిరెడ్డివానిపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన సుమారు 500 మంది ఒకే చోట చేరి సంక్రాంతిని ఏటా సందడిగా జరుపుకుంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులపాటూ పిల్లాపాపలతో ఆనందంగా గడుపుతుంటారు. ఎక్కడెక్కడో స్థిరపడిన కసిరెడ్డి ఇంటిపేరునున్న వారంతా సంక్రాంతికి గ్రామానికి చేరి అటపాటలు, సామూహిక భోజనాలతో సందడి చేసుకుంటారు. మంగమ్మ పేరంటాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. వీరి ప్రతీ ఒక్కరి పేరులో మంగమ్మను కలుపుకోవడం విశేషంగా గ్రామస్థులు చెబుతుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సందడిగా జరుపుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకుంటున్నారు.

భోగి మంటకు దూరంగా.. 

గరుగుబిల్లి : రావుపల్లి గ్రామస్థులు భోగి పండగకు కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఆరు దశాబ్దాల కిందట గ్రామానికి చెందిన కోడి అప్పన్న భోగి మంటలకు ఆహుతి అయ్యాడని, అప్పటి నుంచి ఈ పండగ జరుపుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. అదే ఆచారాన్ని తామూ కొనసాగిస్తున్నట్టు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో ముగ్గుల పోటీ

బొబ్బిలిరూరల్‌ : జగన్నాథపురం గ్రామానికి చెందిన యువకవి పీఎస్‌ఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో మంగళవారం ఆన్‌లైన్‌లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వందల సంఖ్యలో మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులను పంపించినట్టు తెలిపారు. వీటిలో ఉత్తమంగా ఉన్న వాటిని ఎంపికచేసి బహుమతులు అందజేయనున్నట్టు చెప్పారు. 

Updated Date - 2021-01-13T05:42:32+05:30 IST