ఫుట్‌బాల్‌ మొదలైంది

ABN , First Publish Date - 2020-05-17T10:00:35+05:30 IST

కరోనా వైర్‌సతో సహజీవనం తప్పదని గ్రహించిన ప్రపంచం సాధారణ జీవితానికి అలవాటుపడుతోంది. క్రీడాలోకం కూడా అందుకు సిద్ధమైంది

ఫుట్‌బాల్‌ మొదలైంది

కరోనా దెబ్బకు స్తంభించిన క్రీడారంగం నెమ్మదిగా టోర్నమెంట్ల పునరుద్ధరణ దిశగా 

అడుగులు వేస్తోంది. ఐరోపాలో లాక్‌డౌన్‌ దాదాపు తొలగడంతో తొలుత పునఃప్రారంభమైన క్రీడగా ఫుట్‌బాల్‌ నిలిచింది. యూరప్‌ టాప్‌ సాకర్‌ లీగ్‌ బుండెస్లిగా  

ఈ జాబితాలో చేరింది. శనివారం జర్మనీలో జరిగిన ఈ మ్యాచ్‌లో షాల్క్‌ జట్టుతో డార్ట్‌మండ్‌ టీమ్‌ తలపడింది.  


బుండెస్లిగా పునరుద్ధరణ

ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌


డార్ట్‌మండ్‌:  కరోనా వైర్‌సతో సహజీవనం తప్పదని గ్రహించిన ప్రపంచం సాధారణ జీవితానికి అలవాటుపడుతోంది. క్రీడాలోకం కూడా అందుకు సిద్ధమైంది. అందులో భాగంగా పోటీలకు తెరలేస్తోంది. ఫుట్‌బాల్‌ ఈ జాబితాలో ముందువరుసలో నిలిచింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని జర్మన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ నిర్వాహకులు చాన్స్‌లర్‌ ఏంజెలా మోర్కెల్‌కు నచ్చజెప్పడంతో పోటీలకు ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దాంతో ప్రముఖ సాకర్‌ లీగ్‌ టోర్నీ బుండెస్లిగా మళ్లీ మొదలైంది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో బొరూసియా డార్ట్‌మండ్‌ 4-0తో షాల్క్‌ జట్టును చిత్తు చేసింది. 


కొత్తకొత్తగా..

వేలాదిమంది ఫ్యాన్స్‌తో నిండిపోయే స్టేడియం. రకరకాల వాయిద్యాలతో హోరు. అభిమానుల అరుపులతో దద్దరిల్లే పరిసరాలు. వాటికి తోడుగా రెఫరీ విజిల్‌ చప్పుళ్లు. బంతికోసం ఆటగాళ్లు చేసే విన్యాసాలు. గోల్‌ కొట్టగానే ఒకరిపై ఒకరు పడుతూ చేసుకొనే సంబరాలు. సాకర్‌ మ్యాచ్‌ల్లో ఉండే మజాయే వేరు. కానీ ఇదంతా గతం. శనివారంనాటి మ్యాచ్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలోనే కొత్త అంకానికి నాంది పలికింది. సాధారణంగా అయితే బుండెస్లిగా పోరుకు 80 వేలమంది హాజరవుతారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఖాళీ స్టేడియం.. నిశ్శబ్ద వాతావరణం.. ఆటగాళ్ల అరుపులు, రెఫరీల విజిల్‌ కూతలు తప్ప మరేమీ వినిపించకుండా తాజా మ్యాచ్‌ సాగింది.


 ఇలా చేశారు..

వైరస్‌ వ్యాప్తికి తావు లేకుండా పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 

భౌమామూలుగా ఒక్క బస్సులోనే వచ్చే ఆటగాళ్లు వివిధ బస్సుల్లో స్టేడియానికి చేరుకున్నారు. 

గోల్‌ చేసిన అనంతరం ఒకరికొకరు హత్తుకోవడాన్ని నిషేధించారు.

సబ్‌స్టిట్యూట్‌లు, కోచ్‌లు మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేశారు.

మ్యాచ్‌లకు ముందు ప్రతి జట్టుకు వారం రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేశారు.


లీగ్‌ మొత్తాన్ని జూన్‌ 30నాటికి పూర్తి చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. తద్వారా రూ. 2458 కోట్ల టెలివిజన్‌ ప్రసార హక్కుల సొమ్మును రాబట్టాలని యోచిస్తున్నారు. లీగ్‌ ఆగిపోవడంవల్ల పలు క్లబ్బులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రసార హక్కుల డబ్బు అందితే క్లబ్బులు ఆర్థిక ఇక్కట్లనుంచి బయటపడే అవకాశముంది. 

Updated Date - 2020-05-17T10:00:35+05:30 IST