స్వతంత్ర న్యాయవ్యవస్థ కోసం

ABN , First Publish Date - 2021-03-30T06:10:29+05:30 IST

రాజులను త్రోసిరాజనే రోజులివి. కుర్చీకింద తివాచీ గుంజి పడేయడానికి విఠలాచార్య జానపద సినిమాల్లో వలే మాంత్రికులు ప్రయత్నిస్తూ ఉంటారు...

స్వతంత్ర న్యాయవ్యవస్థ కోసం

రాజులను త్రోసిరాజనే రోజులివి. కుర్చీకింద తివాచీ గుంజి పడేయడానికి విఠలాచార్య జానపద సినిమాల్లో వలే మాంత్రికులు ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్నబడి హెడ్ మాస్టర్ కుర్చీకూడా ఈ కుట్రలకు అతీతం కాదు. 


భారత ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం నామమాత్రపు దేశాధినేతైన రాష్ట్రపతిదే. ఎంత నియంత అయినా న్యాయమూర్తులుగా తమకు తోచిన వారిని నియమించే అధికారం ప్రధానికి లేదు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేసే దాకా ఫైలు కదలదు. కనుకనే తన వారసుడి నియామక లాంఛనాలు మొదలు పెట్టాలని సిజెఐ బాబ్డేని కేంద్రం కోరవలసి వచ్చింది. ఆ సిఫార్సు ఆలస్యం అయ్యే కొద్దీ అనేక అనుమానాలు తలెత్తుతాయి. 


పాలకులు నియంతలైతే న్యాయవ్యవస్థను కూడా బెంబేలెత్తిస్తారు. న్యాయవ్యవస్థపై అదుపుకోసం పాలకులు పోరాడుతూనే ఉంటారు. వారి నుంచి ఆత్మరక్షణ కూడా న్యాయవ్యవస్థ బాధ్యతే. ఏది ఏమైనా, ఎందుకైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన తీవ్ర ఆరోపణలు వచ్చినపుడు, అదీ ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుత వ్యక్తినుంచి వచ్చినపుడు వాటిని విచారించక తప్పదు. రూల్ ఆఫ్ లా, సుప్రీంకోర్టు స్వయంగా నిర్దేశించుకున్న విధాన ప్రక్రియలను అనుసరించి అంతర్గత విచారణ జరిపి, ఆరోపణలు నిలబడలేదన్నారు. విచారణ ఏ విధంగా వీగిపోయిందో వివరించలేదు. కాన్ఫిడెన్షియల్ అన్నారు. అధికార రహస్యం అనలేదు కాని అంతర్గత గోప్యత అన్నారు. సర్వోన్నత న్యాయస్థానమే విచారణ అత్యంత గోప్యం అన్న తరువాత సమాచార హక్కు సంగతేమిటి అని అడిగి ఏం ప్రయోజనం? 


జస్టిస్ రమణ ధర్మాసనం ఒక మంచి పనిని పట్టుబట్టి ప్రారంభించింది. రాజకీయ నాయకులపై క్రిమినల్ నేరాలను సత్వరం విచారించి ఏడాదిలో అటో ఇటో తేల్చాలని హైకోర్టులను ఆదేశించింది. తనపై 32 క్రిమినల్ కేసులున్నాయని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పెషల్ కోర్టుల ముందు పదేపదే హాజరు కాకతప్పని పరిస్థితులు వచ్చాయి. దీనికి ప్రతి స్పందనగా జస్టిస్ రమణపై ఆరోపణలు చేసారని అనుమానాలు వచ్చినా ఆ మాట అనడానికి తగిన ఆధారాలు లేవు. ఈ ఆరోపణల వల్ల న్యాయవ్యవస్థ సంక్షోభంలో పడి ఎవరిని అనుమానించాలో ఏది నిజమో తెలియని సందిగ్ధ స్థితి కొంతకాలం కొనసాగింది. మొత్తానికి ఈ తీవ్ర ఆరోపణల అడ్డంకి తొలగిన తరువాతనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణను తదుపరి సిజెఐగా నియమించాలని సిఫార్సు చేసారు. ఆ దస్తావేజు సుప్రీంకోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వ అంగీకారానికి వెళ్లింది. అక్కడినుంచి రాష్ట్రపతి ద్వారా నియామకం జరగకుండా ఆపే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉందా అంటే నూటికి నూరు పాళ్లు లేదు. అందరికన్నా సీనియర్ న్యాయమూర్తినే ఎంపిక చేయక తప్పదనేది అలిఖిత రాజ్యాంగ సంప్రదాయం. ప్రధాన న్యాయమూర్తిని ఈ విధంగానే నియమించాలని రాజ్యాంగంలో లేదు. కాని ప్రభువుల ఇష్టాయిష్టాలకు వదిలేయకూడదు. తనను నియమించిన పాలకుడికి రుణపడి విధేయులుగా ఉండడానికి సిజెఐ పదవి దయతలిచి ఇచ్చే కార్పొరేషన్ చైర్మన్ పదవి కాదు. 65 సంవత్సరాలు వచ్చేదాకా న్యాయమూర్తినిగానీ ప్రధాన న్యాయమూర్తిని గానీ తొలగించడానికి వీల్లేదు. తమ ఆజ్ఞానుసారం తీర్పులు ఇవ్వనందుకు తొలగించడానికో పదవీకాలాన్ని ఇష్టం వచ్చినట్టు తగ్గించడానికో వారేమీ సమాచార కమిషనర్‌లు కాదు. అదే వారి స్వతంత్రత. వారు ఎవరికీ భయపడే అవసరం లేదు. ఎవరికీ రుణపడి ఉండే అవసరం అంతకన్నా లేదు. 


అందరికన్నా వరిష్ట న్యాయమూర్తిగారే ప్రధాన న్యాయమూర్తి కావలసిందే. అట్లాకాకుండా పోయిన రెండు సంఘటనలు పూర్వదురాచారాలుగా చరిత్రలో మిగిలిపోయాయి. 1973లో ఇందిరాగాంధీ ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు జైశంకర్ మణిలాల్ షెలాత్, ఎఎన్ గ్రోవర్, కెఎస్ హెగ్డేలను త్రోసిరాజని నాలుగో జూనియర్ అజిత్ నాథ్‌రేకి సర్వోన్నత న్యాయాధిదేవత స్థానంలో పట్టం గట్టారు. ఇందిర అభిమానాన్ని రే గారు ఏ విధంగా అంతగా చూరగొన్నారు? మన రాజ్యాంగం అమలు అయిన తరువాత ఢిల్లీ సుల్తానులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మధ్య సర్వాధిపత్యం కోసం సంఘర్షణ సాగింది. పాలకుల శాసనాలు రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టులు కొట్టేయడం, వాటిని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో శాసనాలు చేయడం, అవి మళ్లీ కోర్టు ముందు బోనులో నిలబడడం జరుగుతూ వచ్చింది. ఆ ఘర్షణకు 1973లో కేశవానంద భారతి కేసులో తెరపడింది. ‘మీరు రాజ్యాంగంలో ఏ నియమాన్నైనా ఏ భాగాన్నయినా మార్చుకోండి, మీకు అధికారం ఉంది. కాని, భారత రాజ్యాంగానికి మౌలిక స్వరూపం ఒకటి ఉంది, దాన్ని మాత్రం భ్రష్టు పట్టించకండి’ అని సర్వోన్నత న్యాయస్థానం మహోన్నతమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పుతో విభేదించి, పార్లమెంటు మీద ఆ పరిమితి విధించే అధికారం లేదంటూ అసమ్మతి తీర్పు రచించడం రే పదోన్నతికి పూలబాట పరిచింది. ఆ తరువాత బ్యాంకుల జాతీయీకరణ కేసులో మెజారిటీ న్యాయమూర్తులు ఆ చట్టం చెల్లదని కొట్టేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా అసమ్మతి తీర్పుఇచ్చిన రే కి పదవి పక్కా అయిపోయింది. 


ఏ దస్తావేజు ఏ రాత్రి పంపినా చేవ్రాలు చేయడానికి రాష్ట్రపతి సిద్ధంగా ఉంటే, సుప్రీంకోర్టే మనం చెప్పినట్టు వింటూ ఉంటే ఇంక కావలసిందేముంది? అడిగేది ప్రతిపక్షాలే కనుక వారిని జైలుకు పంపేశారు. మిగిలినవారంతా మన భక్తులే కనుక ఏ చట్టమైనా చేసుకోవచ్చు. లోక్‌సభ అయినా, పెద్దల రాజ్యసభ అయినా వడ్డించేవారు మనవారైతే మనకు ఓటు వేసే వారు పని మీద బయటికిపోయినప్పటికీ అన్ని ఐసావిట్ ఐసావిట్‌లే కదా. నియంతలు జన్మించడానికి కావలసిన వాతావరణం ఏమంటే అడిగేవాడెవడూ లేకపోవడమే. ఇందరు చెప్పినట్టు వింటూ ఉంటే ఇందిర నియంత కాకుండా ఉంటారా? ఎమర్జన్సీ విధించారు. అప్పుడు ఆమెకు రాజద్రోహం కేసులు పెట్టవచ్చని తెలియదు. అనుయాయులు ప్రతికూలురను మాయం చేస్తుంటే అదే కరెక్టని పాలకులు అనుకునేవారు. ప్రధానికి సలాం కొడితే చాలు అని తెలుసుకున్న ముఖ్యమంత్రులు హాయిగా రాష్ట్రస్థాయి నియంతలయిపోయారు. ఎవర్నైనా చంపేయొచ్చు, ఎవర్నైనా దాచి పెట్టవచ్చు. అటువంటి అధికారం లేదని, ఎమర్జన్సీలో హక్కులు తాత్కాలికంగా రద్దు చేసినా, ప్రాణాలు తీయడం, అక్రమంగా బంధించడం రాజ్యాంగబద్ధం కాదంటూ అయిదారు హైకోర్టులు భయపడకుండా తీర్పు చెప్పాయి. అవన్నీ సుప్రీంకోర్టుకు చేరాయి. మరి ప్రధాన న్యాయమూర్తి మన వైపు ఉన్న తరువాత అనుకున్న రీతిలో న్యాయం జరగకుండా ఉంటుందా? ఆ హైకోర్టులన్నీ తప్పనీ, హక్కులన్నీ రద్దు చేసుకునే అవకాశం రాజ్యాంగంలో పుష్కలంగా ఉందని జస్టిస్ ఏఎన్ ‌రే గారి అధ్వర్యంలో పెద్దలంతా కలిసి న్యాయం చెప్పారు. మాన్యవరులే ఇంత పని చేసిన తరువాత ఇక సామాన్యుని స్వేచ్ఛకు దిక్కేమిటి? అయితే సుప్రీంకోర్టు ధర్మాసనంలో గొంతెత్తి పాలకులకు నిజమేమిటో చెప్పిన ఒకే ఒక్క న్యాయవీరుడు ఉన్నాడు. ఆయనే జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా. ఆర్టికల్ 21ను సస్పెండ్ చేయడం అంటే తాత్కాలికంగా చంపేయడం అవుతుందనీ ఎమర్జన్సీలో జీవించే హక్కు సస్పెండ్ చేసినపుడు పోలీసులు చంపేసిన వ్యక్తికి ఎమర్జన్సీ తరువాత ప్రాణం పోయడం పోలీసులకు సాధ్యమా? ప్రకృతి విరుద్ధమైన ఈ నియమం రాజ్యాంగ సమ్మతం ఎలా అవుతుందని అడిగాడా మహానుభావుడు. ప్రపంచం మొత్తం ఆయన ధర్మాలోచనను కొనియాడింది. ఖన్నా తన సోదరికి ఫోన్ చేసి ‘నేనీరోజు ఇచ్చే తీర్పు నన్ను ప్రధాన న్యాయమూర్తి కానీయదు’ అని అప్పుడే చెప్పుకున్నారట. అయినా పదవికోసం అర్రులు చాచకుండా తన అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా చెప్పిన సాహసి ఆయన. ఆయన అనుకున్నట్టే ఇందిరమ్మ 1976లో ప్రధాన న్యాయమూర్తి పదవి ఖన్నాకు కాదని జూనియర్ జస్టిస్ బేగ్‌కు ఇచ్చింది. ఈ అసమ్మతి తీర్పు ఇచ్చినందుకు ఖన్నా ఎప్పుడూ బాధ పడలేదు. మరోవైపు అన్యాయమైన తీర్పును ఇచ్చిన ఆనాటి న్యాయమూర్తుల్లో చాలామంది తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పుకున్నారు. భయపడేవాడు న్యాయం చెప్పడు. 


ప్రధానులు జోక్యం చేసుకోవడానికి వీల్లేని, ముఖ్యమంత్రులు విర్రవీగడానికి వీల్లేని న్యాయపరమైన రాజ్యాంగ పరమైన వ్యవస్థలకు పునాదులు ఖన్నావంటి వ్యక్తులు. వీళ్లు వ్యక్తులు కాదు, శ్రీశ్రీ చెప్పినట్టు ‘వ్యక్తికి బహువచనం శక్తి’. మన రాజ్యాంగానికి కావలసింది ఎఎన్‌రేలు కాదు. హంసరాజ్ ఖన్నా వంటి రక్షకులు. ఎటువంటి నియంతలు ఏలడానికి వచ్చినా, ఇవ్వాళ కొన్ని లక్షలమంది బతికి ఉంటున్నారంటే దానికి ఖన్నా కలం కారణం. ఖన్నాను తయారుచేసే వ్యవస్థలు ముఖ్యం. రాజకీయ రాజ్యాంగపదవీ ధరుల ప్రయోజనాలకు అతీతంగా, ఒక పద్ధతి ప్రకారం, దశాబ్దాలుగా నెలకొన్న రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం, ఒక సదాచారంగా వ్యవస్థీకృత విధానమైన- తదుపరి సీనియర్‌ను ప్రధానన్యాయమూర్తిగా నియమించాలన్న నియమాన్ని మోదీ ఆమోదించి తీరాలి. మరో మార్గం లేదు. జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న సిఫార్సును పాటించాలి. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం. న్యాయవ్యవస్థ ఔన్నత్యానికి రెండు గండాలున్నాయి. ఒకటి సీనియర్లను కాదని జూనియర్లను నియమించే అఘాయిత్యం; రెండు- న్యాయమూర్తులను విరమణానంతర వైభవాలతో ఊరించడం. ఎంపీలు, గవర్నర్లు, ఎన్‌హెచ్ఆర్‌సి కుర్చీలు, వాటికి అనుబంధంగా ఢిల్లీ సుల్తానుల రాజప్రాసాదాలు, విలాసవంతమైన రథాల్లో ఊరేగింపుల కోసం న్యాయాన్ని బలి చేయని న్యాయమూర్తులు మనకు అవసరం. రాజ్యాంగరక్షక తత్వమైన న్యాయవ్యవస్థ స్వతంత్రతను రక్షిస్తే అది నియంతలనుంచి రాజ్యాంగాన్ని రక్షించి మనను కాపాడగలుగుతుంది. రాజ్యాంగో రక్షతి రక్షితః. 

మాడభూషి శ్రీధర్

Updated Date - 2021-03-30T06:10:29+05:30 IST