ఆప్తుల కోసం..

ABN , First Publish Date - 2021-05-26T06:18:38+05:30 IST

సాధారణ రోజుల్లో ఈ నెలలో ఎక్కువగా కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు, వేసవి సెలవులకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులతో ఇళ్లు, గ్రామాలు సందడిగా ఉండేవి. కానీ ఇప్పుడు అవేవీ లేవు. బంధాలన్నీ కొవిడ్‌ కేంద్రాలు, ఆస్పత్రుల్లో బందీలుగా మారాయి.

ఆప్తుల కోసం..
స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ ఆస్పత్రి ముందు చెట్ల కింద నిరీక్షిస్తున్న బాధితుల బంధువులు

  ‘పద్మావతి’ కొవిడ్‌ ఆస్పత్రి బయట బంధువుల వేదన.. నిరీక్షణ 

  చెట్ల కిందే తాత్కాలిక నివాసాలు


తిరుపతి సిటీ, మే 25: సాధారణ రోజుల్లో ఈ నెలలో ఎక్కువగా కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు, వేసవి సెలవులకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులతో ఇళ్లు, గ్రామాలు సందడిగా ఉండేవి. కానీ ఇప్పుడు అవేవీ లేవు. బంధాలన్నీ కొవిడ్‌ కేంద్రాలు, ఆస్పత్రుల్లో బందీలుగా మారాయి. అమ్మ ఆరోగ్యం ఉలా ఉందో అని పిల్లలు.. భర్త బావున్నాడో లేదో అని భార్య.. అన్నకు ఆక్సిజన్‌ అందిందా లేదా అని తమ్ముడు.. స్నేహితుడు కోలుకోవాలని మిత్రులు.. ఇలా కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో అయినవాళ్లు కరోనాతో పోరాటం చేస్తుంటే ఆరుబయట అయినవాళ్లు, బంధువులు ఆందోళనతో ఉన్నారు. కంటి మీద కునుకు లేకుండా చెట్లు, పుట్ల కింద తలదాచుకుంటున్నారు. సరైన తిండీ తిప్పలు లేకుండా చుట్టూ ఉన్న అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రాణాలను పణంగా పెట్టి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు తిరుపతిలోని స్విమ్స్‌ శ్రీపద్మావతి, రుయా, బర్డ్‌, ప్రసూతి వైద్యశాలలోని కొవిడ్‌ ఆస్పత్రుల ఎదుట నిత్యం సాక్షాత్కరిస్తున్నాయి. 


అర్ధాకలితోనే ఎదురు చూపులు

జిల్లాతోపాటు పక్క జిల్లాల నుంచీ వందల సంఖ్యలో కొవిడ్‌ బాధితులు తిరుపతిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో? తమ వారికి ఆక్సిజన్‌ సక్రమంగా అందుతుందో లేదో అనే ఆందోళనతో పగలు రాత్రీ తేడా లేకుండా బంధువులు వెలుపల నిరీక్షిస్తున్నారు.వీరు రోజూ అర్ధాకలితో కాలం గడుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ అమల్లో ఉండడంతో సమీపంలో హోటళ్లు అందుబాటులో లేవు. ఆస్పత్రుల ఆవరణలో తినలేక.. ఒక పూట తెచ్చుకున్న భోజనాన్నే రెండు పూటలా తింటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్కో రోజు దాతలు అందించే భోజనాలతో కడుపు నింపుకుంటున్నారు. వైద్యానికే నగదులేని నిరుపేదలు బయట భోజన ఖర్చులు భరించలేక కడుపులు మాడ్చుకుంటున్నారు. దాతలిచ్చే భోజనం కోసం ఎదురుచూస్తున్నారు. 

వారొచ్చేలోపు వీరెళ్లేలా ఉన్నారు

కొవిడ్‌ ఆస్పత్రుల వద్ద బాధితుల బంధువులకు సరైన వసతులు లేవు. బాధితులకు ఉపయోగించిన జీవ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో కొవిడ్‌ నివారణ చర్యలూ అంతంత మాత్రమే. చిన్నపాటి చినుకులు పడినా అందరూ చెట్ల కిందకు చేరుతున్నారు. ఉన్న ఒక షెడ్‌లోనే పలువురు సేదదీరుతున్నారు. దీనివల్ల భౌతిక దూరం ఉండడం లేదు. వీటన్నింటినీ చూస్తుంటే కొవిడ్‌ బాధితులు కోలుకుని బయటకు వచ్చేలోపు.. వీరు వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. 

నరకమంటే ఏమిటో చూస్తున్నా 

మాది నగరి. మా ఆయన వజ్రవేలు రెండు వారాల కిందట కొవిడ్‌ బారిన పడ్డారు. నగరి ఆస్పత్రికి తీసుకెళ్తే తిరుపతికి పంపించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రికి తీసుకొస్తే పది రోజులు పెట్టుకుని శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని స్విమ్స్‌కు తీసుకెళ్లమన్నారు. ఆరు రోజుల కిందట ఇక్కడ చేర్పించా. ఇంత వరకు ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలియడంలేదు. సిబ్బందిని అడిగితే పర్లేదు అంటున్నారు. ఏవేవో మందులు రాసిచ్చి వెంటనే వాటిని తెచ్చివ్వాలి అంటున్నారు.ఆయనతో ఒకసారీ మాట్లాడనివ్వలేదు. చాలా ఆందోళనగా ఉంది. దీనికితోడు ఇక్కడ ఉండాలన్నా.. కాసేపు విశ్రాంతి తీసుకుందామన్నా సరైన సదుపాయాల్లేవు. ఆరు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా మా ఆయనకోసం ఎదురు చూస్తున్నా. నరకమంటే ఏమిటో ఆరు రోజులుగా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా. - మోహన 


దాతలిచ్చే భోజనంతోనే.. 

మాది కలికిరి. నా కొడుకు సయ్యద్‌బాషాకు కరోనా రావడంతో వారం కిందట ఇక్కడ చేర్పించా. మందుల కోసం వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోయి.. రూ.10 వేలకుపైగా అప్పు కూడా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు.దాతలిచ్చే భోజనంతో నెట్టుకొస్తున్నా. దాతలు ఎప్పుడు వస్తారో తెలియక ఇచ్చిన పూట కొంత తిని దానినే మరుసటి పూటకూ కొంత దాచుకుని తినాల్సి వస్తోంది. కొంతసేపు నిద్రపోదామన్నా వసతి లేదు. అందుకే చెట్ల కింద కూర్చొని కునుకు తీస్తూ.. బిడ్డ కోసం ఎదురుచూస్తున్నా.   - ఖాదర్‌బాషా 







Updated Date - 2021-05-26T06:18:38+05:30 IST