కుల వృత్తులకు.. ఉచిత వెలుగులు

ABN , First Publish Date - 2021-06-04T05:19:51+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రకటించిన విధంగా పలు వృత్తులకు ఉచితవిద్యుత్‌ అందించడానికి ట్రాన్సుకోలో కసరత్తులు కొనసాగుతున్నాయి.

కుల వృత్తులకు.. ఉచిత వెలుగులు

- జిల్లాలో వెయ్యి సెలూన్‌షాపులు

- 95లాండ్రీ షాపులు

- ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 31: ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రకటించిన విధంగా పలు వృత్తులకు ఉచితవిద్యుత్‌ అందించడానికి ట్రాన్సుకోలో కసరత్తులు కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్‌పీడీసీఎల్‌ ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీచేసింది. మీసేవ కేంద్రాల ద్వారా బీసీ సంక్షేమ శాఖాధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. సెలూన్‌లు, లాండ్రీ దుకాణాలు, దోబీఘాట్‌లకు ప్రతినెల 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రజకులు, నాయిబ్రహ్మణులకు ప్రయోజనం..

కులవృత్తులు చేసుకునే రజకులు, నాయిబ్రహ్మణులకు ప్రయోజనం కలిగించే విధంగా ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీని అమలు చేయడానికి ముందుకు వచ్చింది. జిల్లాలో వెయ్యికి పైగా సెలూన్‌లు, 95 లాండ్రీ షాపులు, రెండు దోబీఘాట్‌లు ఉన్నాయి. దీంతో సంబంధిత మీటర్లు రిజిస్టర్‌ అయి ఉండవు. విద్యుత్‌ కనెక్షన్‌లు కమర్షియల్‌ విభాగంలో ఉండడంతో గతంలో నమోదు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో కొంతమంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. 

కేటగిరి-2లోనే..

జిల్లాలో సెలూన్‌లు, లాండ్రీ దుకాణాలు, దోబీఘాట్‌లు కేటగిరి-2లోనే లెక్కిస్తున్నారు. 250యూనిట్ల వరకు దాదాపుగా రూ.2000వరకు చార్జీలు వస్తుండేవి. కేటగిరి-2లో వంద యూనిట్ల వరకు రూ.7.50,  101నుంచి 300యూనిట్ల వరకు రూ.8.50 బిల్లును వసూలు చేసే వారు. ప్రస్తుతం వీరికి ఉచిత విద్యుత్‌ వర్తింపజేస్తే నెలకు ఒక్కో దుకాణానికి సుమారు రూ.1500నుంచి రూ.2000 వరకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ..

జిల్లాలో అర్హులైన నాయీబ్రాహ్మణులు, రజకులు మీ సేవా కేంద్రాల ద్వారా మంగళవారం నుంచి దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కులవృత్తులు చేసుకునే రజక, నాయీబ్రాహ్మణులకు నెలకు 250యూనిట్ల వరకు ఉచితంగా అందించే విద్యుత్‌ కోసం జూన్‌1 నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం స్వీకారం చుడుతోంది. ఆసక్తి గల వ్యక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హులందరికీ ఉచిత విద్యుత్‌ అందించాలి..

- వేములవాడ గణేష్‌, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా అర్హులైన రజకులకు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ అందించాలి. ఉచిత విద్యుత్‌ అందించడం వల్ల కులవృత్తులు నిర్వహిస్తున్న వారికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ఇంత చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు

ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం

- ఉమేందర్‌, నాయిబ్రహ్మణ సంఘం నాయకుడు

రాష్ట్ర ప్రభుత్వం సెలూన్‌ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించడం హర్షనీయం. కుల వృత్తులను ప్రోత్సహించేలా గతంలో ఇచ్చిన హమీలను ప్రభుత్వం నేరవేరుస్తున్నది. ఉచిత విద్యుత్‌ అందించడం పట్ల తమకు కొంతభారం తగ్గనుంది.

Updated Date - 2021-06-04T05:19:51+05:30 IST