కరోనా బాధితులకు.. ‘ఆరోగ్యశ్రీ’!

ABN , First Publish Date - 2021-04-20T04:51:29+05:30 IST

కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందజేయనున్నారు. ఇందుకోసం జిల్లాలో 11 కొవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తూ కలెక్టర్‌ నివాస్‌ చర్యలు చేపట్టారు. కొవిడ్‌ సేవల కోసం అమృత, కిమ్స్‌, జెమ్స్‌, పీవీఎస్‌ రామ్మోహన్‌రావు, బగ్గు సరోజినిదేవి, మెడికవర్‌, గొలివి ప్రైవేటు ఆస్పత్రులను ఎంపిక చేశారు. వీటితో పాటు శ్రీకాకుళం జీజీహెచ్‌, పాలకొండ ఏరియా ఆసుపత్రి, టెక్కలి జిల్లా ఆస్పత్రి, రాజాం సీహెచ్‌సీలను కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించామని కలెక్టర్‌ నివాస్‌ ప్రకటించారు.

కరోనా బాధితులకు.. ‘ఆరోగ్యశ్రీ’!

 జిల్లాలో 11 కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స
గుజరాతీపేట, ఏప్రిల్‌ 19:
కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందజేయనున్నారు. ఇందుకోసం జిల్లాలో 11 కొవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తూ కలెక్టర్‌ నివాస్‌ చర్యలు చేపట్టారు. కొవిడ్‌ సేవల కోసం అమృత, కిమ్స్‌, జెమ్స్‌, పీవీఎస్‌ రామ్మోహన్‌రావు, బగ్గు సరోజినిదేవి, మెడికవర్‌, గొలివి ప్రైవేటు ఆస్పత్రులను ఎంపిక చేశారు. వీటితో పాటు శ్రీకాకుళం జీజీహెచ్‌, పాలకొండ ఏరియా ఆసుపత్రి, టెక్కలి జిల్లా ఆస్పత్రి, రాజాం సీహెచ్‌సీలను కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించామని కలెక్టర్‌ నివాస్‌ ప్రకటించారు. ఈ ఆస్పత్రుల్లో 853 బెడ్‌లను సిద్ధం చేశారు. ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రుల్లో మాత్రమే కరోనా బాధితులకు చికిత్సలు అందజేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు మాత్రమే అమలు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. గుర్తించిన ఆసుపత్రుల్లో ఎటువంటి బెడ్‌ల కొరత లేదని స్పష్టం చేశారు.

చికిత్సల ధరలిలా
కరోనా చికిత్సల ధరలను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయాధికారి కార్యాలయం అధికారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. కొవిడ్‌ నాన్‌ క్రిటికల్‌ బాధితుల రోజువారీ చికిత్సకు రూ.3,250, ఐసీయూలో వెంటిలేటర్‌ లేకుండా చికిత్సకు రూ.5,480, వెంటిలేటర్‌తో పాటు ఇతరత్రా సౌకర్యాలతో కూడిన చికిత్సకు రూ.5,980 చొప్పున ధర నిర్ణయించారు. ఫ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న బాధితులకు ఐసీయూలో వెంటిలేటర్‌తో చికిత్సకు రూ.9,580, వెంటిలేటర్‌ లేకుండా సెప్సీ  చికిత్సకు రూ.6,280, వెంటిలేటర్‌తో సెప్సీ చికిత్సకు రూ.10,380, సెప్టిక్‌ షాక్‌/మోడ్స్‌ విత్‌ వెంటిలేటర్‌ చికిత్సకు రూ.10,380 చొప్పున ధరలు నిర్ణయించారు. ఈ ధరలన్నీ రోజువారీ చేపట్టే చికిత్సలకు వర్తిస్తాయని అఽధికారులు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.  

అప్రమత్తంగా ఉండండి
ప్రైవేటు ఆస్పత్రుల పనితీరుపై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయండి
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌
నరసన్నపేట, ఏప్రిల్‌ 19:
కరోనా రెండోదశ వ్యాప్తిలో భాగంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ ఆదేశించారు. సోమవారం కరోనా నివారణ చర్యలపై అమరావతి నుంచి ఫోన్‌లో కలెక్టర్‌ నివాస్‌తో చర్చించారు. కరోనా కట్టడికి జిల్లా అధికారులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలయ్యేలా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప.. ప్రజలు బయటకు రావద్దని దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మాస్క్‌, శానిటైజర్‌, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ప్రైవేటు ఆసుపత్రులపై ఆరోపణలు వస్తున్నందును టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ నియంత్రణకు ముఖ్య అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. జిల్లాకేంద్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నందున మినీ కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశామని, పెద్దమార్కెట్‌ను 80 అడుగుల రోడ్డుకు తరలించామని తెలిపారు.

Updated Date - 2021-04-20T04:51:29+05:30 IST