పంట విక్రయానికి తంటానే!

ABN , First Publish Date - 2021-01-18T08:08:54+05:30 IST

ముఖ్యమంత్రి సమీక్ష, వ్యవసాయశాఖ మంత్రి ప్రకటన సారాంశం ఏమిటంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున ఇకపై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఉండదు. రైతులు తమకిష్టం వచ్చిన చోటకు వెళ్లి పంట అమ్ముకోవాలి

పంట విక్రయానికి తంటానే!

యాసంగి నుంచే కొనుగోలు కేంద్రాలు బంద్‌

‘ఒకే దేశం-ఒకే మార్కెట్‌’కుప్రభుత్వం మొగ్గు

కేంద్రాలు లేకపోతే రైతుల పరిస్థితి ఆగమాగం

‘కనీస మద్దతు ధర’పై కేంద్రరాష్ట్రాల తలోమాట


‘‘వరి ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనిగలు, పొద్దుతిరుగుడు, మినుముల కొనుగోళ్లతో.. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వానికి రూ.7,500 కోట్ల నష్ట వాటిల్లింది. కరోనా కాలంలో రైతులు దెబ్బతినొద్దని ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రతిసారి అలా చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. రైస్‌ మిల్లరో.. దాల్‌ మిల్లరో కాదు! కొనుగోలు- అమ్మకాలు ప్రభుత్వ బాధ్యత కాదు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు సాధ్యపడదు. కొత్త వ్యవసాయ చట్టాలు కూడా రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే కేంద్రాలు ఏర్పాటుచేయాల్సిన అవసరంలేదు’’

- డిసెంబరు 27న సీఎం నిర్వహించిన సమీక్షలో వ్యక్తమైన అభిప్రాయం


‘‘దేశంలో కొత్త వ్యవసాయ చట్టాలు అమలులోకి వచ్చాయి. కనీస మద్దతు ధరపై నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానిదే! కానీ, చట్టాల్లో కనీస మద్దతు ధర అంశాన్ని పొందుపరచలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేసే అవకాశం లేదు. ఈ పరిస్థితిని రైతులకు వివరించాలి’’

- రాష్ట్ర వ్యవసాయమంత్రి నిరంజన్‌రెడ్డి


హైదరాబాద్‌, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సమీక్ష, వ్యవసాయశాఖ మంత్రి ప్రకటన సారాంశం ఏమిటంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున ఇకపై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఉండదు. రైతులు తమకిష్టం వచ్చిన చోటకు వెళ్లి పంట అమ్ముకోవాలి. అంటే.. దాదాపు 40 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వ్యవస్థ కనుమరుగు కానుంది.


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రైతులకు దక్కని పరిస్థితుల్లో.. వ్యాపారులు, దళారు లు, రైస్‌ మిల్లర్లు అడ్డికి పావుశేరు చొప్పున కొనకుండా, మార్కెట్‌ ఒడిదొడుకులను నియంత్రించటానికి కొనుగోలు కేంద్రాలు ఇంతకాలం దోహదం చేశాయి. ఎఫ్‌సీఐ, నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌, హాకా, పౌరసరఫరాల సంస్థ లాంటి ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీలు రంగంలోకి దిగి రైతుల నుంచి ఎమ్మెస్పీకి కొనుగోలు చేస్తే.. ట్రేడర్లు కూడా దారికొచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం గానీ, ప్రభుత్వరంగ సంస్థలు గానీ మార్కెట్లో లేకపోతే... వ్యాపారులు, దళారులు, రైస్‌మిల్లర్లదే ఇష్టారాజ్యం అవుతుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది.


ప్రధాన పంట ‘వరి’కి పెద్ద దెబ్బ

రాష్ట్రంలో వరి ప్రధాన పంట. ఏటా సాగు పెరుగుతోంది. ఒక్కో సీజన్‌లో 50- 60 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. గతేడాది ఉత్పత్తి కోటి టన్నులు దాటింది. యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో సాగవుతుందనే అంచనా ఉంది. మరోవైపు ఇప్పటివరకు మరే రాష్ట్రంలోనూ లేనంతగా తెలంగాణ ప్రభుత్వం కొనుగోళ్లు చేసింది. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి అలవాటుపడిన రైతులు ఓపెన్‌ మార్కెట్లో అమ్ముకోవాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. పూర్తిగా రైస్‌మిల్లర్లు, ప్రైవేటు ట్రేడర్లపై భారం వేసి విక్రయిస్తే ఎమ్మెస్పీ వస్తుందనే నమ్మకం లేదు. ప్రభుత్వరంగ సంస్థలు వరి ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి వైదొలిగితే మార్కెట్లో ఒడిదొడుకుల నియంత్రణ కష్టమే. ఎమ్మెస్పీ కంటే క్వింటాకు కనీసం రూ.200 నుంచి రూ.500 వరకు తక్కువగా అమ్మకాలు జరుగుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మార్కెట్లు ఎత్తివేయటం ద్వారా 2006 నుంచి బిహార్‌లో కొనుగోళ్ల వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. మొక్కజొన్నల కనీస మద్దతు ధర రూ.1, 850 కాగా బిహార్‌లో ధర రూ.1,100-రూ. 1,200 మాత్రమే ఉంది. అక్కడనుంచి తెలంగాణకు దిగుమతితో ఇక్కడా వ్యవస్థ గాడి తప్పింది.


భారం తగ్గించుకునేందుకు ఓపెన్‌ మార్కెట్‌కు మొగ్గు

కరువు కాటకాలు, ప్రకృతి విపత్తులు వచ్చినపుడు కార్మికులు, ఉద్యోగుల కోసం 3 కోట్ల టన్నుల ఆహార నిల్వలు (బఫర్‌ స్టాక్‌) ఉంచాలనే ‘లెవీ’ పద్ధతి ప్రస్తుతం దేశంలో లేదు. 2014లో మోదీ ప్రభుత్వం నియమించిన శాంతకుమార్‌ కమిటీ.. ‘ఎఫ్‌సీఐ’ని ఎత్తివేయాలని సూచించింది. గోధుమ, వరి ధాన్యం, బియ్యం సేకరణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించాలని పేర్కొంది. అదనపు ఆహార ఉత్పత్తులు ఉన్న రాష్ట్రాల నుంచి కరువు రాష్ట్రాలకు అందించాలని సిఫార్సు చేసింది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోంలో కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకుంటున్న సన్న, చిన్నకారు రైతులకు సహకరించాలని.. సేకరణలో మార్పులు తేవాలని స్పష్టం చేసింది.


ఇందుకు అనుగుణంగా ఏటా ఆహార ధాన్యాలు సేకరించే సమయంలో రాష్ట్రాలతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఒప్పందం కుదుర్చుకుంటోంది. మిల్లర్ల నుంచి కూడా ‘లెవీ’ బియ్యం సేకరించకుండా.. ప్రభుత్వమే రైతుల నుంచి ఎమ్మెస్పీకి వరి ధాన్యం సేకరించి, మిల్లర్లకు అప్పగిస్తే.. వారు ఎఫ్‌సీఐకి ఇస్తున్నారు. క్వింటా బియ్యానికి రూ.3,273 చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇదికాక ఎఫ్‌సీఐ ఆహార ధాన్యాల నిల్వ, సరఫరా నష్టాలు రూ.30 వేల కోట్లు, సిబ్బంది- నిర్వహణ వ్యయం రూ.70 వేల కోట్లు కలిపి రాష్ట్రాలకు కేంద్రం రూ.లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ నష్టాలు భరించటం, భర్తీ చేయడం కంటే రాష్ట్రాలకు ఆహార సబ్సిడీ కింద రూ.లక్ష కోట్లు ఇస్తే సరిపోతుందని శాంతకుమార్‌ కమిటీ సూచించింది. ప్రస్తుతం ఆహార సబ్సిడీ కింద కేంద్రం ఏడాదికి రూ.1.23 లక్షల కోట్లు రాష్ట్రాలకు బదిలీ చేస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసి, ఓపెన్‌ మార్కెట్‌ పద్ధతిని తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 6 వేల కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు కొనడం, ఎఫ్‌సీఐతో సమన్వయం, రైతులకు డబ్బు చెల్లింపును భారంగా భావిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘ఒకే దేశం.. ఒకే మార్కెట్‌’కు మొగ్గు చూపుతోంది


ఆరుతడికి ‘మార్క్‌ఫెడ్‌’ అండలేకపోతే అంధకారమే

మొక్కజొన్న, కందులు, శనగలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌, పెసర, మినుములు, వేరుశనగలను మార్క్‌ఫెడ్‌ ఏటా మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. ఇందుకు జాతీయ సహకార సంస్థ (నాఫెడ్‌) అండగా ఉంటోంది. 2019-20లో రికార్డు స్థాయిలో 9.47 లక్షల టన్నులను మార్క్‌ఫెడ్‌ మద్దతు ధరకు కొన్నది. ఇప్పుడు ఉన్నపళంగా కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే కనీస మద్దతు ధర, ఉత్పత్తి ఖర్చు దక్కుతాయన్న భరోసా లేదు. 


కందుల కొనుగోళ్లతో ఆఖరు

డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలో.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదనే సంకేతం ఇచ్చారు. శుక్రవారం మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన ప్రకటన చూస్తే.. యాసంగి పంట ఉత్పత్తులు కూడా కొనుగోలుచేసే పరిస్థితి లేదని స్పష్టమైంది. అయితే, ఖరీ్‌ఫలో సాగుచేసిన కందుల కొనుగోలుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. కంది సాగు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించగా.. రైతులు 10.77 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. 8.20 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతాయనే అంచనా ఉంది. కేంద్రం మాత్రం 77 వేల టన్నులకే అనుమతి ఇచ్చింది. స్టేట్‌పూల్‌తో కలిపి ఈ ఒక్కసారికి కొని, తర్వాత సీజన్‌ నుంచి నిలిపివేసే యోచనలో ప్రభుత్వం ఉంది.


రాష్ట్రంలో వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు ఇలా..

ఏడాది  కొనుగోలు (లక్షల టన్నుల్లో)

2014-15 24.30

2015-16 23.56

2016-17 53.70

2017-18 53.99

2018-19 99.47

2019-20 120

2020 ఖరీఫ్‌ 47.87


కనీస మద్దతు ధరపై సందేహాలు

కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి 23 రకాల పంట ఉత్పత్తులకు ‘ఎమ్మెస్పీ’ ప్రకటించింది. అయితే, ప్రస్తుత వ్యవసాయ చట్టాల్లో ఎమ్మెస్పీ అంశాన్ని ఎక్కడా పొందుపరచలేదు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులతో జరిపిన చర్చల్లోనూ.. ఎమ్మెస్పీ ఎత్తివేస్తామని చెప్పలేదు. అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మౌఖికంగా చెబుతోంది. మరోవైపు కేంద్రం ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేసే అవకాశం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వాల ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లు కొనసాగించినా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-01-18T08:08:54+05:30 IST