ఒలింపిక్‌ అథ్లెట్లకు సత్వర వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-06-04T09:21:46+05:30 IST

ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లు, సహాయ సిబ్బంది, అధికారులు అందరికీ సాధ్యమైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌ వేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు.

ఒలింపిక్‌ అథ్లెట్లకు  సత్వర వ్యాక్సిన్‌

వచ్చేనెలలో వారితో భేటీ

దేశమంతా మీవెంటే జూ ప్రధాని మోదీ

విశ్వక్రీడల సన్నాహకాలపై సమీక్ష


న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లు, సహాయ సిబ్బంది, అధికారులు అందరికీ సాధ్యమైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌ వేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. వచ్చేనెల 23న ప్రారంభం కాను న్న విశ్వక్రీడలకు భారత సన్నాహకాలను గురువారం జరిగిన సమావేశంలో ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లతో వచ్చే నెలలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నామన్నారు.


భారతీయులందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేయనున్నట్టు చెప్పారు. దేశ జాతీయతలోనే క్రీడాతత్వం ఉందని పేర్కొన్నారు. భారత యువత ఘనమైన క్రీడా సంస్కృతిని నిర్మిస్తున్నారని ప్రశంసించారు. టోక్యోలో తలపడుతున్న క్రీడాకారులకు 135 కోట్లమంది దేశ ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు. అంతర్జాతీయంగా రాణిస్తున్న ప్రతి భారత యువ ఆటగాడు వేలాదిమంది క్రీడా రంగంలోకి అడుగుపెట్టేందుకు స్ఫూర్తిగా నిలుస్తాడని మోదీ చెప్పారు.


190 మంది బృందం: బాత్రా

టోక్యో ఒలింపిక్స్‌లో 190 మందితో కూడిన బృందం పాల్గొననున్నట్టు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) చీఫ్‌ నరీందర్‌ బాత్రా వెల్లడించారు. వీరిలో 100 మంది అథ్లెట్లని తెలిపారు. విశ్వక్రీడల్లో పాల్గొనే భారత బృందం అధికారిక కిట్లను క్రీడల మంత్రి రిజుజుతో కలిసి బాత్రా ఆవిష్కరించారు. ఇప్పటివరకు 100 మంది క్రీడాకారులు టోక్యోకు అర్హత సాధించినట్టు బాత్రా తెలిపారు. ఇందులో 56 మంది పురుషులు, 44 మంది మహిళా అథ్లెట్లున్నారని వివరించారు. మరో 25 నుంచి 35 మంది ఒలింపిక్స్‌కు క్వాలిఫై కానున్నట్టు ఆయన చెప్పారు. 

Updated Date - 2021-06-04T09:21:46+05:30 IST