Abn logo
Sep 28 2021 @ 00:36AM

తెలంగాణ కోసం కేసీఆర్‌ కుటుంబం చేసిన త్యాగమేంటి?

ప్రజాసంగ్రామ యాత్రలో సంజయ్‌కుమార్‌

 సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్‌కుమార్‌

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

- ఇల్లంతకుంటలో ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగసభ

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ కుటుంబం, కేటీఆర్‌, కవిత, సంతోష్‌రావు, హరీష్‌రావు చేసిన త్యాగాలు ఏమున్నాయని, సబ్బండ వర్గాలు త్యాగం చేశాయని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామం నుంచి మొదలై ఇల్లంతకుంట, కేతన్‌పల్లి, కల్లెపల్లి వరకు కొనసాగింది. ఐదు రోజులపాటు సాగిన యాత్ర జిల్లాలో ముగిసింది. ఈ సందర్భంగా ఇల్లంతకుంటలో జరిగిన బహిరంగ సభలో సంజయ్‌ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు ఇలా 1400 మంది బలిదానం చేశారన్నారు. కానీ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగం లేక అల్లాడుతున్నారన్నారు. ఆస్తులు అమ్మి పిల్లలను చదివిస్తే ఉన్న ఉద్యోగాల నుంచి ముఖ్యమంత్రి తొలగిస్తున్నారన్నారు.  తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సగం మంది మంత్రులు నక్సల్స్‌ ఆనుభూతిపరులే ఉన్నారనీ, నక్సలైట్లను బహుముఖ వ్యూహంతో కట్టడి చేశామని కేసీఆర్‌ అంటున్నారనీ, అసలు కేసీఆర్‌ అధికారంలోకి వచ్చేసరికే నక్సలైట్లే లేరనీ అన్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో  అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని, నిధుల కేటాయింపులకు తాను వ్యతిరేకం కాదని అన్నారు.  ‘వరి వేస్తే ఉరి’ అంటూ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  సంబంధం లేదన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తోందన్నారు. ఇందులో కేసీఆర్‌ బ్రోకర్‌ పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులు పండిచే వరిధాన్యాన్ని పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. ఈ విషయంలో తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం కొత్తది కాదని, నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దళిత సాధికారత కోసం ఏనాడో స్టార్టప్‌ ఇండియా పేరుతో గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని తెలిపారు.   హుజూరాబాద్‌ ఎన్నికలు ఉన్నందునే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్నారని, కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని దళితులందరికీ ఎందుకు దళిత బంధు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దళితులను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ అని, దళితులను రాష్ట్రపతిని చేశామని అన్నారు.  రాష్ట్రంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను విద్యా వలంటీర్లను తొలగించారని, ఆశా వర్కర్లతో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారని, ఎంతో మంది నిరుద్యోగలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు  చేసుకున్నారని, దీనికి బాధ్యులను అరెస్ట్‌ చేయాలని అన్నారు.  పేదలను, యువకులను పట్టించుకోని కేసీఆర్‌ పేదల భూములను లాక్కుంటున్నారని, పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బాధలు చెప్పుకుంటున్నారని అన్నారు.  రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఏనాడూ బీజేపీ, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదని, కొందరు కాంగ్రెస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో వైన్‌షాపులు రెండు వేలు ఉంటే బెల్ట్‌షాపులు లక్షకు పైగా ఉన్నాయన్నారు. డిగ్రీ కాలేజీ అడిగితే అనుమతి ఇవ్వరని, వైన్‌షాపు కావాలంటే మరుక్షణమే ఏర్పాటు చేస్తారని అన్నారు. కమీషన్ల కోసం పోలీసోళ్లు తాటిచెట్ల వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు.  మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, ఎస్సీ మోర్చా జాతీయ కార్యాదర్శి ఎస్‌.కుమార్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, దరువు ఎల్లన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పాదయాత్ర ప్రముఖ్‌ మనోహర్‌రెడ్డి, సుభాష్‌, మానకొండూర్‌ ఇన్‌చార్జ్‌ గడ్డం నాగరాజు, కుమ్మరి శంకర్‌, బెంద్రం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.