అంతర్ధానం కాని మనిషి కోసం...

ABN , First Publish Date - 2021-09-17T05:54:35+05:30 IST

ఇక్కడ పుట్టిన మనుషులందరూ కన్నతల్లికి వరాలబిడ్డలే కుటుంబానికి కొనసాగింపులే అయితేనేం..

అంతర్ధానం కాని మనిషి కోసం...

ఇక్కడ పుట్టిన మనుషులందరూ 

కన్నతల్లికి వరాలబిడ్డలే

కుటుంబానికి కొనసాగింపులే

అయితేనేం..

తనని మోస్తున్న దేశమాతకు మాత్రం సేవకులే

పెదాలు పలికిన తొలకరి భాషకు సంరక్షకులే

పేగుతాడుతో మొదలై..

బొటనవేలు తాడుతో ముడిపడేవరకు

సాగే సహయానమిది


పుట్టిన గడ్డ మీద బానిసబతుకులు...

మాట్లాడే భాషలో పరాయికరణలు..

గర్భాలయాల మీద అరాచకాలు

చూస్తూ చూస్తూ తరాలు గడిచిపోతుంటే...

ఇక బానిస బతుకొద్దని తిరగబడే తలలకు

తిరుగుబాటుదారులంటూ 

తలకింత పరిహారంగా వేలం పాడుతున్నారు


ఉగ్రవాదం ఇప్పుడొక వినిమయ వస్తువు

అగ్రవాదం ఇప్పుడొక నిత్యక్రతువు

ఏది ఒప్పు ఏది తప్పు నిర్ణయించాల్సింది

ఎవరో చెప్పింది విని కాదు

కథనాలు వినిపించాల్సింది ఎవరో చల్లిన 

రక్తకళ్ళాపిలు చూసి కాదు 

ఇప్పుడిక నిజంగా అనుభవించినవారిని 

చూసి తేల్చుదాం..

స్కేలూ మనదే కొలతలు మనవే ఐతే

న్యాయం ముఖం ఏ మాస్క్ వేసుకుంటుంది?


ప్రజాస్వామ్యపు మొక్కే లేని భూమిలో

నియంతృత్వం ఎడారిలా విస్తరించిన దేశంలో..

రాజ్యహింస గురించి కొత్తగా మాట్లాడేదేముంది?

పసిపిల్లల్ని ముళ్లకంచెల మీదుగా విసిరేయడం..

ఆడవాళ్ళను కాళ్ళు కనిపించాయని చంపేయడం

ఎర్రబస్సుల్లోలా ఎయిర్‌బస్‌లో కుక్కేయడం

ఎప్పుడు చూసాం మనం?

నిజాన్ని నువ్వు నిజంగా దర్శించిన రోజు

ఆ నిదర్శనంగా నువ్వు తెరఎత్తుగా నిలబడ్డ రోజు

నిజ నిర్ధారణ జరిగినట్టే..


మమతలమడులు కాస్తా 

మతం మండలాలుగా విభజించినప్పుడే

ప్రాణాలకు విలువ పడిపోయింది

ప్రపంచపటం నిండా 

హింసారాచపుళ్లు పెరుగుతున్న వేళ

అన్ని దేశాలు గురువిందగింజలే!


ఇప్పటికైనా,

మనం మనుషులమని

మానవత్వమే మనకు సమ్మతమని

ఏకసూత్రంగా గొంతెత్తి చెప్పాలి

ఏకగాత్రంగా మానవీయగీతం పాడాలి

తప్పుల్ని వేలెత్తి చూపటం ఆపాలిక

శవ పంచాయతీలు మానాలిక


తెగపడడం కాదు.. తెగతెంపులు కాదు

కలుపుకోవడాలు.. మనసులు పంచుకోవడాలు జరగాలిప్పుడు

చంపేవాడే చరిత్ర రాస్తే

భూమంతా స్మశానమే

కోసుకుంటూ పోవడానికి తలకాయలు

మన తోటలోని పుచ్చకాయలు కాదు


ఐనా సహజీవీ,

మనం నిత్యం రణక్షేత్రం లోనే ఉన్నాం 

ఉఛ్వాసనిశ్వాసాలంత అలవోకగా యుద్ధాలను ఎగదోస్తూనే ఉన్నాం

ఇప్పటినుంచీ ఇక అంతే నిష్ఠగా 

సరికొత్తగా శాంతి తపస్సు మొదలెడదాం

అంతర్ధానం కాని మనుషుల్ని 

ఈ భూమిపై నాటుదాం..

అయినంపూడి శ్రీలక్ష్మి

Updated Date - 2021-09-17T05:54:35+05:30 IST