Abn logo
Oct 22 2021 @ 02:05AM

పరిస్థితి మారాలంటే సర్కార్‌ మారాల్సిందే

  • తెలంగాణకే నా జీవితం అంకితం
  • ప్రభుత్వం మెడలు వంచి పోరాటం చేస్తా 
  • ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నా
  • తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ దగా చేస్తున్నారు
  • రాష్ట్రంలో ఎవ్వరూ సంతోషంగా లేరు: షర్మిల
  • రెండో రోజు శంషాబాద్‌లో ముగిసిన యాత్ర


శంషాబాద్‌రూరల్‌/మొయినాబాద్‌/చేవెళ్ల, అక్టోబరు 21: తెలంగాణకే తన జీవితం అంకితమని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్పు రావాలంటే ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కావాలని జనం కలలు కంటున్నారని, అందుకే ప్రజాప్రస్థానంతో వారి ముందుకు వచ్చానని తెలిపారు. షర్మిల  ప్రజా ప్రస్థానం పాదయాత్ర రెండో రోజు గురువారం రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌, మొయినాబాద్‌ మండలాల్లో సాగింది. పలుచోట్ల రైతులు, కూలీలు, యువకులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. శంషాబాద్‌ మండలంలోని మల్కారంలో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నానని, ప్రభుత్వం మెడలువంచేలా పోరాటం చేస్తానని చెప్పారు. తెలంగాణ ఆడపడుచుగా మీ ఇంటి ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించి ఆదరించాలని ప్రజలను కోరారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో పాలన ప్రజలు ఆశించిన విధంగా లేదని అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని, అందుకే వైఎస్సార్‌టీపీని స్థాపించానని చెప్పారు. 2003లో వైఎ్‌సఆర్‌ చేపట్టిన ప్రజాప్రస్థానం అప్పట్లో రాష్ట్ర దిశ, దశనే మార్చిందని, అదే స్ఫూర్తితో తాను చేపట్టిన పాదయాత్ర ప్రకంపనలు సృష్టించబోతుందని తెలిపారు. 

చేవెళ్ల - ప్రాణహితకు తూట్లూ

వైఎస్‌ హయాంలో రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేవారని, ప్రత్యేక రాష్ట్రంలో రైతులు, మహిళా సంఘాల పరిస్థితి దయనీయంగా మారిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేవలం 3లక్షల మందికి రూ.25వేల వరకు రుణమాఫీ చేసి, 36 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారని మండిపడ్డారు. రైతులకు పంటలు పండించే హక్కు లేనప్పుడు పొలం ఉండి ఏం లాభమని  ప్రశ్నించారు. ప్రాణాహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న వైఎస్‌ ఆశయానికి తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. ప్రాజెక్టు తలా, తోక తీసేసి రైతులకు కేసీఆర్‌ అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నీళ్లకన్నా బార్లు, బీర్లు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. రూ.5వేలు రైతుబంధు ఇచ్చి రూ.20వేలు పన్నుల రూపేణా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, 35 వేల స్కూళ్లు మూతపడ్డాయని, 14వేల మంది టీచర్లు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలు అమలు కాలేదని, బంగారు తెలంగాణ అంటే.. ఇదేనా?అని నిలదీశారు. 


12 కిలోమీటర్ల మేర పాదయాత్ర

మొయినాబాద్‌ మండలంలోని నక్కలపల్లి, వెంకటపూర్‌, కేతిరెడ్డిపల్లి, చాకలిగూడ, కవేలిగూడ రైతులు, మహిళలు షర్మిలతో  తమ కష్టాలను చెప్పుకొన్నారు. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈ మేరకు షర్మిల స్పందిస్తూ.. తాము అధికారంలోకి వస్తే పేదల కష్టాలను తీరుస్తామని, పెంచిన ధరలను తగ్గించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర రెండో రోజు 12 కిలోమీటర్ల మేర కొనసాగింది. రైతులు, మహిళలు, యువకులు, కూలీలలతో మాట్లాడిన షర్మిల గతంలో రాజన్న రాజ్యం బాగుందా... ఇప్పటి పాలన బాగుందా? అని ప్రశ్నలు సంధించి తెలుసుకున్నారు.