పశువధ నిషేధం ఎవరి కోసం?

ABN , First Publish Date - 2021-04-02T09:51:41+05:30 IST

అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలో బిజెపి ఆయా రాష్ట్రాలలోని పశువధకు సంబంధించిన పాత చట్టాల స్థానంలో కఠినమైన చట్టాలను తీసుకువస్తూ...

పశువధ నిషేధం ఎవరి కోసం?

అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలో బిజెపి ఆయా రాష్ట్రాలలోని పశువధకు సంబంధించిన పాత చట్టాల స్థానంలో కఠినమైన చట్టాలను తీసుకువస్తూ దేశవ్యాప్తంగా ఒకటే చట్టం ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నది. పశువధ, పశుమాంస వినియోగం నేరమైన చర్యగా స్థిరీకరించే ప్రయత్నమిది. దీని మూలంగా దళితులు, ముస్లింలపై భౌతిక దాడులు కూడా పెరిగాయి. పశువధ నిషేధ చట్టాలలో పశువధ జరిగిందని, జరగబోతోందనే స్థలాలలోకి ప్రవేశించే, తనిఖీ చేసే అధికారం, ఆ అధికారాన్ని వాడుకునే వ్యక్తులను పబ్లిక్‌ సర్వెంట్స్‌గా గుర్తించడం, వారి చిత్తశుద్ధిని గుర్తిస్తూ రక్షణ కల్పించటం వంటి అంశాలున్నాయి. వీటి మూలంగా శిక్షకు అతీతంగా గోరక్షకులు ప్రవర్తించే అవకాశాలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. 2021 ఫిబ్రవరిలో ‘కర్ణాటక పశు సంరక్షణ, పశువధ నిరోధక చట్టం 2020’ ద్వారా ఆవులతో పాటు ఎడ్లు, బర్రెల (గేదెల) వధను కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. దీని ప్రభావం కర్ణాటక పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపైనా ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆవు తప్ప మిగతా అన్ని పశువుల (ఎద్దులు, బర్రెలు/ గేదెలు) వధపై నిషేధం లేదు. తెలంగాణలో కూడా కర్ణాటకలో తెచ్చిన చట్టాన్ని తీసుకురావాలని బిజెపి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవలసినది పశువధ ఉండాలా, వద్దా అని తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక అధికారాల్లోనివి. కాబట్టే భారతదేశంలోని కేరళ, పశ్చిమ బెంగాల్‌తో సహా 8 రాష్ట్రాల్లో పశువధపై నిషేధం లేదు. 


పశువధను, బీఫ్‌ను నేరంగా పరిగణించిన పర్యవసానంగా కర్ణాటకలో పశువుల సంతలు మూగబోయాయి. పశువుల వ్యాపారం, మాంసం అమ్మే దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వాటి యజమానులు, వాటిలో పనిచేసే శ్రామికులు రోడ్డున పడ్డారు. అరెస్టుల సంఖ్య పెరుగుతూ ఉంది. చనిపోయిన పశువుల నుంచి వచ్చే చర్మం, వీటి వ్యాపారం,- వృత్తులు నాశనమవుతాయి. ఉత్పత్తిదాయకంగా లేని పశువులను తిరిగి అమ్మటంలో ఉండే చిన్న వ్యాపారులు, ట్రాన్స్‌పోర్టర్‌ల పరిస్థితి చెప్పనక్కరలేదు. 


పశువధ, బీఫ్‌ నిషేధంతో పశుసంపత్తి, దానికి ముడిపడిన సంస్కృతులు, సుస్థిర పశు ఉత్పత్తి చట్రం పతనమవుతాయి. ఉత్తర భారతదేశంలో వదిలేసిన ఆవులు ఆకలితో పొలాలపై పడి మేస్తున్నప్పుడు రైతులు తరిమివేస్తున్న దృశ్యాలను త్వరలోనే ఇక్కడ కూడా చూస్తాము. వదిలేసిన పశువులను ఉంచే గోశాలల కొరకు పౌరులమీద గోట్యాక్స్‌ కూడా మోపారు. 2019లో వచ్చిన భారత పశు గణాంకాల 20వ సర్వే ప్రకారం పశువధ నిషేధం ఉన్న రాష్ట్రాలలో ఎన్నడూ లేని విధంగా మగ పశువులు, నాటు ఆవుల సంఖ్య తగ్గింది. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో గోవధపై నిషేధం లేకున్నా పశుసంపద అధికంగా పెరిగింది. బీఫ్‌ తినే ఆదివాసి, దళిత, ముస్లిం, క్రైస్తవుల ఆహారపు హక్కులు, జీవితాలు, జీవనాధారాలకు ముప్పు వాటిల్లుతోంది. వీరే కాకుండా పాడికి, సేద్యానికి పశువులను ప్రధాన జీవనాధారంగా పోషించుకుంటున్న బీఫ్‌ తినని బీసీ సామాజిక తరగతులకు చెందిన సన్న చిన్నకారు రైతులు ఉత్పత్తిదాయకంగా లేని పశువులను అమ్ముకోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇతర రాష్ట్రాలలో జరిగినట్లు ఈ చట్టాలతో భయభ్రాంతులకు గురై పశుపోషణకు దూరమవుతారు. ఇప్పటికే కార్పొరేట్‌ పాడి కంపెనీల చేతిలో నలిగిపోతున్న ఈ రైతులకు వాడకంలో లేని పశువులను అమ్ముకోలేని వాస్తవం ఒక సవాలుగా మారుతుంది. ఈ చట్టాలకు ఆర్థిక పరమైన కారణాలు ఏమై ఉంటాయి? గోపూజ, సంస్కృతి, మతపరమైన అత్యుత్సాహం ఆర్థిక లోటును పూరిస్తాయా? 


వ్యవసాయ ఎగుమతుల విధాన రూపకల్పన కొరకు 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నియమించిన హైలెవెల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూపు (హెచ్‌యెల్‌యిజి) కొన్ని ముఖ్య విషయాలు చెప్పింది. ఆర్థిక ప్రమాణాల ప్రయోజనం సాధించాలంటే, అన్ని రాష్ట్రాలలో అగ్రి బిజినెస్‌ ఆధ్వర్యంలో ఒకే పంట క్లస్టరు విధానం అమలుచేయటం ద్వారా ఎగుమతుల డిమాండ్లు నెరవేర్చడం సాధ్యమని తెలియజేసింది. ఎగుమతుల వ్యాపారంలో గేదెలు/బొవైన్‌ (పశుజాతులు) ముఖ్యమైనవిగా గుర్తించారు. వారు బొవైన్‌ (పశుజాతులు) అనే పదం వాడటంలో గేదెలు మాత్రమే కాదని, ఎగుమతులకు ఆవులు, ఎడ్లు కూడా ఉంటాయని సూచిస్తున్నారు. బీఫ్‌ ఎగుమతి చేస్తున్న దేశాలలో 4వ స్థానంలో ఉన్న భారతదేశం సంవత్సరానికి 1.7 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బీఫ్‌ను ఎగుమతి చేస్తున్నది. 2024 కల్లా 3.6 నుంచి 7 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఎగుమతి వ్యాపారం సాధించాలని వీరి అంచనా. ప్రస్తుతం ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. 


మార్కెట్‌లో ఎగుమతులు, అగ్రి బిజినెస్‌ లాభాలకు అనేక అడ్డంకులు ఉన్నట్లు హైలెవెల్‌ గ్రూపు గుర్తించింది. ఎగుమతిదారులకు, ఉత్పత్తిదారులకు మధ్య జరిగే సరఫరాలు విడివిడిగా ఉండటమనేది ఒక పెద్ద అవరోధంగా గుర్తించారు. 2 నుంచి 10 వరకు గేదెలను పెంచుకుంటున్న సన్న చిన్నకారు రైతుల ద్వారా 85% గేదెల ఉత్పత్తి జరగటం, వారు అసంఘటితంగా ఉన్న చిన్న వ్యాపారులకు అమ్మటం అడ్డంకిగా గుర్తించారు. ఉత్పత్తిదాయకంగా లేని పాడి పశువుల నుంచి బీఫ్‌ వస్తున్నది కాని, పాడి పరిశ్రమకి, మాంస పరిశ్రమకి మధ్య ఎటువంటి సంబంధం లేదని గుర్తించారు. అగ్రిబిజినెస్‌ లాభాల కొరకు హెచ్‌యెల్‌యిజి పరిష్కారాలు కూడా చెప్పింది. అవి: 11 రాష్ట్రాల్లో గాలికుంటువ్యాధి (ఫుట్‌ అండ్‌ మౌత్‌ వ్యాధి) లేని జిల్లాలను ఫ్రీ జోన్సుగా చేయాలి. ఇక్కడి నుండి మగ గేదెలను రైతులు లేదా పాల సహకార సంఘాలు పెంచి ఎగుమతి కబేళాలకు అంతరాయం లేకుండా నేరుగా అమ్మకాలు జరగాలి. చిన్న వ్యాపారులను తొలగించాలి. పోర్టుల దగ్గర శుద్ధి చేసే సదుపాయాలు, కోల్డ్‌ స్టోరేజ్‌ కోసం మెగా ఫుడ్‌ పార్క్‌లు ఫాస్ట్‌ట్రాక్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాలి. 2019 సెప్టెంబర్‌ నుంచి జాతీయ పశు వ్యాధి కంట్రోల్‌ ప్రోగ్రాం ద్వారా వ్యాక్సిన్‌ వేసిన పశువుల చెవులకు ట్యాగ్‌ వేయడం, వాటికి యూనీక్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ ఇవ్వడం ద్వారా పశువుల సమాచారాన్ని గుర్తించగలిగే, ట్రాక్‌ చేసే పనిని జాతీయ పాడి అభివృద్ధి బోర్డు యాజమాన్యంలోని పశువుల ఉత్పాదకత, ఆరోగ్యం నెట్‌వర్క్‌ అనే డేటాబేస్‌లో వీటి సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. ఎందుకంటే ఏ పశువు నుంచి బీఫ్‌ వచ్చిందో కనుక్కోవటం ఎగుమతి వ్యాపారానికి అవసరం. భారతదేశ బీఫ్‌ను బ్రాండ్‌ ఇండియా ఆర్గానిక్‌ ఉత్పత్తిగా మార్కెట్‌ చేయాలి. 


అగ్రిబిజినెస్‌ లాభాల ప్లానును సుగమం చేయటంలో నూతన వ్యవసాయ చట్టాలు, కఠినమైన పశువధ నిషేధ చట్టాలు పనికివస్తాయనటంలో సందేహం లేదు. పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న జటిలమైన పశు వ్యాపార వ్యవస్థలు మొదటగా విధ్వంసం అవుతాయి. పశువులను ట్రాక్‌ చేసే నిఘా వ్యవస్థలకు, దాడులు చేస్తున్న వ్యక్తుల భయానికి రైతులు, చిన్న వ్యాపారులు తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండరు. పశుసంవర్థక శాఖ చెప్పినట్లు అమలుచేస్తున్న సెక్స్‌డ్‌ వీర్య పద్ధతుల్లో మగదూడలు తక్కువగా పుట్టినా, 5 లేదా 6 ఈతల తర్వాత పాలు తక్కువ ఇస్తాయి కాబట్టి రైతులు తమ ఆవులను, గేదెలను అమ్మాలనుకుంటారు. అలా అమ్మలేకపోతే వాటిని రోడ్ల మీద వదిలేయాల్సి ఉంటుంది. ఎన్ని గోశాలలు కట్టినా రైతులు వదిలేసే ఆవులతో పాటు ఎడ్లకు, బర్రెలకు అవి ఆశ్రయాన్ని ఇవ్వలేవు. 


ఇప్పుడున్న పశువుల మార్కెట్‌ యార్డులను బైపాస్‌ చేసి, కార్పొరేట్‌ లాజిస్టిక్‌ కంపెనీలు పశువుల కొట్టం దగ్గరికి వెళ్ళి పశువులను కొని, ఎగుమతి మార్కెట్‌ను నడిపేందుకు కొత్త వ్యవసాయ చట్టాలు కూడా తోడుంటాయి. అనియత మార్కెట్ల ద్వారా ఉత్పత్తిదాయకంగా లేని పశువుల అమ్మకం విలువ 50 శాతం వరకు రైతులు పొందుతున్నారు. ఇప్పుడు ఈ మార్కెట్‌ను కూడా కార్పొరేట్లు కబ్జా చేయబోతున్నారు. బీఫ్‌ ఎగుమతులకు పశుజాతుల క్లస్టర్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ఏర్పాటుచేసే ప్రయత్నాలు ఉన్నాయని, ఈ రాష్ట్రాలను ఎఫ్‌యెమ్‌డి ఫ్రీజోన్లుగా సర్టిఫై చేయమంటూ భారత ప్రభుత్వం ప్రపంచ పశు ఆరోగ్య సంస్థను కోరిన నివేదిక ద్వారా ఇది మనకు అర్థమవుతున్నది. కాంట్రాక్టు వ్యవసాయ పద్ధతిలో గేదె దూడల పెంపకం చేపట్టి, వాటిని కొనుగోలు చేసి నేరుగా ఎగుమతి పశు కబేళాలకు పంపవచ్చు. అప్పటికే అమలులో ఉన్న అన్ని చట్టాలకు భిన్నంగా ఏమి ఉన్నప్పటికీ వ్యవసాయ చట్టాల నిబంధనలు మాత్రమే అమలు అవుతాయి, కాబట్టి పశు వ్యాపారంలో ఉన్న కార్పొరేట్లకు గోరక్షకుల నుంచి ఎటువంటి సమస్యలు ఎదురుకావు.


ఏ పశువు నుంచైనా బీఫ్‌ మన ప్లేటులోకి రాకుండా గోరక్షకులు పశువధ చట్టాలను అడ్డం పెట్టుకొని చిన్న రైతులు, స్థానిక కటికవారు, చిన్న వ్యాపారస్తులు, ట్రాన్స్‌పోర్టర్లపై దాడులకు పాల్పడతారు. ఒకవేళ హైలెవెల్‌ గ్రూపు ప్రణాళికలను ప్రభుత్వం అమలుచేస్తే మెన్యూ నుంచి బీఫ్‌ మాయమైపోతుంది. ఆవు చుట్టూ తిరుగుతున్న రాజకీయం, పెట్టుబడిదారి విధానం జమిలిగా భారతదేశాన్ని బీఫ్‌ ఫ్రీ ఇండియాగా మార్చాలనుకునే బ్రాహ్మణీయ విజన్‌ కార్పొరేట్ల ప్రయోజనాలకే ఉపయోగపడ్తుంది. ఈ ప్రణాళికలతో బీఫ్‌ను విదేశీ మార్కెట్లకే బదిలిచేయటం వ్యవస్థీకృతంగా, సంపూర్ణంగా జరుగుతుంది. నిషేధ చట్టాల వెనుక హానికరమైన డిజైన్లతో కార్పొరేట్‌ పాడి పరిశ్రమ, బీఫ్‌ ఎగుమతులు కలిసి చిన్న, సన్నకారు రైతులను పశు ఆధారిత జీవనాధారాల నుంచి దూరం చేయబోతున్నాయి.

డాక్టర్‌ సాగరి ఆర్‌. రాందాస్‌

Updated Date - 2021-04-02T09:51:41+05:30 IST