తియ్యటి విషం!

ABN , First Publish Date - 2021-05-14T08:35:25+05:30 IST

అదో ఒంటి స్తంభం మేడ. విష సర్పం ముప్పు తప్పేందుకు అక్కడ బిక్కుబిక్కుమంటూ కూర్చున్న శాపగ్రస్తుడైన ఓ మహారాజు

తియ్యటి విషం!

పండ్లు మాగబెట్టేందుకు నిషేధిత ఇథోఫాన్‌

మామిడి, అరటి, సపోటాలకు వినియోగం

చైనా నుంచి అక్రమంగా దిగుమతి.. 

కొత్తపేట మార్కెట్లో  చాంబర్లున్నా నిరుపయోగం


హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): అదో ఒంటి స్తంభం మేడ. విష సర్పం ముప్పు తప్పేందుకు అక్కడ బిక్కుబిక్కుమంటూ కూర్చున్న శాపగ్రస్తుడైన ఓ మహారాజు. ఒకానొక రోజు కొందరు సన్యాసులు పళ్ల బుట్టతో వస్తే ఓ పండును తీసుకొని కొరికాడు! అంతే.. ఆ ఫలంలోంచి బయటపడ్డ పురుగొకటి సర్పంగా మారి ఆయన్ను కాటేస్తుంది! ఇదో పురాణ కథ. అక్కడ విషనాగు, పండులో కనిపించి కాటేసింది.. ఇప్పుడు దొరుకుతున్న పండ్లలో కనిపించని ముప్పు పొంచివుంది. పండులో తియ్యటి రుచి వెనుక నాలుక పసిగట్టలేని విషం కొద్ది కొద్దిగా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయొచ్చు. ఎందుకంటే నోరూరించే ఆ ఫలాలకు ఆ తాజాదనం, నిగనిగలు సహజంగా అబ్బితేనా? పచ్చి కాయలను గంటల వ్యవధిలో మాగబెట్టేందుకు ఆరోగ్యానికి హాని కలిగించే ‘ఇథోఫాన్‌’ను పండ్ల వ్యాపారులు ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. ఈ పౌడర్‌ చైనా సరుకు. రెండు రూపాయలకు ప్యాకెట్‌ చొప్పున దొరుకుతాయి. ఇలాంటి మూడు ప్యాకెట్లతో 10కిలోల పళ్లను గంటల వ్యవధిలో పక్వానికి తెస్తున్నారు. జీ- రైప్‌, ఎస్‌- రైప్‌, గోల్డ్‌- రైప్‌, క్యూ- రైప్‌ పేర్లతో ఇథోఫాన్‌ను వ్యాపారులు వాడుతున్నారు. 


రాష్ట్రంలోని పండ్ల మార్కెట్లలో 95శాతం ఈ ‘డేంజర్‌ ఫార్ములా’నే అవలంబిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పండ్లను మాగబెట్టేందుకు గతంలో పండ్ల వ్యాపారులు ‘కాల్షియం కార్బైడ్‌’ను విచ్చలవిడిగా వినియోగించేవారు. దీనిపై పూర్తి నిషేధం విధించడంతో ప్రత్యామ్నాయ మార్గంగా ‘ఇథోఫాన్‌’ పౌడర్‌ను ఎంచుకున్నారు. దీన్ని హైదరాబాద్‌లోని కొత్తపేట్‌, వరంగల్‌, జగిత్యాల, కొల్లాపూర్‌, ఖమ్మం, సంగారెడ్డి, నిర్మల్‌, మంచిర్యాల, కొత్తగూడెం మార్కెట్లలో పండ్ల వ్యాపారులు వాడుతున్నారు. మామిడితోపాటు అరటి, బొప్పాయి, నిమ్మ, బత్తాయి, సపోటా, సీతాఫలం తదితర అన్నిరకాల పండ్లను ఈ పద్ధతిలోనే పక్వానికి తెస్తున్నారు. సాధారణంగా ‘ఇథలీన్‌ రైపనర్‌’ (ఎన్‌-రై్‌ప)తో (2 పీపీఎం మించకుండా) పండ్లను మాగబెట్టడానికి అనుమతి ఉంది. కార్బైడ్‌, ఇథోఫాన్‌ వినియోగానికి అడ్డుకట్టవేసి పండ్లను సురక్షిత పద్ధతిలో మాగబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఎన్‌- రైప్‌’కు అధికారికంగా అనుమతినిచ్చింది.  ‘హైటెన్‌ ఇన్నోవేటివ్‌ సొల్యూషన్స్‌’ అనే సంస్థతో టీఎస్‌ ఆగ్రోస్‌ ఏడాది క్రితం ఎంవోయూ కుదుర్చుకుంది. క్షేత్రస్థాయిలో ఏఎంసీ కార్యదర్శులు, అధికారులు, పండ్ల వ్యాపారులు చైనా ఉత్పత్తులు సరఫరాచేసే డీలర్లతో కుమ్మక్కవడంతో మార్కెట్లో ఎన్‌-రైప్‌ పౌడర్‌కు చోటివ్వటంలేదు. 


‘ఎన్‌-రై్‌ప’తో పక్వానికి 3 రోజులు

ఎన్‌- రైప్‌ పూర్తిగా సేంద్రియ పౌడర్‌. ఒక ప్యాకెట్‌ రూ. 4.75కు ఆగ్రోస్‌ ఇస్తోంది. గరిష్ఠంగా మార్కెట్లో ధర రూ. 6 గా ఉంది. ఎన్‌- రైప్‌ ఒక్క ప్యాకెట్‌ 10 కిలోల పండ్లకు సరిపోతుంది. ఒక్క కొత్తపేట్‌ మార్కెట్లోనే 21 ఇథలీన్‌ రైపనర్‌ చాంబర్లు ఉన్నాయి. ఇక్కడ పండ్లు మాగబెట్టుకోవచ్చు. ఈ చాంబర్లలో పండ్లు మాగటానికి 72 గంటలు పడుతుంది. కానీ పండ్ల వ్యాపారులకు ఈ మాత్రం ఓపిక ఉండటంలేదు. మార్కెట్‌కు వచ్చిన 24 గంటల వ్యవధిలోనే మాగబెట్టి, పసుపుపచ్చ రంగులోకి మార్చడానికి ‘ఇథోఫాన్‌’ పౌడర్‌ను వాడేస్తున్నారు. ఈ ప్యాకెట్లకు రశీదులు, అడ్ర్‌సలు ఏవీ ఉండటంలేదు. జీఎస్టీ వంటివి ఉండవు. ప్రొడ్యూసర్‌ పేరు దగ్గర  షాండాంగ్‌ బయోటెక్నాలజీ, చైనా అని ప్రింట్‌ చేసి ఉన్నాయి. చైనా బ్రాండ్‌ పౌడర్లతో దుష్ఫలితాలు చాలా ఉన్నాయని, అవి స్మగ్లింగ్‌ గూడ్స్‌ అని.. ఎన్‌- రైప్‌ సేంద్రియ పౌడర్‌ అని దాంతో ఎలాంటి దుష్ఫలితాలు ఉండబోవని టీఎస్‌- ఆగ్రోస్‌ అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చైనా పౌడర్‌తో మాగబెట్టిన పండ్లను తింటే జీర్ణ సంబంధిత సమస్యలు రావడం, చర్మంపై దద్దుర్లు రావటం, నరాల వ్యవస్థ, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతినటం, కేన్సర్లకు దారితీయడం వంటి సమస్యలు వస్తాయి. 


చైనా రసాయనాలను ఉపేక్షించం: హోంమంత్రి

పండ్లను సహజసిద్థంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రై్‌ప’ను హైదరాబాద్‌ కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. ఆగ్రోస్‌ ఔట్‌ లెట్‌ ప్రారంభించిన సందర్భంగా ఈ ఆవిష్కరణ జరిగింది. ‘‘చైనా విష రసాయనాలతో  మామిడి పండ్లు మాగబెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చైనా విష రసాయనాలను  రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదు’’ అని మంత్రి పేర్కొన్నారు. ఆహార కల్తీ విషయంలో సీఎం కేసీఆర్‌ చాలా కఠినంగా వ్యవహరించాలని  సూచించారని, అందుకే సేంద్రియ పద్ధతిలో పండ్లను మాగబెట్టే ఎన్‌ రైప్‌ మిక్చర్‌కు అనుమతిచ్చామని తెలిపారు. 


షాప్‌ కీపర్లపై కేసులు పెట్టాల్సి వస్తోంది

చైనా పౌడర్లలోగానీ, మన దేశంలోనే ఉత్పత్తిచేసే నిషేదిత బ్రాండ్లలోగానీ  కాల్షియం కార్బైడ్‌, విషపూరిత మందుల అవశేషాలు ఉంటే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉన్నాయి. రూ.2 లక్షల జరిమానా వేయటంతోపాటు ప్రాసిక్యూట్‌ చేయొచ్చు. కానీ కేసులు నమోదుచేయటానికి పౌడర్‌ ప్యాకెట్లపై అడ్ర్‌సలు సరిగా ఉండటంలేవు. తప్పుడు పేర్లు, తప్పుడు వివరాలు ప్రింట్‌ చేస్తున్నారు. స్మగ్లింగ్‌ డీలర్లను పట్టుకోవటం కష్టమవుతోంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో షాప్‌ కీపర్లపై కేసులు నమోదుచేస్తున్నాం.

- అమృతశ్రీ, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా


సురక్షితమైన పండ్లు పంపిణీయే ఆగ్రోస్‌ లక్ష్యం

ప్రకృతి సిద్ధమైన పండ్లు ప్రజలకు సరఫరా చేయటానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ.. ఎన్‌- రైప్‌ ఉత్పత్తి కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు ఉన్నాయి. మామిడి, అరటిపండ్లతోపాటు ఇతర పండ్లకు ఫ్రూట్‌ హబ్‌ గా ఉన్న తెలంగాణలో ఎన్‌- రైప్‌ పౌడర్‌ ప్యాకెట్లను క్షేత్రస్థాయిలో సరఫరా చేసేందుకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలను వినియోగిస్తున్నాం. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా 16 లక్షల ప్యాకెట్లు పంపిణీ చేశాం. పండ్ల వ్యాపారులు బయటి మార్కెట్‌ నుంచి వచ్చే ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయొద్దు. 

- కె. రాములు, మేనేజింగ్‌ డైరెక్టర్‌, తెలంగాణ ఆగ్రోస్‌

Updated Date - 2021-05-14T08:35:25+05:30 IST