తీవ్రవాదులనుకొని పౌరుల్ని కాల్చేశారు!

ABN , First Publish Date - 2021-12-06T07:02:24+05:30 IST

నాగాలాండ్‌లో మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్‌ గురితప్పింది. తీవ్రవాదులనుకొని భద్రతాబలగాలు పౌరులపైకి కాల్పులు జరిపాయి....

తీవ్రవాదులనుకొని పౌరుల్ని కాల్చేశారు!

నాగాలాండ్‌లో 14 మంది దుర్మరణం

గురి తప్పిన భద్రతా బలగాల ఆపరేషన్‌

తొలుత ఆరుగురు పౌరులపై కాల్పులు

సైన్యం చర్యకు నిరసనగా ప్రజల ఆందోళన

మరోమారు జరిపిన కాల్పుల్లో ఏడుగురి మృతి

మరో 13 మంది పౌరులకు తీవ్ర గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

2 మిలటరీ వ్యాన్‌లకు ఆందోళనకారుల నిప్పు

ఒక జవాను మృతి.. మరికొందరికి గాయాలు

తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన అమిత్‌షా, సీఎం

సిట్‌ విచారణకు ఆదేశం.. ఆర్మీలోనూ దర్యాప్తు

హోంశాఖపై రాహుల్‌, విపక్ష నేతల విమర్శలు


కోహిమా/గువాహటి/న్యూఢిల్లీ, డిసెంబరు 5: నాగాలాండ్‌లో మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్‌ గురితప్పింది. తీవ్రవాదులనుకొని భద్రతాబలగాలు పౌరులపైకి కాల్పులు జరిపాయి. ఈ విషాద ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మోన్‌ జిల్లాలోని తిరు బొగ్గు గని-ఒటింగ్‌ గ్రామాల మధ్య శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మోన్‌ ఎస్పీ ఇమ్నలేన్సా కథనం ప్రకారం.. మయన్మార్‌ సరిహద్దు ప్రాంతమైన తిరు బొగ్గుగనిలో ఒటింగ్‌ గ్రామానికి చెందిన కూలీలు పనిచేస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం వీరు బొగ్గుగనిలో విధులు ముగించుకుని, తమకు కేటాయించిన వ్యాన్‌లో గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. పొద్దంతా పనిచేసిన బడలికను మరిచిపోయేందుకు జానపద గీతాలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు.


ఒక్కసారిగా ఆ వాహనంపై బుల్లెట్ల వర్షం కురిసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు ఆరుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. అసోం రైఫిల్స్‌, భద్రతా బలగాలు ఈ దాడికి పాల్పడ్డా యి. మయన్మార్‌ నుంచి నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌-కే నికీ(ఎన్‌ఎ్‌ససీఎన్‌-కే) మిలిటెంట్లు చొరబాట్లకు యత్నిస్తున్నారనే మిలటరీ ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో కాపుకాసిన భద్రతాబలగాలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి. తర్వాత జరిగిన పొరపాటును గుర్తించాయి. మరోవైపు తమ వారు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఒటింగ్‌ గ్రామానికి చెందిన యువకులు ఆ మార్గాన్ని జల్లెడపట్టారు. ఈ క్రమంలో మిలటరీ వ్యాన్‌ల వద్ద ఆరుగురు గ్రామస్థుల మృతదేహాలను గుర్తించిన యువకులు ఆగ్రహం చెందారు. రెండు మిలటరీ వ్యాన్లకు నిప్పు పెట్టారు. సైనికులు, అసోం రైఫిల్స్‌ జవాన్లు, భద్రతాబలగాలపై దాడి చేశారు. ఈ ఘటనల్లో ఓ జవాను చనిపోగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జవాన్లు మరోమారు కాల్పులకు దిగా రు. ఈ ఘటనలో మరో ఏడుగురు పౌరులు దుర్మరణంపాలయ్యారు. 11 మంది పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ప్రాణాపాయం ఉందని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు గ్రామస్థుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఆదివారం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. మోన్‌లోని ఆర్మీ, అసోం రైఫిల్స్‌ స్థావరాలు, కార్యాలయాలపై స్థానికులు దాడి చేశారు. వారిని అదుపు చేసేందుకు అసోం రైఫిల్స్‌ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ప్రభుత్వం మోన్‌ జిల్లా లో 144 సెక్షన్‌ విధించింది. మొబైల్‌ ఫోన్‌ సేవలను, ఇంటర్నె ట్‌, డేటా, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ సర్వీసులను నిషేధించింది.



ఈ ఘటనలపై భారత సైన్యం స్పందించింది. ‘‘ఈ దుర్ఘటన తీవ్రమైనది. ఈ ఘటనపై కోర్టు ఎంక్వైరీ(మార్షల్‌)కి ఆదేశించాం. తప్పుచేసిన వారిపై చర్యలు తప్పవు’’ అని డిఫెన్స్‌ పీఆర్వో కల్నల్‌ సుమిత్‌.కె.శర్మ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఐజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేసినట్లు నాగాలాండ్‌ సీఎం నేఫియూ రియో వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఈ ఉదంతంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘మోన్‌ జిల్లా ఒటింగ్‌ వద్ద జరిగిన ఘటన తీవ్ర వేదనకు గురిచేసింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సిట్‌ను ఏర్పాటు చేసింది’’ అని ట్వీట్‌ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా స్థానిక అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అసోంలోని నాగోన్‌ ఎంపీ ప్రద్యుత్‌బోర్డ్‌లోయ్‌ ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను ట్వీట్‌ చేసి ‘‘అత్యంత బాధాకరమైన ఘటన’’ అన్నారు. మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మా కూడా ఒటింగ్‌ మృతులకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కాగా.. 14 మంది పౌరుల మృతికి సంబంధించి హత్యకేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు సిట్‌ అధికారులు వెల్లడించారు.


మండిపడ్డ విపక్షాలు

మోన్‌లో పౌరులపై సైన్యం కాల్పుల ఘటనను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘స్వదేశంలో పౌరుల ప్రాణాలకు, సైన్యానికి రక్షణ లేనప్పుడు హోం మంత్రి త్వ శాఖ ఏం చేస్తోంది?’’ అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ‘నిజమైన’ సమాధానం చెప్పాలని ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ కూడా సమగ్ర దర్యాప్తునకు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘హార్న్‌ బిల్‌ ఫెస్టివల్‌’ను బహిష్కరించాలని పౌరులను ఈస్ట్‌ నాగా లాండ్‌ పీప్పుల్స్‌ ఆర్గనైజేషన్‌(ఈఎన్‌పీవో) కోరింది. ఈ ఘటనకు అమిత్‌షాను బాధ్యుడిని చేయాలని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని హైదాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-12-06T07:02:24+05:30 IST