Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్పు చేసి OTS కట్టు.. బలవంతపు వసూళ్లు

పొదుపు మహిళలపై భారం

గృహహక్కు కోసం సంఘాల నుంచి రుణాలు

అందుకోసం అధికారుల ఒత్తిళ్లు

చాలాచోట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తున్న అధ్యక్షులు

ఇదేం తలనొప్పి అంటూ డ్వాక్రా మహిళల ఆవేదన


ఒంగోలు నగరం/అద్దంకి, డిసెంబర్‌ 5 : 

జగనన్న గృహహక్కు కింద అద్దంకి మండలంలో 2,178 మంది, పట్టణంలో 339 మందికి అర్హత ఉన్నట్లు గుర్తించారు. వారిలో 1,800 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులే ఉన్నారు. పట్టణంలో ఇప్పటికే 142 మందితో రూ.15వేల చొప్పున కట్టించారు. వీరిలో కొందరు ఇతరుల పేర్లతో ఇళ్లు ఉండటం, బ్యాంక్‌ రుణాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా డబ్బులు చెల్లించారు. కొంత మంది చేత మాత్రం బలవంతంగా కట్టిస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని పలువురు లబ్ధిదారులు మెప్మా సిబ్బందితో గొడవలకు కూడా దిగారు. 

వలేటివారిపాలెం మండల సమాఖ్య నుంచి రూ.10లక్షలు డ్రా చేసి ఇవ్వండి. 10 గ్రామాల్లో ఓటీస్‌ చెల్లించాలని మండల సమాఖ్య అధ్యక్షురాలు ముప్పా హరిత, ట్రెజరర్‌ మన్నం వెంగమ్మపై ఏపీఎం, సీసీలు ఒత్తిళ్లు చేశారు. ఓటీఎస్‌ కోసం తాము చెక్కులపై సంతకాలు చేసే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. వెలుగు అధికారులు మాత్రం ఎలాగోలా డ్రా చేయాలని చూస్తున్నారు.

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కోసం అధికారులు ఒత్తిళ్లు పెంచారు. నిన్న, మొన్నటి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన వారు లబ్ధిదారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇప్పుడు స్వయం సహాయక సంఘాలపై దృష్టి సారించారు. ప్రభుత్వం ఇచ్చిన రుణంతో గృహాలు నిర్మించుకున్నవారిపై ఆయా గ్రూపుల అధ్యక్షుల ద్వారా అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే బ్యాంక్‌ లింకేజీ రుణం తీసుకొని చెల్లింపులు పూర్తయి, మరలా రుణం తీసుకునేందుకు వెళ్లిన  సభ్యుల మెడపై సీసీలు, ఏపీఎంలు ఓటీఎస్‌ కత్తి పెడుతున్నారు. సంపూర్ణ గృహ హక్కు కోసం రూ.10వేలు చెల్లిస్తేనే కొత్తగా రుణం ఇప్పిస్తామని తెగేసి చెప్తున్నారు. 


జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రుణాలను చెల్లించేందుకు డ్వాకా మహిళలపై ప్రభుత్వం అప్పుల భారం మోపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత 30 ఏళ్లుగా ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పక్కాగృహాలను నిర్మించుకున్న లబ్ధిదారుల నుంచి రుణాలను వసూలు చేసేందుకు జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రకటించింది. దీని కింద రుణాలను తీర్చే లబ్ధిదారులకు వన్‌టైం సెటిల్‌మెంటును అమలు చేస్తోంది. లబ్ధిదారుల నుంచి స్పందన లేకపోవటంతో కొత్త విధానానికి తెరలేపింది. అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ ఓటీఎ్‌సకు కట్టండి అంటూ మహిళల నెత్తిన భారం మోపుతోంది. ఈ పథకం పురోగతిని ప్రభుత్వానికి చూపించేందుకు పొదుపు మహిళలకు వారి సంఘాల నుంచి రుణాలు ఇప్పించి దీంతో ఓటీఎస్‌ కింద గృహ రుణాలను తీర్చాలంటూ  అధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇప్పటికే రుణాలు ఇప్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం మహిళల నుంచి సంతకాలు తీసుకుంటున్నారు. పక్కా గృహాలు నిర్మించుకున్న కుటుంబాల మహిళలు పొదుపు సంఘంలో ఉంటే వారి నుంచి ఓటీఎ్‌సకు డబ్బులు కట్టించటం ప్రభుత్వానికి చాలా తేలిగ్గా మారింది. డీఆర్‌డీఏ, వైకేపీ అధికారులను రంగంలోకి దింపి పొదుపు సంఘాల నుంచి ఓటీఎ్‌సకు సొమ్ము జమ చేయిస్తున్నారు. 


లబ్ధిదారుల్లో డ్వాక్రా మహిళలే అధికం

జిల్లాలో మొత్తం 3.90లక్షల మంది పక్కాగృహాల రుణాలను చెల్లించాల్సి ఉండగా వీరిలో డ్వాక్రా సంఘాలకు చెందిన కుటుంబాల వారు సగం మంది ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. ఇందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో లెక్కలను అధికారులు సిద్ధం చేశారు. మండలంలో, గ్రామంలో ఎంతమంది బకాయిదారులు ఉన్నారు.. వారిలో ఏఏ కుటుంబాల్లో డ్వాక్రా సభ్యులు ఉన్నారు. అనే వివరాలను సేకరించి డ్వాక్రా సభ్యుల నుంచి రుణాలను తీయిస్తున్నారు. 


అప్పులు మీద అప్పులు.. ..

ఇప్పటికే పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు లింకేజీ, పొదుపు సంఘాల నుంచి రుణాలు తీసుకుని నెలవారీ చెల్లిస్తున్నారు. ఇవే వారికి భారంగా మారిన తరుణంలో కొత్తగా గృహ రుణాల చెల్లింపు కోసం మరో అప్పును నెత్తిన పెట్టడం, దానిని కూడా ఇక నుంచి నెలానెలా చెల్లించాల్సిన రావటం వారికి భారంగా మారింది. ఇలా అప్పు మీద అప్పు పైన పడి నెలవారీ రుణాలు తీర్చటమే గగనంగా మారితే ఇక కుటుంబాలను ఎలా పోషించాలంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


పొదుపు మహిళల నుంచి వ్యతిరేకత. 

ప్రభుత్వం ఓటీఎ్‌సకు, డ్వాక్రాకు లింకు పెట్టడంతో పొదుపు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. అధికారులు మాట కాదంటే భవిష్యత్‌లో ఇక ఏ రుణం మంజూరు చేయరేమో అనే భయంతో కొందరు అడిగిన వెంటనే సంతకాలు చేసేస్తున్నారు. కొందరు మాత్రం ఎదురుతిరుగుతున్నారు.  పొదుపు డబ్బులతో పాటు కమ్యూనిటీ ఇన్వెస్టుమెంటు ఫండ్‌, మండల సమాఖ్య వద్ద ఉన్న నిధుల నుంచి డ్వాక్రా మహిళలకు రుణాలు ఇప్పించి ఓటీఎ్‌సను చెల్లించే విధంగా అధికారులు ఆలోచన చేసినా భవిష్యత్‌లో ఆడిట్‌ వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో విరమించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం పొదుపుసంఘాల సొమ్మును గృహ రుణాల చెల్లింపు పేరుతో కొల్లగొట్టే ప్రణాళికను అమలు చేస్తోంది.

ఇష్టం లేకున్నా తీర్మానాలు 

నగదు అందుబాటులో లేని డ్వాక్రా సంఘాల సభ్యులకు రుణం మంజూరైన తర్వాత సొమ్ము జమచేసేలా బలవంతపు తీర్మానాలు రాయిస్తున్నారు. గత మంగళవారం అద్దంకి మండలం చినకొత్తపల్లికి చెందిన ఓ స్వయం సహాయక సంఘం చేత ఇలానే రాయించినట్లు తెలుస్తోంది. అత్యధికశాతం గ్రూపుల పరిస్థితి ఇలానే ఉన్నట్లు సమాచారం. దీంతో వెలుగు సిబ్బంది వస్తున్నారన్నా, వెలుగు కార్యాలయానికి  వెళ్ళాలన్నా సభ్యులు బెంబేలెత్తుతున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిని అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ బలవంతపు వసూళ్లు ఏమిటని పలువురు వాపోతున్నారు. టీడీపీ  అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా లబ్ధిదారులకు ఇళ్లపై సంపూర్ణ హక్కులు వచ్చేలా చర్యలు చేపడతామని నాయకులు చెబుతుండటంతో పలువురు ఓటీఎ్‌సకు విముఖత చూపుతున్నారు. ఈ కారణంగానే అధికారులు బలవంతపు వసూళ్లకు దిగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 


బలవంతంగా తీర్మానం చేయించారు

నెల్లూరి ఉషారాణి, డ్వాక్రా సభ్యురాలు, చినకొత్తపల్లి

చేతికొచ్చిన పంటలు వర్షాలకు దెబ్బతిని అల్లాడుతున్నాం. ఈ సమయంలో అధికారులు వచ్చి ఓటీఎస్‌ ద్వారా రూ.10వేలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. మా వద్ద  డబ్బులు లేవని చెప్పాం. మా గ్రూపు తరఫున బ్యాంక్‌ లింకేజీ రుణం తీసుకునేందుకు వెలుగు కార్యాలయానికి వెళ్లగా గ్రూపులో ఉన్న ఇద్దరు ఓటీఎస్‌ చెల్లిస్తేనే రుణం మంజూరు చేయిస్తామని మెలిక పెట్టారు. వారిద్దరి వ్యక్తిగత ఖాతాల్లో రూ.10వేలు జమ చేసేలా తీర్మానం చేయించారు. 


స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి నుంచే చెల్లింపులు

కోటేశ్వరరావు, అద్దంకి ఏపీఎం

ఓటీఎస్‌ గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి  నుంచి మాత్రమే నిర్దేశిత మొత్తం జమ చేయిస్తున్నాం. గృహ హక్కుకు అర్హత ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యుల వద్ద డబ్బులు లేకపోతేఆ సంఘంలోని పొదుపు ఖాతా నుంచి రుణం ఇప్పించేలా అవగాహన కల్పిస్తున్నాం. చినకొత్తపల్లిలో స్వయం సహాయక సంఘం చేత రాయించిన తీర్మానం


Advertisement
Advertisement