Abn logo
Sep 18 2021 @ 00:04AM

ఆరుగురి బలవన్మరణం

తిని మృతిచెందిన శివారెడ్డి, వెంకట లక్ష్మమ్మ

మృతులలో దంపతులు, తల్లీబిడ్డ


జిల్లాలో వేర్వేరు చోట్ల ఆరుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతో విషగుళికలు మింగి వృద్ధ దంపతులు... భర్త, అత్త, మామ వేధింపులతో చెరువులో దూకి తల్లీ, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే భర్తతో మనస్పర్ధల కారణంగా తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫేస్‌బుక్‌ పరిచయంతో ప్రేమించిన యువతితో పెళ్లికి ఇంట్లో వద్దన్నందుకు ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


విషగుళికలు మింగి వృద్ధ దంపతులు..

లింగాల, సెప్టెంబరు 17: మండలంలోని మురారి చింతల గ్రామానికి చెందిన శివారెడ్డి (81), వెంకటలక్ష్మమ్మ (78) ఆరు నెలల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ బాధ భరించలేక గురువారం అర్ధరాత్రి ఇద్దరూ కలిసి పొలాలకు ఉపయోగించే విషగుళికలు మింగారు. రాత్రి రెండు గంటలకు శివారెడ్డి మృతి చెందగా, వెంకటలక్ష్మమ్మ బాధ తట్టుకోలేక ఇంటి బయటకు వచ్చి కేకలు వేసింది. దీంతో ఆమెను చికిత్స కోసం పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. వృద్ధ దంపతుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, వారి బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.


చెరువులో దూకి తల్లీ, కొడుకు...

జమ్మలమడుగు రూరల్‌ / మైలవరం, సెప్టెంబరు 17: మైలవరం మండలం దొమ్మరనంద్యాలకు చెందిన చౌడం మాధవి (27), కుమారుడు చౌడం పూజిత (3)లు కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామ సమీపాన ఉన్న చిన్న చెరువులో దూకి గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం స్థానికులు సంజామల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ సమాచారాన్ని మైలవరం పోలీసులకు తెలిపారు. ఈ విషయం మాధవీ తల్లిదండ్రులకు తెలపడంతో వారు చెరువు వద్దకు చేరుకొని బోరున విలపించారు. కాగా దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన మాధవీకి వేపరాల గ్రామానికి చెందిన నాగరాజుతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు ఏడాది క్రితం వేపరాల నుంచి వచ్చి జమ్మలమడుగు నాగులకట్ట వీధిలో నివాసం ఉంటున్నారు. మాధవీ భర్త నాగరాజు కోయంబత్తూరులోని మలబార్‌ సిమెంటు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఇంట్లో భార్య భర్తల మధ్య మనస్ఫర్థలు ఉండేవి. ఈ విషయమై మైలవరం పోలీస్‌స్టేషనలో పోలీసులు వారికి కౌన్సిలింగ్‌ కూడా ఇచ్చారు. అయినా కొన్ని నెలలుగా మాధవీని భర్త నాగరాజు, మామ రామదాసు, అత్త లక్ష్మీదేవి వేధిస్తుండేవారని స్థానికులు అంటున్నారు. దీంతో మనస్థాపానికి గురైన మాధవి కుమారుడు పూజితతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి వెంకటరమణ సంజామల పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


వివాహిత ఉరివేసుకొని..

ఓబులవారిపల్లె, సెప్టెంబరు17 : మండలంలోని బోటుమీదపల్లె దళితవాడకు చెందిన జెల్లి కళ్యాణి(20) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్‌ఐ  వివరాల మేరకు.... చిట్వేలి మండలం నగిరిపాడు ఉప్పరపల్లెకు చెందిన అశోక్‌, కళ్యాణికి రెండేళ్లక్రితం వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా ఈమె భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. శుక్రవారం గ్రామంలోని మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


యువకుడి ఆత్మహత్య

కడప(క్రైం), సెప్టెంబరు 17: కడప నగరం శంకరాపురంలోని భారతీబార్‌ వీధిలో ఓ యువకుడు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చిన్నచౌకు ఎస్‌ఐ అమర్‌నాధ్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు... భారతీబార్‌వీధికి చెందిన మంచ వంశీకృష్ణ(22) బంగారు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన యువతితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడి గత కొన్ని నెలలుగా వీరిరువురు ప్రేమించుకుంటున్నారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానంటూ తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లారు. తెలియని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందోనని ఆ యువకుని మందలించారు. దీంతో మనస్థాపం చెంది శుక్రవారం మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌ మార్చురీకి తరలించి, మృతుడి తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతుడు వంశీకృష్ణ పలు చోరీల్లో నిందితుడిగా ఉన్నాడు.