పరాయి

ABN , First Publish Date - 2020-08-10T11:04:29+05:30 IST

కావడం మాత్రమే మనిషికి తెలుసు ఒక్కొక్కటిగా అన్ని కూసాలనూ వొదుల్చుకుని మనిషిగా తొలి పరాయి పొందాకా పుడమి కొత్తగా జన్మనెత్తింది...

పరాయి

కావడం మాత్రమే మనిషికి తెలుసు

ఒక్కొక్కటిగా అన్ని కూసాలనూ వొదుల్చుకుని

మనిషిగా తొలి పరాయి పొందాకా

పుడమి కొత్తగా జన్మనెత్తింది


ఆదిమ వేపమండల ఛెళ్‌ కారంలో

ఒకే సామూహిక ముఖం కలిగిన జీవి

లీనమౌతుందో అలీనమౌతుందో


లయబద్ధ వొళ్ళు తూలింపులో

పరాయి

పసుపు చారికలానో కుంకుమ రేఖలానో ఉబుకుతుంది


వేల జన్మల వెనక మోగిన భీకర దరువు

నెత్తురు నెలవుల్లోకి చొరబడి

కాయాన్ని మైమరుపు తూలిక చేసినప్పుడు

కదలిక

ద్వైతమౌతుందో అద్వైతమౌతుందో


గరగాటగాడి జారిపోయే కడుపు మీద

భూగోళపు ఖాళీ లోలోతుల్లోకి ముడుచుకుని

కోరపళ్ళు దిగిన కోడిపిల్లల్లాగా విసిరి పడి

కన్ను మీటిన మెరమెర

ఎర్రటి గోళీ చేసినప్పుడు

చూపు

నిశితమౌతుందో తీక్షణమౌతుందో


తన పనిముట్టు తీర్చిన తాను

పనిముట్టు ఉపయోగించే కులయంత్రంలో చక్రమయ్యాకా

గిరిగీసిన సుడిగుండపు లోలోతుల్లోకి వశమైపోయి

మనిషి

కులమయ్యాడో కులమే మనిషయ్యిందో


ఊపిరి కొలతంతా డబ్బులోకి మారిపోయి

పనిలోని పసందంతా మార్కెట్‌ మర్లుతీగై

అనేక ముఖాల లోకంలోకి లోలకమై ఊగులాడినప్పుడు

తాను

తానై ఉన్నాడో తాను ఎవరోయైు ఉన్నాడో... 

ప్రభు

Updated Date - 2020-08-10T11:04:29+05:30 IST