విదేశాల నుంచి భారత్‌కు కొనసాగుతున్న సాయం

ABN , First Publish Date - 2021-05-11T13:14:06+05:30 IST

కరోనా వేళ విదేశాల నుంచి భారత్‌కు ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు మొత్తం 8,900 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు 5,043 ఆక్సిజన్‌ సిలిండర్లు సాయంగా అందాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

విదేశాల నుంచి భారత్‌కు కొనసాగుతున్న సాయం

విదేశాల నుంచి 8,900 ‘ఆక్సిజన్‌’

5 వేల ప్రాణవాయువు సిలిండర్లు అందాయి: కేంద్రం

3 యుద్ధ నౌకల్లో భారత్‌ చేరిన మరింత సాయం

న్యూఢిల్లీ/విశాఖ: కరోనా వేళ విదేశాల నుంచి భారత్‌కు ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు మొత్తం 8,900 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు 5,043 ఆక్సిజన్‌ సిలిండర్లు సాయంగా అందాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే 18 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు, 5,698 వెంటిలేటర్లు/బీఐ పీఏపీ, దాదాపు 3.4 లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ అందుకున్నామని పేర్కొన్నది. వాటిని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించామని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. భారతీయ నౌకాదళానికి చెందిన మూడు యుద్ధ నౌకల్లో సోమవారం విదేశాల నుంచి 80 టన్నుల ద్రవ ఆక్సిజన్‌, 20 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు, 3,150 సిలిండర్లను సంబంధిత సిబ్బంది తీసుకొచ్చారు. 10,000 రాపిడ్‌ యాంటిజన్‌ కొవిడ్‌ టెస్టు కిట్లు, 54 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 450 పీపీఈ కిట్లు కూడా పలు దేశాల నుంచి సాయంగా అందాయి.


భారత నౌక ఐరావత్‌ ద్వారా సింగపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి, ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా నౌకలో ఖతర్‌, కువైత్‌ నుంచి కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకి, ఐఎన్‌ఎస్‌ త్రికంద్‌ నౌక ద్వారా ఖతర్‌ నుంచి ముంబైకి సాయం చేరింది. కాగా, కరోనాతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న భారత్‌కు పెద్ద ఎత్తున ఔషధాలు, వైద్య పరికరాల వంటివి అందించేందుకు యూఏఈకి చెందిన ఎమిరేట్స్‌ విమానయాన సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఢిల్లీలోని గురుద్వారా రకాబ్‌ గంజ్‌ సాహిబ్‌ వద్ద ఉన్న శ్రీ గురు తేజ్‌బహదూర్‌ కొవిడ్‌ చికిత్స కేంద్రానికి బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ రూ.2 కోట్ల సాయం అందించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సిటీ హాస్పిటల్‌ డైరెక్టర్‌, వీహెచ్‌పీ నేత జరబ్‌జీత్‌ సింగ్‌ నకిలీ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను కొని, రోగులకు వేస్తుండడంతో ఆయన ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ పంపలేమంటూ ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్‌ లేఖ రాశారు. కేరళలో నిల్వ ఉంచుకున్న ఆక్సిజన్‌ను ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకు పంపామని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-11T13:14:06+05:30 IST