పాక్ విమాన శకలాల్లోనే కాక్‌పిట్ వాయిస్ రికార్డర్.. స్వాధీనం చేసుకున్న విదేశీ నిపుణులు..

ABN , First Publish Date - 2020-05-29T02:10:00+05:30 IST

ఇటీవల కూలిపోయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కి చెందిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ ఎట్టకేలకు...

పాక్ విమాన శకలాల్లోనే కాక్‌పిట్ వాయిస్ రికార్డర్.. స్వాధీనం చేసుకున్న విదేశీ నిపుణులు..

  కరాచీ: ఇటీవల కూలిపోయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) విమానానికి చెందిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ ఎట్టకేలకు లభించింది. విదేశీ నిపుణులతో కూడిన ఓ బృందం విమాన శకలాల్లోనే వాయిస్ రికార్డర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకుంది. ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత మిస్ అయిన వాయిస్ రికార్డర్ లభించడంతో.. ఈ ఘటనపై విచారణలో మరో కీలక ముందడుగు పడినట్టైంది. గత శుక్రవారం 99 మందితో లాహోర్ నుంచి కరాచీ వస్తున్న ఎయిర్‌బస్ ఏ320 విమానం.. కొద్ది నిమిషాల్లో దిగుతుందనగా జిన్నా విమానాశ్రయం సమీపంలోని కూలిపోయింది. పాకిస్తాన్ చరిత్రలోనే దీనిని అతిపెద్ద విమాన ప్రమాదంగా భావిస్తున్నారు.


ఈ ఘటనలో ఇద్దరు సజీవంగా బయటపడగా.. 97 మంది ప్రాణాలు కోల్పోయారు. జనావాసాలపై పడడంతో కింద ఉన్న మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన తర్వాత బ్లాక్‌బాక్స్‌లోని మరో కీలక భాగమైన ఫ్లైట్ డేటా రికార్డర్‌ కొద్ది గంటలకే దొరికినప్పటికీ.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ మాత్రం దొరకలేదు. ఈ నేపథ్యంలో ఎయిర్ బస్ కంపెనీ ప్రతినిధులు సహా 11 మంది విదేశీ నిపుణులతో కూడిన బృందం ఇవాళ మరోసారి ఘటనా స్థలాన్ని, రన్‌వే ప్రాంతాన్ని సందర్శించింది. విచారణలో అత్యంత కీలక ఆధారమైన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకుంది. 

Updated Date - 2020-05-29T02:10:00+05:30 IST