అటవీచట్టం పలచన!

ABN , First Publish Date - 2021-10-12T08:08:49+05:30 IST

అడవిని పెంచుతామని ప్రపంచ వేదికలకు భారత్‌ వాగ్దానం చేసింది. మూడు బిలియన్‌ టన్నులుగా ఉన్న వార్షిక కార్బన్‌ వినియోగాన్ని 2030 నాటికి 2.5 బిలియన్‌ టన్నులకు కుదిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇందుకోసం రానున్న కాలంలో అటవీ విస్తీర్ణాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అటవీచట్టం పలచన!

  • కేంద్రం తాజా ప్రతిపాదనలతో మరింతగా ‘మళ్లింపు’ ముప్పు 
  • ఇప్పటికే అక్రమ మైనింగ్‌ చెలగాటం 
  • ఉల్లంఘనలపై కోర్టుల్లో వ్యాజ్యాలు
  • చట్టం కఠినంగా ఉండగానే ఇదంతా.. సరళతరంచేసే యోచనలో కేంద్రం


అడవిని పెంచుతామని ప్రపంచ వేదికలకు భారత్‌ వాగ్దానం చేసింది. మూడు బిలియన్‌ టన్నులుగా ఉన్న వార్షిక కార్బన్‌ వినియోగాన్ని 2030 నాటికి 2.5 బిలియన్‌ టన్నులకు కుదిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇందుకోసం రానున్న కాలంలో అటవీ విస్తీర్ణాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇందుకుభిన్నంగా ఇతర అవసరాల కోసం ‘అటవీ మళ్లింపు’ అనేది ఇటీవలికాలంగా బాగా పెరిగిపోయింది. ‘అడవిని కొట్టుకుంటాం.. అభివృద్ధి ప్రాజెక్టులు కట్టుకుంటాం’ అంటూ రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి పెంచేస్తున్నాయి. అటవీ భూముల్లో గనుల అక్రమ తవ్వకాలపై కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అరణ్యాల్లో ప్రైవేటు అవసరాలకు రోడ్లు వేయడంపై ట్రైబ్యునళ్లలో పడే పిటిషన్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అడవిని కవచంలా కాస్తున్న అటవీ పరిరక్షణ చట్టం - 1980ను సరళతరం చేయాలని, ‘అడవి’ని నిర్వచించాలనే డిమాండ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని తాజాపరచాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ చట్టం? రాష్ట్రాలకు, ప్రైవేటు వ్యక్తులకు ఏం కష్టం? అనేది పరిశీలిస్తే... 


ఏమిటీ చట్టం?

పచ్చని అరణ్యాలను కాపాడుకునేందుకు 1980లో తొలిసారి అటవీ పరిరక్షణ చట్టం తీసుకువచ్చారు. వలస పాలకుల హయాంలో అమలుచేసిన అటవీ చట్టం- 1927కు ఇది కొనసాగింపు. దుంగలను కొట్టి అక్రమంగా అడవిని దాటించేవారిని నియంత్రించేందుకు బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన చట్టం ఇది. దానిని మరింత సంస్కరించి తెచ్చినదే అటవీ పరిరక్షణ చట్టం.. కేంద్ర ప్రభుత్వానికి విశేష అధికారులను కట్టబెట్టింది. అటవీ భూముల్లో అటవీయేతర కార్యకలాపాలను రాష్ట్రాలు చేపట్టాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. అడ్వైజరీ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రాల వినతులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. 


ప్రతిపాదనలివీ...

అటవీ విస్తీర్ణం పెంచేందుకు కేంద్రం తీసుకునే చర్యలు.. చాలా సందర్భాల్లో రాష్ట్రాలు, ప్రైవేటు వ్యక్తులు చేపట్టే అభివృద్ధి ప్రణాళికలు ముందుకు పోకుండా అడ్డుకుంటున్నాయి. ఇటీవల కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి ఇదీ ఒక కారణమే. ఈ క్రమంలో అటవీ పరిరక్షణ చట్టాన్ని తాజా పరిచేందుకు కేంద్రం సిద్ధమైంది.  మార్పులు ఎలా ఉంటాయన్నది ఇటీవలవరకు బయటకు పొక్కలేదు.  ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ ‘పరిరక్షణ పత్రం’ పేరిట తన ప్రతిపాదనలను బహిరంగ చర్చకు ఉంచింది. వచ్చే 15 రోజుల్లోగా ఈ ప్రతిపాదనలపై స్పందించాలని ప్రజలను కోరింది. ప్రాజెక్టు డెవలపర్లకు అనుకూలంగా తయారైన ప్రతిపాదనలివీ. అటవీ భూములను అటవీయేతర అవసరాలకు వాడుకునేందుకు ఇప్పుడు రాష్ట్రాలు, ప్రైవేటు డెవలపర్లు కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందే. కానీ, కొన్నిరకాల మౌలిక కల్పన ప్రాజెక్టులను దీనినుంచి మినహాయించాలని తాజాగా ప్రతిపాదించారు. అటవీ భూముల మళ్లింపునకు ఇప్పటివరకు చట్టపరంగా ఉన్న కఠిన నియంత్రణలను తాజా ప్రతిపాదనలు మొత్తంగానే సడలించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి ఇవి ప్రతిపాదనలు మాత్రమే. ప్రజాభిప్రాయ సేకరణ దశలోని ఈ ప్రతిపాదనలను కేబినెట్‌ చర్చించాల్సి ఉంది. ఆ తర్వాత పార్లమెంటు ముందుకు కేంద్రం ప్రతిపాదనలు వెళ్లి.. అక్కడా ఆమోదం పొందితే అటవీ పరిరక్షణ చట్టానికి మరో సవరణ జరుగుతుంది. 


మినహాయింపులు వీటికే.. 

అటవీ పరిరక్షణ చట్టం అమల్లోకి రాకముందు, అంటే 1980కి ముందు కేంద్ర రైల్వే శాఖ, కేంద్ర రోడ్డు రవాణా శాఖల పరిధిలో ఉన్న భూముల్లో జరిపే కార్యకలాపాలకు అనుమతులు అవసరం లేదు. 

జాతీయభద్రత దృష్ట్యా అటవీ భూముల్లో చేపట్టే  ప్రాజెక్టులను చట్టం నుంచి మినహాయించారు.  

రోడ్లు, టవర్లు వంటి సరిహద్దుల్లోని మౌలిక కల్పన పనులు చేయాలంటే కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు.  

వీటిని మినహాయిస్తే.. అనుమతి లేకుండా అటవీ భూములను వేరే కార్యకలాపాలకు మళ్లించే ఏజెన్సీలు, వ్యక్తులకు జరిమానా, జైలుశిక్ష విధిస్తారు. 


చట్టానికి సవరణలు.. 

అమల్లోకి వచ్చిన ఇన్నాళ్లలో అటవీ పరిరక్షణ చట్టానికి రెండు సవరణలు జరిగాయి. తాజాగా ఈ ఏడాది మార్చిలో మరో సవరణను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటివరకు 1988లో ఒకసారి, 1996లో రెండోసారి చట్టాన్ని సవరించారు. సుప్రీంకోర్టు ‘అడవి’ అనే పదానికి ఉన్న నిర్వచనాన్ని విస్తృతం చేస్తూ 1996లో కీలక తీర్పును వెలువరించింది. అప్పటివరకు కూడా... అటవీ చట్టం- 1927 పరిధిలోకివచ్చే భూములు, ఇతర స్థానిక భూములు, అటవీ శాఖ నియంత్రణ, నిర్వహణలోని భూములను మాత్రమే ‘అటవీ భూములు’గా ఎంచేవారు. వాటి పరిధిలోనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అమలయ్యేవి. గోదావర్మన్‌ తిరుముల్‌పాడ్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 1996లో ముఖ్యమైన పరిశీలనలు చేసింది. అనుభవం, యాజమాన్యం, వర్గీకరణ, గుర్తింపుతో సంబంధం లేకుండా అటవీ శాఖ రికార్డుల్లో పొందుపరిచినవాటిన్నింటినీ ‘అటవీ భూములు’గానే పరిగణించాలని కోర్టు రూలింగ్‌ ఇచ్చింది.


అలాగే ‘అడవి’ అనే పదానికి ఉన్న నిఘంటువు అర్థంతో సరిపోలే భూములను కూడా ఈ జాబితాలోకే తెచ్చింది. అంతేకాదు.. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ అధ్యయనం జరిపి గుర్తించే భూములను కూడా అటవీ పరిరక్షణ చట్టం పరిధిలోకి తెచ్చారు. అభివృద్ధి పనుల కోసం డీనోటిఫై చేసినప్పుడు..ప్రస్తుత నెట్‌ విలువ, ఆర్థిక విలువల ఆధారంగా పరిహారం చెల్లించే పద్ధతికీ కోర్టు తీర్పు తొలిసారి వీలు కల్పించింది. అలాగే, అటవీ పునఃసృష్టి నిధిని ఏర్పాటుచేయాలని, తీసుకున్న భూమికి సమానంగా వేరేచోట భూమిని కేటాయించాలని కూడా స్పష్టం చేసింది.   


సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2021-10-12T08:08:49+05:30 IST