అరణ్య రోధన!

ABN , First Publish Date - 2020-02-23T05:47:21+05:30 IST

సుమారు 10 వేల హెక్టార్లు విస్తరించి రెండు బీట్‌లుగా విభజించి చుట్టూ 29 గ్రామాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎత్తైన్న కొండలు, లోయలు లేకపోయినా చిట్టి పొట్టి చెట్లతో దట్టంగా

అరణ్య రోధన!

వేటగాళ్ల తూటాలకు మూగ జీవుల బలి

నాటుబాంబులు పెట్టి ప్రాణాలు తీస్తున్న వైన్యం

గుట్టుచప్పుడు కాకుండ పట్టణ ప్రాంతాల్లో మాంసం విక్రయం


దొరవారిసత్రం, ఫిబ్రవరి 22:

సుమారు 10 వేల హెక్టార్లు విస్తరించి రెండు బీట్‌లుగా విభజించి చుట్టూ 29 గ్రామాల మధ్యలో  ఉన్న అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎత్తైన్న కొండలు, లోయలు లేకపోయినా చిట్టి పొట్టి చెట్లతో దట్టంగా కప్పబడింది. ఆ అడవిలో అనేక రకాల మూగ జీవులు సంచరిస్తుంటాయి. వాటిపై వేటగాళ్ల కన్నుపడింది. గుట్టుచప్పుడు కాకుండా మూగ జీవులను సంహరిస్తున్నారు. వారి బారీ నుంచి తప్పించు కోవడంలో మూగజీవుల రోదన అరణ్య రోధనగా మారింది. 


దొరవారిసత్రం మండలంలో కల్లూరు రిజర్వు ఫారెస్టుగా పిలవబడే అటవీ  ప్రాంతం సుమారు 10 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. అటవీశాఖ రికార్డుల ప్రకారం దొరవారిసత్రం బీట్‌ కింద కల్లూరు ఆర్‌ఎఫ్‌, సూళ్లూరుపేట బీట్‌ కింద పోలిరెడ్డిపాళెం ఆర్‌ఎ్‌ఫగా నమోదైంది. రెండు బీట్‌లు సూళ్లూరుపేట సెక్షన్‌ పరిధిలోనివే. అయితే అటవీ భూ భాగం చుట్టూ 29 గ్రామాలు ఉన్నాయి. ఈ అడవిలో దుప్పెలు, అడవి పందులు, నక్కలు, తోడేళ్లు వంటి జంతు జాతి మూగ జీవులతో పాటు, పక్షి జాతికి చెందిన అనేక రకాలు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా వేట సాగుతోంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న కొన్ని గ్రామాల్లో పేదలకు నగదు ఎరగా చూపి బయట వ్యక్తులు వారితో వేట సాగిస్తున్నారు.

 

నాటు బాంబులతో సంహరణ

ఈ అడవిలో వేల సంఖ్యలో అడవి పందెలు, దుప్పెలు (చుక్కల జింకలు) సంచరిస్తున్నట్లు రికార్డులున్నాయి. వీటిపై దృష్టి పెట్టిన వేటగాళ్లు నాటు బాంబులు ఉపయోగించి సంహరిస్తున్నారు. అడవిని ఆనుకుని ఉన్న పంట చేలల్లో, చెరువుల వద్ద, అడవిలో సంచరించే దార్లు వద్ద నాటు బాంబులు ఏర్పాటు చేస్తున్నారు. వాటిదాటికి చనిపోయిన జంతువుల మాంసాన్ని పట్టణ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఈ నెల 2వ తేదీన గొర్రెల కోసం అడవిలోకి వెళ్లిన శ్రీధనమల్లి గ్రామానికి చెందిన పడ్డాల కృష్ణారెడ్డి జంతువుల సంహరణకు పెట్టిన నాటుబాంబును తొక్కడంతో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఈ వేట వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శ్రీధనమల్లి, బొందలపాళెం, పోలిరెడ్డిపాళెం, గ్రామాలకు చెందిన కొందరు వేట సాగిస్తున్నట్లు తెలిసింది.


పట్టించుకోని అటవీశాఖ అధికారులు

అడవిలో నాటు బాంబులతో వేట సాగిస్తున్న విషయం బయటపడినా అటవీశాఖ అధికారుల్లో చలనం లేదు. అడవిలో చంపబడుతున్న మూగ జీవులను రక్షించేలా వేట గాళ్లపై దృష్టి పెట్టని పరిస్థితి. శ్రీధనమల్లి ఘటనలో బాధితుడు స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు ఈ వేట ఎంత కాలంగా సాగుతోంది, ఎవరు చేస్తున్నారు అనేకోణంలో చుట్టు పక్కల గ్రామాలపై నిఘా పెట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలున్నాయి.


పందులు మాత్రమే చంపుతున్నారు

అటవీ ప్రాంతంలో చుక్కల జింకల వేట జరగడం లేదు. పందులను మాత్రం ఒక్కటి రెండు చోట్ల చంపుతున్నట్లు సమాచారం ఉంది. వారిని కూడా పట్టు కుంటాం. వారు కూడా పొలాల వద్ద పెట్టి చంపుతున్నట్లు తెలిసింది. అడవిలో అయితే ఎవ్వరూ వేట సాగించడం లేదు. ఈ ప్రాంతంలో తుపాకీ చప్పుళ్లు లేవు. నాటు బాంబుల వ్యవహారంపై నిఘా పెడుతాం.

- ఎం. కోటేశ్వరరావు, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, సూళ్లూరుపేట

Updated Date - 2020-02-23T05:47:21+05:30 IST