అడవివరం బంగారమ్మ ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2021-10-18T05:47:34+05:30 IST

సింహాద్రి అప్పన్న స్వామి సోదరి, అడవివరం, తదితర ఐదు గ్రామాల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న బంగారమ్మతల్లి ఆలయంలో చోరీ జరిగింది.

అడవివరం బంగారమ్మ ఆలయంలో చోరీ
హుండీని పరిశీలిస్తున్న మంత్రి, ఈవో.. పక్కన వివరాలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌

48 గంటల్లోగా నిందితులను పట్టుకుని శిక్షించాలి

పోలీసులకు మంత్రి ముత్తంశెట్టి ఆదేశం

సింహాచలం, అక్టోబరు 17: సింహాద్రి అప్పన్న స్వామి సోదరి, అడవివరం, తదితర ఐదు గ్రామాల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న బంగారమ్మతల్లి ఆలయంలో చోరీ జరిగింది. పోలీసులు, దేవస్థానం అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం ఆలయాన్ని యథావిధిగా శుభ్రం చేసేందుకు నాలుగో తరగతి ఉద్యోగిని బర్ల మహాలక్ష్మి ఆలయానికి రాగా.. తలుపులు తెరిచి ఉండడంతో అర్చకుడు సంతోష్‌శర్మకు సమాచారం అందించింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి, అధికారులతో కలిసి ఆలయంలోకి వెళ్లి హుండీ పగులగొట్టి ఉన్నట్టు ధ్రువీకరించుకున్నారు. తక్షణమే గోపాలపట్నం పోలీసులకు దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారు. క్లూస్‌ టీమ్‌తో వెస్ట్‌ సీఐ లూథర్‌బాబు, ఎయిర్‌పోర్టు ఎస్‌ఐ కాంతారావు ఆలాయానికి చేరుకున్నారు. వేలిముద్రలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అప్పన్న దర్శనానికి వచ్చిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈవో సూర్యకళతో కలిసి ఆలయానికి చేరుకుని చోరీపై ఆరా తీశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి దోషులను 48 గంటల్లోగా పట్టుకుని, శిక్షించాలని పోలీసులకు ఆదేశించారు. అలాగే ఉపాలయాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, శాశ్వత ప్రాతిపదికన గార్డులను నియమించాలని ఈవోకు సూచించారు.


Updated Date - 2021-10-18T05:47:34+05:30 IST