Abn logo
Jul 9 2020 @ 05:45AM

వలస జీవుల అరణ్య రోదన

రహదారులు, విద్యుత్‌, తాగునీరు లేక అవస్థలు

పట్టించుకోని పాలకులు, అధికారులు 

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గొత్తికోయలు


కరకగూడెం, జూలై 8: ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన గొత్తికోయల అరణ్య రోదన పట్టించుకునేవారు కరువయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలానికి 2002లో వలస వచ్చిన ఆదివాసుల గుడేలకు నేటికీ రహదారులు, తాగునీటి సౌకర్య, విద్యుత్‌, విద్య, వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు, లిమ్మగూడెం, రేగళ్ల, నిలాద్రిపేట, అంగారుగూడెం, చొప్పాల అడవి ప్రాంతాల్లో ఇళ్లు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న ఆదివాసులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. వర్షాలు కురిస్తే కాలు బయట పెట్టలేని పరిస్థితి వారిది.


రాత్రి వేళల్లో పాములు, తేళ్లు ఇళ్లల్లోకి వస్తుంటాయని, వాటి భారిన పడితే ప్రాణాలు గాల్లో కలిసినట్లేనని వాపోతున్నారు. ఓట్ల సమయంలో తప్ప ఎవరూ తమవైపు చూడటం లేదని వలస గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పద్మాపురం పంచాయతీలోని వలస ఆదివాసీ గ్రామైన నీలాద్రిపేట సమస్యలకు నిలయంగా ఉంది. ఈ గ్రామానికి వెళ్లేందు రహదారిలేదు. ఆ గ్రామంలో 35 కుటుంబాలు, 290 మంది జనాభా ఉంటారు. కానీ విద్యుత్‌, తాగునీరు, రహదారి, ప్రభుత్వ పాఠశాల వంటి సౌకర్యాలు లేవు. ఆశ్వాపురం పాడు, లిమ్మగూడెం, అంగారుగూడెం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 


అందకారంలో ఉంటున్నాం.. నిలాద్రిపేట గిరిజనులు

బతుకు దెరువు కోసం వలస వచ్చి ఎళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికి మా గ్రామాలకు రహదారులు లేవు. తాగునీరు లేక తోగు నీరు తెచ్చుకుంటున్నాం. విద్యుత్‌ లేక అందకారంలో ఉంటున్నాం. వర్ష కాలం వస్తే రకపోకలకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మా సమస్యలను పరిష్కరించాలి. 

Advertisement
Advertisement