రూ.122 కోట్ల ఆస్తుల జప్తు

ABN , First Publish Date - 2020-10-17T05:51:08+05:30 IST

దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌), దాని మాజీ ప్రమోటర్లు టీ వెంకట్రామ్‌ రెడ్డి, టీ వినాయక్‌ రవి రెడ్డి,

రూ.122 కోట్ల ఆస్తుల జప్తు

దక్కన్‌ క్రానికల్‌, మాజీ ప్రమోటర్లపై ఈడీ చర్య

మొత్తం అటాచ్‌ చేసిన ఆస్తులు రూ.265 కోట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌), దాని మాజీ ప్రమోటర్లు టీ వెంకట్రామ్‌ రెడ్డి, టీ వినాయక్‌ రవి రెడ్డి, వీరి బినామీ కంపెనీకి చెందిన రూ.122.15 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. యాంటీ మనీ లాండరింగ్‌ చట్టం కింద ఈ చర్యలు చేపట్టింది. రుణాల కుంభకోణం కేసులో న్యూఢిల్లీ, హైదరాబాద్‌, గురుగ్రామ్‌, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లోని 14 ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.


ఈ ఆస్తులు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) విచారణ చేస్తున్న దివాలా కేసు పరిధిలో లేవు. డీసీహెచ్‌ఎల్‌ ఆస్తులను అటాచ్‌ చేయడం ఇది రెండోసారి. దీంతో జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.264.56 కోట్లకు చేరింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన దివాలా పరిష్కార ప్రణాళిక రూ.400 కోట్లు మాత్రమే ఉంది. డీసీహెచ్‌ఎల్‌, దాని ప్రమోటర్లు దాదాపు రూ.8,180 కోట్ల రుణాల కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ పేర్కొంది. డీసీహెచ్‌ఎల్‌ ప్రమోటర్లు ప్రణాళికబద్ధంగా ఆస్తులు, అప్పుల పట్టికలో అవకతవకలకు పాల్పడ్డారని, లాభాలను, ప్రకటనల ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపారని ఈడీ పేర్కొంది.


అలానే రుణాలను తక్కువ చేసి చూపినట్లు, తద్వారా బ్యాంకులను, వాటాదారులను మోసం చేసినట్లు పేర్కొంది. దివాలా ప్రక్రియను ప్రారంభించినప్పటికీ.. ప్రమోటర్లు వారి కుటుంబ సభ్యులు పరోక్షంగా కంపెనీపై నియంత్రణను కొనసాగిస్తున్నారని, ఉన్నత స్థాయి పదవుల్లో కొనసాగుతూ భారీ స్థాయిలో వేతనాలు పొందుతున్నారని ఈడీ పేర్కొంది. 

ఒక బ్యాంకు వద్ద తీసుకున్న రుణాన్ని మరో ఫైనాన్షియల్‌ సంస్థలకు తెలియకుండా దాచిపెట్టారని, గత కొన్నేళ్లుగా డీసీహెచ్‌ఎల్‌ రూ.15,000 కోట్లకు పైగా రుణాలను పొందినట్లు తెలిపింది. నిర్వహణ మూలధనం కోసం తీసుకున్న రుణాలను బ్యాంకుల అనుమతి లేకుండా ఇతర ప్రాజెక్టులపై అనవసరంగా ఖర్చు చేయడం వంటి చర్యల ద్వారా చివరకు నష్టాలను చూపిందని, రుణాలను భారీ మొత్తంలో ఎటువంటి చట్టబద్ధమైన వ్యాపారం చేయని అనుబంధ సంస్థలకు మళ్లించిందని ఈడీ తెలిపింది.

వివిధ ట్రస్టులకు అనుమానస్పద  డొనేషన్లు చేసినట్లు చూపిందని.. ఇవి అనుమానస్పదంగా ఉన్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపింది.  


Updated Date - 2020-10-17T05:51:08+05:30 IST