బాధ్యత మరిచి ‘భజన’!

ABN , First Publish Date - 2021-01-10T07:54:31+05:30 IST

వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై విరుచుకుపడిన తీరు ఇది! మంచిదే! నేతలుగా వారు సహచర ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవాల్సిందే. వారి ప్రయోజనాలను రక్షించాల్సిందే! కరోనా కష్టకాలంలో ఎన్నికలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించాల్సిందే! కానీ...

బాధ్యత మరిచి ‘భజన’!

ఉద్యోగ సంఘాల నేతల వింత వైఖరి

సహచరుల కోసం పోరాటాలు పక్కకు..

సర్కారు పెద్దల ప్రాపకం కోసం పాట్లు

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం

ప్రాణాలు పణంగా పెడతారా అని ధ్వజం

గతంలో కరోనా వేళ సర్కారు కాఠిన్యం

ఆఫీసుకు వచ్చి తీరాలని స్పష్టీకరణ

భారీగా కరోనా బారిన ఉద్యోగులు

స్కూళ్లు, కాలేజీలన్నీ తెరిచిన సర్కారు

ఇళ్ల పట్టాల పంపిణీ పేరిట సభలు

వాటిపై నోరెత్తని ఉద్యోగ నేతలు

పెండింగ్‌లో పీఆర్సీ, ఐదు డీఏలు 

వీటిపైనా ప్రశ్నించలేని నిస్సహాయత


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

  • ఇప్పుడు ఎన్నికలు పెడతారా? మీకు ఉద్యోగుల ప్రాణాలు పట్టవా?
  • ఎన్నికలు వాయిదా వేయాల్సిందే! లేదంటే మేమే బహిష్కరిస్తాం!
  • రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీరును రాష్ట్రమంతా గమనిస్తోంది! ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరా?

వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై విరుచుకుపడిన తీరు ఇది! మంచిదే! నేతలుగా వారు సహచర ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవాల్సిందే. వారి ప్రయోజనాలను రక్షించాల్సిందే! కరోనా కష్టకాలంలో ఎన్నికలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించాల్సిందే! కానీ... ‘ఉద్యోగ సంఘాల స్వరం ఎవరికి అనుకూలంగా పలుకుతోంది? నిజంగా వారు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నారా? లేక... సర్కారు పెద్దలు చెప్పిన పలుకులనే చిలకల్లా పలుకుతున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వాలకు విన్నవించుకుని... వినకుంటే డిమాండ్‌ చేసి... అప్పటికీ కాదంటే పోరాడాల్సిన పలు ఉద్యోగ సంఘాల నేతలు సర్కారుకు భజన చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శిస్తున్నారు.


కరోనా సమయంలో కాఠిన్యం

స్థానిక ఎన్నికల విషయంలో సర్కారు, ఎస్‌ఈసీ మధ్య లడాయి జరుగుతోంది. మొదట్లో కరోనా అని, తర్వాత టీకా కార్యక్రమం పేరిట ఎన్నికలకు సర్కారు ససేమిరా అంటోంది. ఇప్పుడు ఎస్‌ఈసీ ఏకంగా ఎన్నికల షెడ్యూలు ఇచ్చేశారు. దీనిని అడ్డుకునేందుకు తనవైపు నుంచి ‘ప్రతివ్యూహం’ సిద్ధం చేసుకుంటోంది. ఇంతలోనే పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఎస్‌ఈసీపై విరుచుకుపడ్డారు. ‘కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టి మా ప్రాణాలు బలితీసుకుంటున్నారు’ అన్నట్లుగా మండిపడ్డారు. రాష్ట్రంలో 8వేల నుంచి పదివేల కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ప్రభుత్వం తమపట్ల కఠినంగా వ్యవహరించినప్పుడు వీరిలో ఎంతమంది స్పందించారనే అంశంపై ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ‘‘కొవిడ్‌ తీవ్రంగా ఉంది. ఆఫీసులకు రోజూ రావడం కష్టం. 50శాతం హాజరవుతాం’’ అని సచివాలయ ఉద్యోగులు వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎస్‌ స్వయంగా వారి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. అనేక శాఖాధిపతుల కార్యాలయాలు ఇరుకు ఇరుకుగా, గాలీవెలుతురు లేని గదుల్లో నడుస్తున్నాయి. అయినా సరే, రోజూ డ్యూటీకి రావాల్సిందే అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పుడు కరోనా పేరిట ఎస్‌ఈసీపై దండయాత్ర చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు... అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక పోయారు.


సహచరులు బలైపోయినా... 

కరోనా కేసులు ప్రబలంగా ఉన్నప్పుడే శ్రీకాళహస్తిలో ఓ ఎమ్మెల్యే భారీ ప్రదర్శన చేశారు. ఆ తర్వాత అక్కడ కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగులే ఎంతోమంది బాధితులయ్యారు. పెద్దసంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు మరణించారు. అప్పుడెవరూ ఉద్యోగ నేతలు ఉలకలేదు, పలకలేదు. కరోనాతో మరణించిన ఉద్యోగులెవరికీ సర్కారు నుంచి ప్రత్యేక సహాయం అందలేదు. కరోనా తగ్గడం, పెరగడం అనే వాదనలను పక్కనపెడితే... రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వందశాతం నడుస్తున్నాయి. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించారు. ఇప్పటి వరకు  ప్రారంభించని విద్యాసంస్థల ను 18 నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ఊరూరా సభలు పెట్టి మరీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. రేషన్‌ షాపుల ముందు ప్రజ లు క్యూల్లో నిల్చుంటున్నారు. అనేక కార్యక్రమాల్లో ఉద్యో గులూ పాల్గొంటున్నారు. సహచరుల ప్రాణాలు, భద్రతపట్ల ఉద్యోగ సంఘాల నేతలకు ఆందోళన ఉంటే ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదు? ఎన్నికలను మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


హక్కుల కోసం పోరాటం ఎక్కడ?

ఉద్యోగ సంఘాలున్నది ఉద్యోగుల హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకే! ప్రభుత్వానికీ, ఉద్యోగులకూ మధ్య వారధిగా ఉండి... సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలి. ఇప్పుడు డిమాండ్లు, పోరాటాలు పక్కనపెట్టి... ప్రభుత్వ పెద్దల ‘మనసెరిగి నడుచుకోవడం’పైనే దృష్టిపెట్టారనే విమర్శలున్నాయి. కరోనా సమయంలో కోతేసిన జీతాన్ని వడ్డీతో కలిపి చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పునే తప్పు పట్టిన వైనం దీనికి నిదర్శనమని చెప్పవచ్చు. విజయ దశమి మరుసటి రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తూ జారీ చేసిన జీవోను తర్వాత రద్దు చేశారు. ఉద్యోగుల కోసం సీఎస్‌ జారీ చేసిన జీవోకే దిక్కులేకుండా పోయింది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలెవరూ స్పందించలేదు. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగ సంఘాల నాయకులకు గౌరవం, విలువ ఇచ్చేది. వారు కోరుకున్నప్పుడు సీఎం అపాయింట్‌మెంట్‌ దక్కేది. ఇప్పుడు సీన్‌ మొత్తం మారిపోయింది. ఎవరైనా ఉద్యోగుల సమస్యలపై కొంచెం గట్టిగా మాట్లాడినా, పిలిచి క్లాస్‌ తీసుకుంటున్నారు. దీంతో వారు ‘గప్‌చుప్‌’. ఇక... పదవీ విరమణ ముందు ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుంటే మంచిదని కొందరు ఉద్యోగ నేతలు పడరాని పాట్లు పడుతున్నారనే ఆరోపణలున్నాయి.


ఏప్రిల్‌లో అయితే ఓకేనా?

ఫిబ్రవరిలో ఎన్నికలపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోగానే ఉద్యోగ సంఘాల నేతలకు ఎక్కడలేని కోపమొచ్చింది. అయితే... అంతకుముందురోజే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ‘ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహిస్తాం’ అని ప్రకటించారు. ఫిబ్రవరిలో వద్దంటున్న ఉద్యోగ నేతలు... ఏప్రిల్‌లో కూడా వాటిని జరపొద్దని, కాదూ కూడదని షెడ్యూలు ఇస్తే విధులను బహిష్కరిస్తామని చెప్పగలరా? తిరుపతి ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూలు ఇస్తే వ్యతిరేకిస్తారా? మార్చి 31 తర్వాత నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయ్యాక... ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైతే, ఇవే ఉద్యోగ సంఘాల నేతలు ‘ససేమిరా’  అనగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియనివి కావని... ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కొందరు, వారి ఆదేశాలతో మరికొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఎస్‌ఈసీపై ధ్వజమెత్తుతున్నారని చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను నిర్వహించారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలనే నిర్వహించారు. ఆయా రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలెవరూ ఎన్నికల నిర్వహణను ప్రశ్నించలేదు. ‘విధులు బహిష్కరిస్తాం’ అని హెచ్చరించనూ లేదు. పైగా... అప్పటితో పోల్చితే ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ ఎస్‌ఈసీపై విమర్శలు గుప్పించడానికి కారణమేమిటో ఊహించలేనిది కాదు!


వీటిపై పోరాడతారా సారూ!

కరోనా సమయంలో ఎన్నికలొద్దని ఎస్‌ఈసీపై ధ్వజమెత్తిన ఉద్యోగ సంఘాల నేతలు... తమ నిజమైన సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించి, పోరాడాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. అవేమిటంటే..

  • వేతన సవరణ  (పీఆర్సీ) సంగతి ఎంతకీ తేల్చడంలేదు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయండి ప్లీజ్‌.
  • రెండు డీఏలు పెండింగ్‌లో ఉంటేనే ప్రభుత్వంపై కన్నెర్ర చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సర్కారును ఒప్పించి ఆ డీఏలు మంజూరు చేయించండి.
  • కొత్త పెన్షన్‌ వద్దని, పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని లక్షలాది మంది ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని గట్టిగా అడగండి.

పెళ్లికి 2500 మంది రావచ్చు, కానీ...

‘‘ఉద్యోగ సంఘాల నేతలు స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం దారుణం. రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇంట్లో గతవారం జరిగిన పెళ్లికి 2500 మంది హాజరయ్యారు. ఒక పంచాయతీలో ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్‌ బూత్‌కు 600 మందికి మించిరారు. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో నాకు అర్థం కావడం లేదు’’

సబ్బం హరి


ఉపసంహరించుకోకుంటే బహిష్కరిస్తాం..

‘‘ఎన్నికల నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. కొవిడ్‌ స్ట్రెయిన్‌, బర్డ్‌ప్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలి. లేని పక్షంలో ఎన్నికల విధులు  బహిష్కరిస్తాం. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌ జరుగుతోంది. ఈ సమయంలో నోటిఫికేషన్‌ విడుదల చేయడమేంటి? రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలు దఫాలుగా ఎన్నికల కమిషనర్‌కు తెలియజేశాం. సీఎస్‌ కూడా ఇదే విషయాన్ని ఆయనకు వివరించారు. ఎన్నికలు పెడితే ప్రజలు కూడా కరోనాతో భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదముంది’’ 

- చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు 


ఎస్‌ఈసీకి ఉద్యోగుల ప్రాణాలు పట్టవా?

‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనలేం. కరోనా కారణంగా 100 మందికి పైగా రెవెన్యూ ఉద్యోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎస్‌ఈసీకు ఉద్యోగుల ప్రాణాలు పట్టవా? వ్యాక్సినేషన్‌ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వంతో సయోధ్యలేకపోతే ఎన్నికలతోపాటు సంక్షేమ పథకాల అమలుకు కూడా నిమ్మగడ్డ అనుమతి ఇవ్వాలి. నిమ్మగడ్డ పునారాలోచించి పంతానికి పోకుండా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ 

-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఉద్యోగుల జేఏసీ, అమరావతి చైర్మన్‌ 


వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవద్దు..

‘‘ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవద్దు. ఏపీలో కరోనా ఎలా నియంత్రణలోకి వచ్చింది ఎన్నికలసంఘం తెలుసుకోవాలి. ఉద్యోగులు కరోనా సమయంలో పనిచేసినందుకే అది సాధ్యపడింది. ప్రపంచ వ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌, బ్రిటన్‌స్ట్రెయిన్‌ వస్తున్నాయని చెబుతున్నారు. దీనివల్ల ఉద్యోగులు ఎన్నికల విధుల నిర్వహణకు మానసికంగా సిద్ధంగా లేరు. ఎన్నికల సంఘం ఏకపక్ష విధానం సమంజసం కాదు.  వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే ఎన్నికలుపెట్టాలి. కనీసం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేదాకైనా ఆగాలి’’

- కేఆర్‌ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు


వ్యాక్సిన్‌ ఇచ్చి జరిపితే ఓకే

‘‘ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధుల్లో పాల్గొనలేం. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వాన్ని కోరాం. మొత్తం 64 సంఘాలం చర్చించి ఇదే నిర్ణయానికి వచ్చాం. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గలేదు. అయినప్పటికీ ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇంత అత్యవసరంగా ఎన్నికల నిర్వహణకు పూనుకున్న ఎస్‌ఈసీ.. ఐదేళ్లలో ఎందుకు ఎన్నికలను నిర్వహించలేదు? తన ప్రయోజనాల కోసం ఉద్యోగుల బతుకులను బలి చేయడం సరికాదు. కరోనాకు వ్యాక్సినేషన్‌ ఆరంభమవుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఏమిటి? ఎన్నికల కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు. ఆ ధైర్యం మాకు లేదు. ఒక వ్యక్తి ఇగోను సంతృప్తి పరచడానికి ఈవిధంగా వ్యవహరించడం సరికాదు. బలవంతంగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. వేసవిలో ఎన్నికలు నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది’’

-  వెంకటరామిరెడ్డి, గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌

Updated Date - 2021-01-10T07:54:31+05:30 IST